అక్కడా వర్కౌట్ కాని చిచా కామెడీ..!
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో వచ్చిన ఫంకీ సినిమాలోని కామెడీ మరీ నాసిరకంగా ఉందంటూ రివ్యూలు వచ్చాయి.;
జాతిరత్నాలు సినిమాతో ఒక్కసారిగా దర్శకుడిగా లైమ్ లైట్‌లోకి వచ్చిన దర్శకుడు అనుదీప్. కొత్త రకం కామెడీతో ఆకట్టుకున్న అనుదీప్‌ని తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ పిలిచి మరీ అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశంను అనుదీప్ సద్వినియోగం చేసుకోలేక పోయాడు. ప్రిన్స్ అంటూ వచ్చిన అనుదీప్ రెండో సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. అనుదీప్ కేవలం కామెడీ సబ్జెక్ట్‌లు మాత్రమే డీల్ చేస్తాడనే ఉద్దేశంతో నాగవంశీ కాస్త ఎక్కువ నమ్మకం పెట్టుకుని ఆయనతో సినిమాకు రెడీ అయ్యాడు. విశ్వక్ సేన్ హీరోగా అనుదీప్ దర్శకత్వంలో ఫంకీ తెరకెక్కి ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జాతిరత్నాలు రేంజ్ కామెడీ ఉంటుంది అంటూ మేకర్స్ చెబుతూ వచ్చారు. హీరో విశ్వక్ సేన్ సైతం చాలా నమ్మకంగా ఫంకీ సినిమాను ప్రమోట్ చేశాడు. కట్ చేస్తే ఫంకీ సినిమాకు తీవ్రమైన నష్టం మిగిలింది. కమర్షియల్‌గా మినిమం వసూళ్లను సినిమా రాబట్టడంలో విఫలం అయింది.
నాగవంశీ నిర్మాణంలో ఫంకీ...
విశ్వక్‌సేన్ పెట్టుకున్న నమ్మకం వమ్ము అయ్యింది. నాగవంశీ సినిమా అంటే మినిమం గ్యారెంటీ అనే పేరు ఉండేది. ఫంకీ సినిమాతో ఆ బ్రాండ్ ఇమేజ్ మరింతగా డ్యామేజ్ అయ్యింది అంటూ ఇండస్ట్రీలో టాక్ వచ్చింది. ఇలాంటి సినిమాలు థియేట్రికల్ రిలీజ్ సమయంలో నిరాశ పరచినా, ఓటీటీ స్ట్రీమింగ్ సమయంలో ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువ కావడం, ఎక్కువ మంది చూసేందుకు ఆసక్తి చూపించడం మనం చూస్తూ ఉంటాం. కానీ ఫంకీ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ మొదలైన తర్వాత కూడా పెద్దగా ప్రేక్షకుల ఆదరణ దక్కించుకోలేక పోయింది. ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయిన ఫంకీ సినిమాకు ప్రేక్షకుల ఆదరణ కరువయ్యింది. ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు సైతం నెట్‌ఫ్లిక్స్ లో తెలుగు కేటగిరిలో ట్రెండ్ కావడం మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ సినిమాకు మినిమం వ్యూస్ దక్కడం లేదని నెట్‌ఫ్లిక్స్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
అనుదీప్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా...
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో వచ్చిన ఫంకీ సినిమాలోని కామెడీ మరీ నాసిరకంగా ఉందంటూ రివ్యూలు వచ్చాయి. దర్శకుడు అనుదీప్ దాదాపు అందరినీ చిచా అని పిలుస్తూ ఉంటాడు. దాంతో జాతీరత్నాలు వంటి కామెడీకి చిచా కామెడీ అనే పేరు పడిపోయింది. ఫంకీ సినిమాలోని చిచా కామెడీకి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. ఇండస్ట్రీలో అనుదీప్ కి ఇది చివరి సినిమా అయ్యి ఉంటుందా అన్నట్లుగా చర్చ జరుగుతోంది. అనుదీప్ ఇంటర్వ్యూలు, కామెడీ షో లకు పరిమితం కావాల్సిందే అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. జాతిరత్నాలు సినిమా హిట్ క్రెడిట్ ఇన్నాళ్లు అనుదీప్ ది అనుకున్న వారు కూడా ఇప్పుడు నవీన్ పొలిశెట్టి కారణంగానే ఆ సినిమా హిట్ అయ్యిందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఫంకీ సినిమాను సీరియస్‌గా తీసుకుని రూపొందించలేదు అంటూ అనుదీప్ పై విమర్శలు చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు.
నెట్‌ఫ్లిక్స్‌లో ఫంకీ మూవీ...
ప్రిన్స్ వంటి డిజాస్టర్ తర్వాత కూడా అనుదీప్ కి మరో అవకాశం దక్కింది. అది కూడా ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో కాగా, మాస్ హీరోగా పేరున్న విశ్వక్‌సేన్ ను డైరెక్ట్ చేసే అవకాశం దక్కడంతో అనుదీప్ అదృష్టం. కానీ మళ్లీ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో అనుదీప్ విఫలం అయ్యాడు. చిల్లర కామెడీ అంటూ విమర్శలు వస్తున్నా అదే తరహా కామెడీ సీన్స్, అదే తరహా ప్రమోషన్స్ కారణంగా ఫంకీ సినిమాను జనాలు తిరస్కరించారు. కనీసం ఓటీటీలో అయినా సినిమాను జనాలు చూస్తారు అనుకుంటే సీన్ రివర్స్ అయింది. ఓటీటీ ఫంకీ స్ట్రీమింగ్ అవుతున్న విషయాన్ని ప్రేక్షకులు కనీసం పట్టించుకోవడం లేదు. దాంతో అనుదీప్ కెరీర్ మరింతగా కష్టాల్లో కూరుకున్నట్లు అయిందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అనుదీప్ తనను తాను నిరూపించుకునేందుకు కొత్త వారితో మరో ప్రయోగం చేయాల్సిందే...!