విశాల్ స్ట్రైట్ తెలుగు సినిమాకు రెడీ అవుతున్నాడా

విశాల్ తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవ‌స‌రం లేని పేరు. తమిళంలో స్టార్ హీరోగా స్థిరపడినప్పటికీ, ఆయన మూలాలు తెలుగు నేలతోనే ముడిపడి ఉన్నాయి.

Update: 2026-09-20 00:30 GMT

విశాల్ తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవ‌స‌రం లేని పేరు. తమిళంలో స్టార్ హీరోగా స్థిరపడినప్పటికీ, ఆయన మూలాలు తెలుగు నేలతోనే ముడిపడి ఉన్నాయి. అయితే ఇప్పటివరకు తమిళ సినిమాలనే తెలుగులోకి అనువాదం చేస్తూ అలరించిన విశాల్ ఇప్పుడు నేరుగా స్ట్రెయిట్ తెలుగు సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు ఫిలింనగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. టాలీవుడ్‌లో సరైన ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు ఆయన పావులు కదుపుతున్నట్లు తెలిసింది.

ఈ సంచలన నిర్ణయానికి ప్రధాన కారణం విశాల్ ఇటీవలి సినిమాల ఫలితాలే అని తెలుస్తోంది. గత కొంతకాలంగా తమిళ దర్శకులతో విశాల్ చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలిసిరావడం లేదు. వైవిధ్యమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వ‌చ్చినా? కమర్షియల్‌గా అవి పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. దీంతో విశాల్ కెరీర్‌కు మళ్లీ బలమైన కమ్‌బ్యాక్ ఇవ్వాలంటే? సరికొత్త విజన్‌ ఉన్న దర్శకులతో ప్రయోగాలు చేయడమే సరైన మార్గమని భావిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలోనే విశాల్ పలువురు టాలీవుడ్ దర్శకులతో నిరంతరం టచ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ పరిశ్రమ మాస్ ఎలిమెంట్స్, వినూత్నమైన కాన్సెప్ట్‌లతో దేశవ్యాప్తంగా ట్రెండ్ సెట్ చేస్తోంది. విశాల్‌కున్న మాస్ అండ్ యాక్షన్ ఇమేజ్‌కు సరిగ్గా సరిపోయే పవర్ ఫుల్ కథలను సిద్ధం చేసే దిశగా కొంత మంది రచయితలతో విశాల్ ప్రాథమిక చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

తెలుగు మార్కెట్‌లో విశాల్‌కు మంచి ఆదరణ ఉంది. `పందెం కోడి`, `అభిమన్యుడు`, `మార్క్ ఆంటోని` వంటి చిత్రాలు తెలుగు రాష్ట్రాల్లో భారీ విజయాన్ని సాధించి ఆయనకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి. స్వతహాగా తెలుగు కుటుంబానికి చెందినవాడు కావడం.. అనర్గళంగా తెలుగు మాట్లాడగలగడం ఆయనకు అతిపెద్ద అడ్వాంటేజ్. ఈ నేప‌థ్యంలో స్ట్రెయిట్ తెలుగు సినిమా చేయడం ఆయనకు పెద్ద విష‌యం కాదు. ఇక్కడి ప్రేక్షకులకు మరింత చేరువయ్యే అవకాశాన్ని ఇస్తుంది.

ప్రస్తుతం దక్షిణ భారత చిత్రసీమలో కాంబినేషన్ల సరిహద్దులు తుడిచిపెట్టుకుపోతున్నాయి. ఇప్పటికే ధనుష్, శివకార్తికేయన్, విజయ్ వంటి కోలీవుడ్ హీరోలు తెలుగు దర్శకులతో చేతులు కలిపి బ్లాక్‌బస్టర్లు అందుకున్నారు. ఇదే బాటలో విశాల్ కూడా టాలీవుడ్ డైరెక్టర్‌తో జతకడితే రెండు పరిశ్రమల దృష్టిని ఆకర్షిస్తుంది. అలాగే విశాల్ కమర్షియల్ గ్రాఫ్‌ను మళ్లీ పైకి లేపడానికి సరైన వ్యూహమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మొత్తానికి కోలీవుడ్ లో ప్రతికూలత ఎదురవుతున్న సమయంలో టాలీవుడ్ వైపు విశాల్ అడుగులు వేయడం వ్యూహాత్మక పరిణామం. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశముంది. సరికొత్త పవర్ ఫుల్ కథతో విశాల్ చేయబోయే స్ట్రెయిట్ తెలుగు సినిమా ఆయన కెరీర్‌కు ఎలాంటి బిగ్ టర్నింగ్ పాయింట్‌గా అవుతుందో చూడాలి.

Tags:    

Similar News