కోహ్లీ పోరాట పటిమను రగిల్చే సాంగ్!
జీవితంలో సక్సెస్ పుల్ పర్సన్ వెనుక ఏదో ఒక స్పూర్తి ఉంటుంది. అలాంటి స్పూర్తి ఉన్నవారే జీవితంలో పైకి ఎదుగుతారు.
జీవితంలో సక్సెస్ పుల్ పర్సన్ వెనుక ఏదో ఒక స్పూర్తి ఉంటుంది. అలాంటి స్పూర్తి ఉన్నవారే జీవితంలో పైకి ఎదుగుతారు. ఏ రంగంలో సక్సెస్ పుల్ పర్సన్ తీసుకున్నా? కచ్చితంగా ఆ విజయం వెనుక ఎంతో శ్రమ కనిపిస్తుంది. అలాగే క్రీడా రంగంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన ఆటగాళ్లకు మానసిక స్థిరత్వం, ప్రేరణ కోసం కొన్ని ప్రత్యేకమైన అలవాట్లు ఉంటాయి. ముఖ్యంగా సంగీతం అనేది మైదానంలోకి అడుగుపెట్టే ముందు ఆటగాళ్లలో సరికొత్త ఉత్సాహాన్ని.. ఏకాగ్రతను నింపుతుంది. భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సైతం ప్రతి మ్యాచ్‌కు ముందు ఒక నిర్దిష్టమైన పాటను వింటానని ఓ గ్లోబల్ ప్రీమియర్ ఈవెంట్‌లో వెల్లడించారు.
దీంతో కోహ్లీ విజయాల వెనుక ఉన్న ఓ భావోద్వేగ కోణం బయట పడింది. పంజాబీ గాయకుడు కరణ్ ఔజ్లా పాడిన `విన్నింగ్ స్పీచ్` అనే పాట అంటే కోహ్లీకి ఎంతో ఇష్టమన్నారు. మ్యాచ్‌ల కోసం సిద్ధమవుతున్నప్పుడు తరచుగా ఈ పాటనే వింటానని పేర్కొన్నారు. ఈ పాటలోని సాహిత్యం, సంగీతం తనలో మానసిక బలాన్ని పెంచుతాయన్నారు.
అయితే కోహ్లీ ఈ పాటను అంతగా ఇష్టపడటానికి కేవలం అందమైన సంగీతం మాత్రమే కారణం కాదు. దాని వెనుక బలమైన వ్యక్తిగత కారణం కూడా ఉంది. కరణ్ ఔజ్లా తన జీవిత ప్రయాణాన్ని ప్రతిబింబిస్తూ రాసిన ఈ పాట కోహ్లీ సొంత జీవితానికి చాలా దగ్గరగా అనిపించిందిట.
చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన కోహ్లీ, కరణ్ జీవితంలోనూ అదే విధమైన విషాదం ఉండటాన్ని గమనిం చారు. ఈ సమానత్వమే ఇద్దరి అనుభవాలను ఒకే తాటిపైకి తెచ్చింది. దీంతో ఆయన రాసిన పాట కోహ్లీ హృదయానికి మరింత దగ్గర అయింది. ఈ తరహా స్ఫూర్తిదాయకమైన పాట కోహ్లీలో ఎటువంటి పరిస్థితుల్లోనైనా పోరాడే తత్వాన్ని, ఎప్పటికీ ఓటమిని అంగీకరించని నైజాన్ని పెంపొందించింది. మ్యాచ్ ఎంత క్లిష్టంగా మారినా? గెలిచే అవకాశాలు ఎంత తక్కువగా ఉన్నా ? చివరి క్షణం వరకు పోరాడాలనే పట్టుదలను `విన్నింగ్ స్పీచ్` అందిస్తుందని చెప్పారు.
చిన్నతనం నుంచే సవాళ్లను ఎదుర్కొని నిలబడటం అలవాటైన కోహ్లీకి ఈ పాట మరింత మానసిక స్థైర్యాన్ని ఇస్తుంది. ఈ సందర్భంగా కోహ్లీ 2022లో మెల్‌బోర్న్‌లో పాకిస్తాన్‌తో జరిగిన చారిత్రాత్మక టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌ను గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో భారత్ గెలిచే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే ఉన్నాయని గణాంకాలు చెప్పినప్పటికీ తాను మాత్రం ఆశ కోల్పోలేదన్నారు. ఒక శాతం అవకాశం ఉన్నా అది గెలుపుకు సరిపోతుందని నమ్మే కోహ్లీ అసాధ్యమనుకున్న ఆ మ్యాచ్‌ను ఎలా మలుపు తిప్పాడో తెలిసిందే.