డ్రగ్స్ కేసు: చట్టపరంగా ఇబ్బంది పెట్టనన్న నటి
తాను ఒక నటుడి అసభ్యకర ప్రవర్తనతో సెట్స్ లో తీవ్ర ఇబ్బందులకు గురయ్యానని విన్సీ ఆరోపించారు.;
విన్సీ అలోసియస్.. గత కొద్దిరోజులుగా మీడియా హెడ్ లైన్స్ లో నిలుస్తున్న పేరు ఇది. తాను ఒక నటుడి అసభ్యకర ప్రవర్తనతో సెట్స్ లో తీవ్ర ఇబ్బందులకు గురయ్యానని విన్సీ ఆరోపించారు. తన ముందే బట్టలు మార్చుకోవాలని అతడు బలవంతం చేసాడని కూడా వెల్లడించింది. అతడు సెట్స్ లో రిహార్సల్స్ సమయంలో తెల్లటి పదార్థం (డ్రగ్స్) సేవించడం చూసానని కూడా తెలిపారు. అయితే బహిరంగంగా మీడియా ఎదుట ఆ నటుడి పేరును ప్రస్థావించలేదు. కానీ ఆ నటుడి పేరును విన్సీ ఫిర్యాదు చేసిన అనంతరం ఫిలింఛాంబర్ పెద్దలు, అంతర్గత క్రమశిక్షణా భద్రతా వ్యవహారాల కమిటీ షైన్ టామ్ చాకో అని లీక్ చేయడంతో దీనిని నమ్మక ద్రోహం అని పేర్కొంది.
ఆ నటుడు మారాలని తాను కోరుకున్నానని, అతడి పేరును బయటపెట్టొద్దని క్రమశిక్షణా కమిటీ, చాంబర్ వర్గాలను కోరినా కానీ నమ్మక ద్రోహానికి పాల్పడ్డారని విన్సీ ఆరోపించింది. ప్రస్తుతం అంతర్గత కమిటీలు జరిగిన ఘటనపై విచారణను కొనసాగిస్తున్నాయి. అయితే తాను ఘటన జరిగిన వెంటనే ఫిర్యాదు చేసినా ఛాంబర్ పెద్దలు కానీ, ఇతర సినీప్రముఖులు కానీ దీనిపై చర్యలు తీసుకోలేదని కూడా విన్సీ ఆరోపించారు. ఇకపై తాను డ్రగ్స్ తీసుకునేవారితో కలిసి పని చేయకూడదని నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు.
షైన్ టామ్ చాకో పై తాను చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోనని, కేవలం పరిశ్రమ పెద్దలు, ఫిలింఛాంబర్ దీనిని అంతర్గతంగా విచారించి పరిష్కరించాలని కోరుకుంటున్నట్టు విన్సీ వెల్లడించింది. లీగల్ యాక్షన్ లేదు అంటే పోలీసులు అతడిని అరెస్ట్ చేయరు. చట్టపరమైన శిక్షలు ఏవీ అమలు కావు. ఆ రకంగా నటుడు షైన్ టామ్ చాకో బతికిపోయాడు. కానీ పోలీసులు, ఎన్సీబీ అధికారులు దీనితో సంబంధం లేకుండా టామ్ చాకోపై డ్రగ్స్ సంబంధిత కేసు ఫైల్ చేసి విచారిస్తున్న సంగతి తెలిసిందే.