చంపేస్తామంటూ నటుడికి బెదిరింపు కాల్స్!
విక్రాంత్ మాసే ప్రధాన పాత్రలో గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో ధీరజ్ సర్నా తెరకెక్కించిన `ది సబర్మతి రిపోర్ట్` భారీ అంచనాల మధ్య విడుదలైనా వాటిని అందుకోవడంలో విఫలమైన సంగతి తెలిసిందే.
విక్రాంత్ మాసే ప్రధాన పాత్రలో గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో ధీరజ్ సర్నా తెరకెక్కించిన `ది సబర్మతి రిపోర్ట్` భారీ అంచనాల మధ్య విడుదలైనా వాటిని అందుకోవడంలో విఫలమైన సంగతి తెలిసిందే. సెన్సిటివ్ పాయింట్ హిట్ తో సంచలనం సృష్టిస్తుంది అనుకుంటే? ఫలితం మరోలా వచ్చింది. తాజాగా ఈ సినిమా విడుదలైన తర్వాత తీవ్రమైన ప్రాణహెచ్చరికలు వచ్చాయని విక్రాంత్ మాసే బహిరంగంగా వెల్లడించారు. గుజరాత్ అల్లర్లు 2002 నాటి నిజాలను వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేసిన చిత్రంలో నటించినందుకే తనకు వ్యతి రేకంగా బెదిరింపులు పెరిగాయని విక్రాంత్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ వివాదానికి ప్రధాన కారణం సినిమా విడుదలైన సమయం .. అందులోని సున్నితమైన అంశాలే అని చెప్పొచ్చు. గుజరాత్ అల్లర్ల వంటి అత్యంత సున్నితమైన చారిత్రక ఘటన ఆధారంగా తెరకెక్కిన చిత్రంలో నటించడం ద్వారా విక్రాంత్ ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది. సినిమా ప్రచార సమయంలోనే భిన్నమైన స్పందనలు వచ్చినప్పటికీ సినిమా రిలీజ్ తర్వాత మాత్రం పరిస్థితి మరింత దిగజారిందని విక్రాంత్ తెలిపారు. సోషల్ మీడియా వేదికగా కొందరు వ్యక్తులు తనను టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడ్డారని పేర్కొన్నారు.
ఈ బెదిరింపులు సోషల్ మీడియా పోస్టులకే పరిమితం కాలేదని విక్రాంత్ స్పష్టం చేశారు. ఏకంగా తన వ్యక్తిగత వాట్సాప్ నంబర్‌ను సోషల్ మీడియాలో లీక్ చేశారని దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతాల నుంచి వందలాది బెదిరింపు కాల్స్, మెసేజ్‌లు వచ్చాయని వెల్లడించారు. నటుడిగా తాను కేవలం ఒక కథను మాత్రమే తెరపై చూపించానని.. కానీ దానిని వ్యక్తిగతంగా తీసుకుని కొందరు తన భద్రతకే ముప్పు తెచ్చేలా ప్రవర్తించడం చాలా ధాకరమని ఆవేదన చెందారు. వ్యక్తిగత జీవితంలో కుటుంబ సభ్యులు కూడా ఈ పరిణామాల వల్ల తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యారని విక్రాంత్ తెలిపారు.
ఒక నటుడు లేదా కళాకారుడు సమాజంలోని ఏదైనా కోణాన్ని లేదా చారిత్రక సంఘటనను సినిమా రూపంలో ప్రజల ముందుకు తీసుకొచ్చినప్పుడు దాన్ని కళాత్మకంగా చూడాలి తప్ప ఇలా బెదిరింపులకు పాల్పడటం సరికాదని తాజాగా సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనతో బాలీవుడ్‌లో స్వేచ్ఛగా సినిమాలు తీయడానికి .. నటించడానికి నటులు ఎదుర్కొంటున్న భయాలు మరోసారి బయటపడ్డాయి. కష్టమైన పరిస్థితులలో చిత్ర యూనిట్ సభ్యులు ...పలువురు తోటి నటులు పూర్తి మద్దతుగా నిలిచారని విక్రాంత్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాలను వ్యక్తపరిచే హక్కు ఉంటుందని.. ఇలాంటి బెదిరింపులకు తాను భయపడేది లేదని విక్రాంత్ స్పష్టం చేశారు. సత్యం ఎప్పుడైనా బయటకు వస్తుందని.. తాను అలాంటి నిజమైన చిత్రంలో భాగమైనందుకు గర్వపడుతున్నానని తెలిపారు.