శ్రీహరి జయంతి రోజున 'ఆస్మాన్'.. మేఘాంశ్ ఎమోషనల్ స్పీచ్
రియల్ స్టార్ శ్రీహరి 62వ జయంతి సందర్భంగా ఆయన కుమారుడు మేఘాంశ్ శ్రీహరి నటిస్తున్న కొత్త సినిమా 'ఆస్మాన్' ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
రియల్ స్టార్ శ్రీహరి 62వ జయంతి సందర్భంగా ఆయన కుమారుడు మేఘాంశ్ శ్రీహరి నటిస్తున్న కొత్త సినిమా 'ఆస్మాన్' ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్ లో మేఘాంశ్ మాట్లాడుతూ తన తండ్రిని గుర్తు చేసుకున్నాడు. నాన్నకు ఆశీస్సులు అందించినట్టే తనకు కూడా ప్రేక్షకుల సపోర్ట్ కావాలని అడిగాడు. చివర్లో జోహార్ శ్రీహరి అంటూ తన స్పీచ్‌ను ముగించడం అక్కడున్న వాళ్లను కదిలించింది.
సినిమా గురించి చెబుతూ నిర్మాతలకు మేఘాంశ్ స్పెషల్ థాంక్స్ చెప్పాడు. ఒక సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు రకరకాల కష్టాలు వస్తాయని, అప్పుడే ప్రొడక్షన్ హౌస్ వాల్యూస్ ఏంటో తెలుస్తాయని అన్నాడు. తమకు ఏ లోటు రాకుండా చూసుకున్న నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపాడు. అసలు షూటింగ్ చేస్తున్నట్టు కాకుండా ఒక వెకేషన్‌కు వెళ్లినంత సరదాగా ఈ సినిమా కంప్లీట్ చేశామని తన ఎక్స్ పీరియన్స్ పంచుకున్నాడు. ఈ కథను తన దగ్గరకు తీసుకొచ్చిన రమేష్‌కు కూడా థాంక్స్ చెప్పాడు.
ఇదే వేదిక మీద సినిమాలో నటించిన తన కో స్టార్స్ రవివర్మ, కేశవ్ దీపక్, గడ్డం నవీన్ లకు మేఘాంశ్ పేరుపేరునా థాంక్స్ చెప్పాడు. తన బెస్ట్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన నిఖిల్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ఇక ఈ సినిమా హీరోయిన్ రాయంచను అందరికీ అఫీషియల్‌గా పరిచయం చేశాడు. ఎప్పుడెప్పుడు తనను అఫీషియల్ గా లాంచ్ చేస్తారా అని ఆమె రోజూ అడిగేదని సరదాగా అన్నాడు.
మిగతా విషయాలన్నీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడతానని చెప్పి స్పీచ్ ఆపేశాడు. ఈ సినిమాకు మ్యూజిక్ ఇచ్చిన ప్రశాంత్ ఆర్ విహారి గురించి మేఘాంశ్ గట్టి నమ్మకంతో కనిపించాడు. ఫస్ట్ లుక్ వీడియోలో వినిపించిన బీజీఎం అందరికీ నచ్చిందని, సినిమాలో ఇంతకంటే మంచి మ్యూజిక్ ఇస్తాడని చెప్పాడు. తనను స్క్రీన్ మీద పవర్ ఫుల్ గా చూపిస్తున్న డైరెక్టర్ రామ్ నందన్ వర్క్ ను ఇష్టపడ్డాడు.
తన లుక్ ను జనాల్లోకి తీసుకెళ్లిన పీఆర్ టీమ్ నాయుడు, అఖిలేష్ లకు కూడా మేఘాంశ్ స్పెషల్ గా థాంక్స్ చెప్పాడు. ఇక ఆస్మాన్ సినిమా బ్యాక్ డ్రాప్ చూస్తే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్నట్టు అర్థమవుతోంది. శ్రీమతి కొండారు శ్రీనివాసరావు సమర్పణలో శ్రీ క్లీంకార సెల్యూలాయిడ్ బ్యానర్ మీద ఈ చిత్రం తెరకెక్కుతోంది. కొండారు వెంకటేష్, మన్నెం శ్రీకాంత్ కలిసి ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు.
మేఘాంశ్ ను దర్శకుడు రామ్ నందన్ చాలా కొత్తగా ప్రెజెంట్ చేస్తున్నాడు. మోషన్ పోస్టర్ లో ఒక పెద్ద అరచేయి, అందులో మేఘాంశ్ కాగడా పట్టుకుని నిలబడిన తీరు సినిమాపై ఆసక్తి పెంచుతోంది. సాధారణంగా పాన్ ఇండియా అంటే తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తారు. కానీ ఆస్మాన్ టీమ్ ఇంకో అడుగు ముందుకు వేసి ఈ చిత్రాన్ని ఏకంగా అరబిక్ భాషలో కూడా తీసుకురాబోతోంది. ఒక యంగ్ హీరో సినిమా ఇలా అరబిక్ లోకి డబ్ అవ్వడం హైలెట్. షోయబ్ కెమెరామెన్ గా చేస్తున్న ఈ సినిమా త్వరలోనే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకోనుంది.