విజయ్ పర్సనల్.. డిటెక్టివ్స్ గా మారడం అవసరమా?
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ వ్యక్తిగత జీవితం మరోసారి వార్తల్లో నిలిచింది.;
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ వ్యక్తిగత జీవితం మరోసారి వార్తల్లో నిలిచింది. ఇప్పటికే రాజకీయాల్లో అడుగుపెట్టి టీవీకే పార్టీని ప్రారంభించిన ఆయనకు కుటుంబ వ్యవహారాలు తలనొప్పిగా మారుతున్నాయి! ఆయన భార్య సంగీత విడాకులు కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారన్న వార్తలు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఇప్పటివరకు అధికారికంగా కోర్టు పత్రాలు బయటకు రాలేదు.
అయినా సరే.. పిటిషన్ లో ఉన్నట్లు చెబుతున్న విషయాలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా విజయ్ మరో నటితో సన్నిహిత సంబంధం పెట్టుకున్నారని, 2021 నుంచే ఆ వ్యవహారం కొనసాగుతుందన్న ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. దీంతో నెట్టింట అవసరం లేకున్నా.. డిటెక్టివ్ లుగా మారిన కొందరు అభిమానులు, నెటిజన్లు పాత ఫోటోలు, వీడియోలు, జర్నీ డిటైల్స్ వైరల్ చేస్తున్నారు.
ఆ సమయంలో సీనియర్ హీరోయిన్ త్రిష కృష్ణన్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. కొంతమంది నెటిజన్లు ఆమె సోషల్ మీడియా పోస్టులు తమకు వచ్చినట్టు డీకోడ్ చేస్తూ.. సంగీత పిటిషన్ లో పేర్కొన్న హీరోయిన్ ఆమెనే అంటూ ఊహాగానాలు వైరల్ చేస్తున్నారు. విజయ్, త్రిష ఒకే ప్రాంతాల్లో కనిపించిన ఫోటోలు, ఒకే సమయానికి ప్రయాణించినట్లు కనిపించే టైమ్ స్టాంపులతో సహా పోస్ట్ చేస్తున్నారు.
కొన్ని కార్యక్రమాల్లో ఇద్దరూ హాజరైన సందర్భాలు వంటి వివరాలను ప్రూఫ్స్ అంటూ చూపిస్తున్నారు. ఇటీవల జరిగిన హీరోయిన్ కీర్తి సురేష్ వివాహ వేడుకకు ఇద్దరూ హాజరైనప్పటికీ, కలిసి ఫోటోలు దిగకపోవడాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. అయితే ఇవన్నీ కేవలం ఊహాగానాలే తప్ప అధికారికంగా ఎలాంటి ఆధారాలు లేవు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలకూ ఎలాంటి ప్రూఫ్స్ లేవు.
ఇక త్రిష కూడా తనపై వస్తున్న ఆరోపణలపై ఏ విధంగా కూడా రెస్పాండ్ అవ్వకపోవడం మరింత చర్చకు దారితీస్తోంది. సాధారణంగా ఇలాంటి రూమర్లపై స్పందించే ఆమె, ఈసారి మాత్రం సైలెంట్ గా ఉండడం గమనార్హం. అదే సమయంలో విజయ్ కూడా ఈ వివాదంపై ఇప్పటివరకు మాట్లాడలేదు. దీంతో అభిమానుల్లో ఆసక్తి, అనుమానం రెండూ పెరుగుతున్నాయి.
ఇదిలా ఉంటే, సంగీత తన పిటిషన్ లో ఆర్థిక వేధింపుల ఆరోపణలు కూడా చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దానికి తోడు విజయ్ కుమారుడు జేసన్ తన తండ్రిని సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసినట్లు తెలుస్తున్న ఘటన కూడా చర్చనీయాంశమైంది. దీంతో కుటుంబ విభేదాలపై ఊహాగానాలు మరింత ఎక్కువయ్యాయి. అయితే కోర్టులో విజయ్ తన వాదనలు ఏప్రిల్ 20న వినిపించే అవకాశం ఉందని సమాచారం. ఆ రోజే మొత్తం వ్యవహారంపై స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది.