ఆ తరువాత తెలుగులో కవితలు కూడా రాస్తా: విజయ్ సేతుపతి

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతి, 'ఫీనిక్స్' సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు.;

Update: 2025-11-03 17:39 GMT

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతి, 'ఫీనిక్స్' సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. ప్రముఖ స్టంట్ మాస్టర్ అనల్ అరసు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇప్పటికే తమిళంలో విడుదలైన ఈ చిత్రాన్ని, నవంబర్ 7న తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా జరిగిన తెలుగు ఈవెంట్‌లో విజయ్ సేతుపతి చాలా ఎమోషనల్‌గా మాట్లాడారు.

ఈవెంట్‌లో విజయ్ తెలుగులో కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. "పూరీ గారి ఫిలిం చేస్తున్నాను. ఇంకా రెండు మూడు సినిమాలు చేస్తే తెలుగులో బాగా మాట్లాడతాను. అప్పటివరకు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఆ తర్వాత కవితలు కూడా రాస్తాను" అంటూ తనదైన శైలిలో నవ్వించారు.

"నేను 'జవాన్' సినిమా చేస్తున్నప్పుడు అనల్ అరసు మాస్టర్‌ను కలిశాను. అప్పుడు ఆయన ఈ కథ చెప్పారు, ఇందులో మా అబ్బాయి నటిస్తే బాగుంటుందని అన్నారు. నేను జోక్యం చేసుకోలేదు, మీ ఇద్దరే మాట్లాడుకోండి అని చెప్పాను. ఆ తర్వాత నాకేమీ తెలియదు, వాళ్లిద్దరే మాట్లాడుకున్నారు, సినిమా చేశారు" అని తెలిపారు.

కొడుకు యాక్షన్ సినిమా చేయడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. "సినిమా చూశాను, నాకు చాలా నచ్చింది. ఒక తండ్రిగా నేను చాలా ఆనందంగా ఉన్నాను. మా అబ్బాయికి ఇది చాలా మంచి ఆరంభం. వాడికి చిన్నప్పటి నుంచి యాక్షన్ సినిమాలంటే పిచ్చి. నన్ను కూడా యాక్షన్ సినిమాలు చేయమని ఎప్పుడూ చెప్తుండేవాడు. మాస్ యాక్షన్ సినిమాలను వాడు చాలా సెలబ్రేట్ చేసుకుంటాడు. అలాంటి యాక్షన్ సినిమా చేయడం అనేది వాడి కల" అని అన్నారు.

తన కొడుకు కలను ఇంత త్వరగా నిజం చేసినందుకు డైరెక్టర్ అనల్ అరసు, నిర్మాత రాజలక్ష్మికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. "ఒకరోజు యాక్టర్ అవుతాను అని చెప్పాడు, చెప్పిన ఏడాదిలోనే సినిమా చేశాడు. అది పూర్తిగా డైరెక్టర్, ప్రొడ్యూసర్ వల్లే సాధ్యపడింది" అని విజయ్ సేతుపతి అన్నారు.

సినిమా సక్సెస్‌పై ఆయన చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.

"సినిమా ఏ భాషలో ఉన్నా, అందులోని ఎమోషన్ కనెక్ట్ అయితే చాలు, ప్రతీ ఒక్కరూ దాన్ని సెలబ్రేట్ చేస్తారు. అందుకే మనం అన్ని భాషల సినిమాలు చూస్తాం. 'ఫీనిక్స్' కూడా అదే తరహాలో ఆకట్టుకుంటుంది. ఇందులో యాక్షన్, ఎమోషన్ అన్నీ చాలా అద్భుతంగా కుదిరాయి. ఇది తప్పకుండా ఆడియెన్స్‌కు కనెక్ట్ అవుతుంది" అని నమ్మకం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News