టాలీవుడ్ సినిమాపై సేతుపతి ప్రశంసలు
సేతుపతి ఒక సినిమా చేశాడంటే ఆ సినిమాపై ఆడియన్స్ కు ఆటోమేటిక్ గా ఆసక్తి ఏర్పడుతుంది.;
విజయ్ సేతుపతి. ఆయన నటన గురించి, టాలెంట్ గురించి కొత్తగా చెప్పే పన్లేదు. చిన్న చిన్న పాత్రలతో కెరీర్ ను స్టార్ట్ చేసిన విజయ్ సేతుపతి, ఇప్పుడు సౌత్ లోనే భారీ డిమాండ్ ఉన్న నటుల్లో ఒకరిగా పేరు తెచ్చుకుని వరుస అవకాశాలను అందుకుంటూ కెరీర్లో ముందుకెళ్తున్నారు. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు విలన్ పాత్రలు, సపోర్టింగ్ రోల్స్ చేస్తూ సత్తా చాటుతున్నారు విజయ్ సేతుపతి.
సేతుపతి ఒక సినిమా చేశాడంటే ఆ సినిమాపై ఆడియన్స్ కు ఆటోమేటిక్ గా ఆసక్తి ఏర్పడుతుంది. సినిమాలకు సంబంధించి ఆయన అభిప్రాయాలు కూడా అంతే కచ్ఛితంగానూ, ఎంతో విలువగానూ ఉంటాయి. అలాంటి సేతుపతి రీసెంట్ గా తన తాజా చిత్రం ఏస్ ప్రమోషన్స్ లో భాగంగా తెలుగులో ఈ మధ్య వచ్చిన ఓ చిన్న సినిమా గురించి మాట్లాడారు.
సేతుపతి ప్రముఖ మూవీ క్రిటిక్ భరద్వాజ్ రంగన్ కు ఇచ్చిన ఇంటర్వూలో ఆ సినిమాను మెచ్చుకున్నారు. ఆ సినిమానే కోర్టు. నేచురల్ స్టార్ నిర్మాతగా రామ్ జగదీష్ దర్శకత్వంలో వచ్చిన ఈ కోర్టు సినిమా మంచి టాక్ తో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ మధ్య మీరు చూసిన సినిమాల్లో నచ్చినవేంటని అడగ్గా సేతుపతి తాను రీసెంట్ గా విడాముయార్చితో పాటూ కోర్టు సినిమాను చూశానని తెలిపారు.
వాటిలో తనకు కోర్టు సినిమా చాలా బాగా నచ్చిందని, డైరెక్టర్ ఆ మూవీని తీసిన విధానం చాలా బావుందని, మరీ ముఖ్యంగా క్లైమాక్స్ ను డైరెక్టర్ రాసుకున్న తీరును మెచ్చుకోవాల్సిందేనని సేతుపతి అభిప్రాయపడ్డారు. కళ్యాణ మండపం గదిలో ఏం జరిగిందనేది డైరెక్టర్ చూపించిన విధానమే కోర్టు సినిమాకు చాలా ప్లస్ అయిందని ఈ సందర్భంగా క్రిటిక్ భరద్వాజ్ చెప్పగా, ఆయన మాటలకు సేతుపతి కూడా ఏకీభవించారు. ఎవరైనా సరే అలాంటి సీన్స్ రాయడం, తీయడం అంత ఈజీ కాదని, డైరెక్టర్ దాన్ని చాలా బాగా హ్యాండిల్ చేశారని సేతుపతి కోర్టు సినిమాను, ఆ సినిమా డైరెక్టర్ ను ఆకాశానికెత్తేశారు.