చిరు, పవన్‌లా విజయ్ తిరిగి వస్తాడా?
రాజకీయాల్లోకి వెళ్లబోతున్న నేపథ్యంలో సినిమాలు మానేస్తున్నట్లు విజయ్ ప్రకటించిన నేపథ్యంలో టాలీవుడ్ సూపర్ స్టార్లు చిరంజీవి, పవన్ కళ్యాణ్‌ల అనుభవం చర్చకు వస్తోంది.;
తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్‌ను మించిన స్టార్ రావడం అసాధ్యం అనే అంతా అనుకున్నారు. కానీ రజినీ డౌన్ అవుతున్న సమయంలోనే నిలకడగా హిట్లు కొడుతూ తన మార్కెట్‌ను పెంచుకుని నంబర్ వన్ స్థానానికి ఎదిగిపోయాడు విజయ్. రజినీ జైలర్, కూలీ సినిమాలతో సత్తా చాటినప్పటికీ.. కొన్నేళ్లుగా విజయ్ సినిమాలకు రజినీని మించి బిజినెస్ జరుగుతుండడం, ఓపెనింగ్స్ వస్తుండడంతో అతణ్నే నంబర్‌వన్‌గా పరిగణిస్తున్నారు. ఐతే ఇంత ఉన్నతమైన స్థానంలో ఉండగా అతను సినీ రంగాన్ని విడిచిపెట్టి రాజకీయాల్లో అడుగు పెడుతుండడం విశేషం.
సంక్రాంతికి రాబోతున్న జననాగయన్‌యే విజయ్ చివరి చిత్రం. ఈ విషయాన్ని ఈ మూవీ ఆడియో వేడుకలో ధ్రువీకరించాడు విజయ్. దీంతో అభిమానులు తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు. విజయ్ రాజకీయాల్లో విజయవంతం కావాలని కోరుకుంటూనే.. సినిమాలు విడిచిపెట్టొద్దని అతణ్ని కోరుతున్నారు.
రాజకీయాల్లోకి వెళ్లబోతున్న నేపథ్యంలో సినిమాలు మానేస్తున్నట్లు విజయ్ ప్రకటించిన నేపథ్యంలో టాలీవుడ్ సూపర్ స్టార్లు చిరంజీవి, పవన్ కళ్యాణ్‌ల అనుభవం చర్చకు వస్తోంది. ప్రజారాజ్యం పార్టీ పెడుతున్న సమయంలో చిరు ఇక సినిమాలు చేయను అనేశాడు. ఆ విషయాన్ని మళ్లీ మళ్లీ నొక్కి వక్కాణించాడు. కానీ రాజకీయాల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో పదేళ్ల విరామం తర్వాత తిరిగి సినిమాల్లోకి వచ్చేశారు చిరు. పవన్ విషయానికి వస్తే.. పార్టీ పెట్టాక కూడా సినిమాలు చేసిన పవన్.. 2019 ముంగిట ఫిలిం కెరీర్‌కు గుడ్ బై చెప్పేస్తున్నట్లు సంకేతాలిచ్చాడు. రెండేళ్ల పాటు సినిమాల ఊసు ఎత్తలేదు.
తర్వాత రీఎంట్రీ ఇచ్చి వరుసగా సినిమాలు చేశాడు. ఇప్పుడు మళ్లీ బ్రేక్ తీసుకున్నాడు. ఆయన మళ్లీ సినిమాలు చేయొచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఐతే విజయ్ ఇప్పుడీ ప్రకటన చేసినప్పటికీ.. కూడా వీరిలా మళ్లీ సినిమాలు చేస్తాడేమో అన్న చర్చ జరుగుతోంది. కానీ చిరు, పవన్‌లతో పోలిస్తే ఆరంభ దశలో విజయ్ ఇంకా మెరుగైన ఫలితాలు సాధించే అవకాశాలున్నట్లు తమిళనాడు రాజకీయ పండితులు చెబుతున్నారు. అక్కడ బలమైన ప్రతిపక్షం లేకపోవడం విజయ్‌కి కలిసొచ్చే అంశం. అక్కడ నిర్ణయాత్మక రాజకీయ శక్తిగా మారితే విజయ్ సినిమాల్లోకి తిరిగి రావడం కష్టమే అవుతుంది. వచ్చే ఎన్నికల్లో నిరాశాజనక ఫలితాలు వస్తే తప్ప విజయ్‌ని సమీప భవిష్యత్తులో సినిమాల్లో చూడలేమని అంటున్నారు విశ్లేషకులు.