దళపతి విజయ్ ప్లాన్ ఏ..ప్లాన్ బి రెడీ?
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ వ్యవస్థాపకుడు, కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ రెండు నియోజక వర్గాల నుంచి పోటీకి దిగుతున్న విషయం తెలిసిందే.;
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ వ్యవస్థాపకుడు, కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ రెండు నియోజక వర్గాల నుంచి పోటీకి దిగుతున్న విషయం తెలిసిందే. టీవీకే పార్టీని స్థాపించి సినిమాలకు గుడ్ బై చెప్పేస్తూ క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారు. పార్టీ ప్రకటించి భారీ బహిరంగ సభ నిర్వహించిన నాటి నుంచే విజయ్ అనేక సమస్యలని ఎదుర్కొంటూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఆయన నటించిన చివరి సినిమా `జన నాయగన్` రిలీజ్ వాయిదా పడింది.
ఎప్పుడు రిలీజ్ అవుతుందో క్లారిటీ లేదు. ఇదే సమస్యతో సతమతమవుతున్న వేళ విజయ్ భార్య సంగీత విడాకులు కోరుతూ చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టుని ఆశ్రయించడం సంచలనంగా మారింది. తనయుడు జాసన్ సంజయ్ తండ్రి విజయ్‌ని సోషల్ మీడియాలో అన్ ఫాలో చేయడం, ఇంటి పేరుని తొలగించుకోవడం..ఇదే సమయంలో త్రిషతో కలిసి చెన్నైలో జరిగిన ఓ వివాహ కార్యక్రమానికి విజయ్ హాజరు కావడంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తడం తెలిసిందే. తన చుట్టూ ఇంత జరుగుతున్నా చలించని విజయ్ ఫైనల్‌గా టీవీకే పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించారు.
ఈ ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి పోటీకి విజయ్ సిద్ధమవుతున్నారు. పెరంబూరు, తిరుచిరాపల్లి ..ఈ రెండు నియోజక వర్గాల నుంచి విజయ్ పోటీ చేస్తున్నారు. రెండు నియోజక వర్గాల్లో ఒక చోట నుంచి గెలిచినా తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పడం ఖాయం. ఆ నమ్మకంతోనే విజయ్ ఈ రెండు నియోజక వర్గాలని పోటీ కోసం ఎంచుకున్నారట. ఇప్పటికే ప్రచార జోరుని పెంచిన విజయ్ తమిళనాడులో అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉన్నారట. అందుకు కావాల్సిన సర్వశక్తుల్ని ఒడ్డి ఫైట్ చేస్తున్నారు.
ఓటర్లని ఆకర్షించడానికి విజయ్ చెబుతున్న మాట `ఒక్క ఛాన్స్`.. ఇది జనాల్లోకి బలంగా వెళితే విజయ్ రాజకీయ జీవితం మలుపు తిరిగినట్టేనని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఇండస్ట్రీ వర్గాలు మాత్రం విజయ్ ప్లాన్ ఏ, ప్లాన్ బిలని రెడీ చేసుకున్నాడని అంటున్నారు. ఏప్రిల్‌లో జరిగే తమిళనాడు ఎన్నికల్లో విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ అత్యధిక స్థానాల్ని దక్కించుకుంటే అధికారాన్ని చేపట్టి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలన్నది విజయ్ ప్లాన్ ఏ.
ఇదే జరిగితే సినిమాకు శాశ్వతంగా విజయ్ గుడ్ బై చెప్పేస్తారట. అలా కాకుండా టీవీకే పార్టీతో విజయ్ తన ప్రభావాన్ని పూర్తి స్థాయిలో కలిగించలేక కొంత మేరకు మాత్రమే సీట్లని గెలుచుకుని అధికారాన్ని చేపట్టలేకపోతే ఏడాదికో సినిమా చేయాలనే ప్లాన్ బిని కూడా రెడీ చేసుకున్నాడని కోలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. కానీ విజయ్ మాత్రం ముఖ్యమంత్రి పీఠాన్ని ఈ సారే దక్కించుకుని మన సత్తా ఏంటో చూపించాలనే భావిస్తున్నారట. విజయ్ ప్లాన్ ఏని ఫాలో అవుతారా? లేక ఫ్లాన్ బిని ఫాలో అవుతారా? అన్నది తెలియాలంటే ఎన్నికల రిజల్ట్ వరకు వేచి చూడాల్సిందే.