విజయ్‌కి కోరినన్ని స్క్రీన్లు.. మరి ప్రభాస్‌కు?

ప్రభాస్ మూవీతో దాదాపు సమానంగా స్క్రీన్లు లభిస్తున్నాయి విజయ్ మూవీకి. థియేటర్ల లిస్టింగ్ చూస్తే షాకవ్వకుండా ఉండలేరు.;

Update: 2026-01-03 17:30 GMT

సినిమాల పరంగా సంక్రాంతి సీజన్ తెలుగు వాళ్లకే కాదు.. తమిళులకూ చాలా ప్రత్యేకం. ఆ సమయంలో అక్కడా భారీ చిత్రాలు రిలీజవుతుంటాయి. ఈసారి విజయ్ చివరి చిత్రం ‘జననాయగన్’ భారీ అంచనాల మధ్య రిలీజవుతోంది తమిళంలో. సంక్రాంతికి తమిళంలో శివకార్తికేయన్ మూవీ ‘పరాశక్తి’ కూడా రిలీజవుతున్నప్పటికీ.. మెజారిటీ స్క్రీన్లను విజయ్ మూవీకే ఇస్తున్నారక్కడ.

అదేం పెద్ద విషయం కాదు కానీ.. తెలుగులో సైతం ‘జననాయకుడు’ చిత్రానికి కోరినన్ని స్క్రీన్లు దక్కుతున్నాయి. ఈ నెల 9న ఈ చిత్రం.. ‘రాజాసాబ్’కు పోటీగా రిలీజవుతోంది. ప్రభాస్ మూవీతో దాదాపు సమానంగా స్క్రీన్లు లభిస్తున్నాయి విజయ్ మూవీకి. థియేటర్ల లిస్టింగ్ చూస్తే షాకవ్వకుండా ఉండలేరు. ఒక తెలుగు నుంచి రీమేక్ అయిన ఓ తమిళ సినిమా డబ్బింగ్ వెర్షన్ తెలుగులో రిలీజవుతుంటే.. ఇంత పెద్ద రిలీజ్ ఏంటి అని ఎవ్వరైనా షాక్ అవ్వడం ఖాయం.

మూడు రోజుల పాటు విజయ్ మూవీకి భారీగా స్క్రీన్లు, షోలు ఇస్తున్నారు. కానీ ప్రభాస్ సినిమాకు తమిళంలో మినిమం స్క్రీన్లు కూడా దక్కే పరిస్థితి కనిపించడం లేదు. ప్రభాస్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్. పాన్ ఇండియా స్థాయిలో అతడికి భారీ ఫాలోయింగ్ ఉంది. విజయ్‌కి తెలుగులో ఉన్న ఫాలోయింగ్ కంటే ప్రభాస్‌కు తమిళంలో ఉన్న గుర్తింపు ఎక్కువ అంటే అతిశయోక్తి కాదు.

అయినా సరే ‘రాజాసాబ్’కు తమిళంలో చెప్పుకోదగ్గ సంఖ్యలో స్క్రీన్లు దొరకడం కష్టంగా ఉంది. అసలు తమిళ సినిమా అయిన ‘పరాశక్తి’కే స్క్రీన్ల సమస్య తలెత్తింది. అలాంటపుడు ప్రభాస్ మూవీని పట్టించుకుంటారని ఆశించలేం. కానీ మన వాళ్లు మాత్రం విజయ్ సినిమాను ఎందుకు నెత్తిన పెట్టుకుంటారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వాళ్ల సినిమాలకు ఇక్కడ ఇంత సపోర్ట్ లభిస్తున్నప్పుడు.. మన చిత్రాలకు ఓ మోస్తరుగా అయినా స్క్రీన్లు, షోలు ఇవ్వాలనే ఆలోచన కలగకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం.

Tags:    

Similar News