తమిళ ఇండస్ట్రీలో నెంబర్ గేమ్!
కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద నెంబర్ గేమ్ మళ్లీ ఊపందుకుంది. దశాబ్దాలుగా ఇండస్ట్రీని శాసించిన అగ్ర హీరోల రాజకీయ ప్రవేశాలు .. ప్రాధాన్యతలలో మార్పులు ఈ కొత్త పోటీకి తెరలేపాయి.
కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద నెంబర్ గేమ్ మళ్లీ ఊపందుకుంది. దశాబ్దాలుగా ఇండస్ట్రీని శాసించిన అగ్ర హీరోల రాజకీయ ప్రవేశాలు .. ప్రాధాన్యతలలో మార్పులు ఈ కొత్త పోటీకి తెరలేపాయి. ముఖ్యంగా ఒకరి తర్వాత ఒకరుగా ప్రముఖులు కెరీర్ దిశను మార్చుకుంటున్న తరుణంలో తమిళ చలనచిత్ర పరిశ్రమలో శిఖరాగ్ర స్థానం కోసం ఎవరు నిలదొక్కుకుంటారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
ఈ పరిణామాలకు ప్రధాన కేంద్రంగా విజయ్ రాజకీయ రంగప్రవేశం నిలిచింది. పూర్తిస్థాయి రాజకీయాలపై దృష్టి పెట్టేందుకు ఆయన సినిమాలకు వీడ్కోలు పలకడంతో కోలీవుడ్‌లో నెంబర్ వన్ సింహాసనం ఖాళీ అయింది. విజయ్ హవా నడిచినంత కాలం అగ్ర స్థానం కోసం జరిగిన పోరు ఒకలా ఉంటే? ఆయన నిష్క్రమణ తర్వాత ఏర్పడిన శూన్యతను భర్తీ చేయడానికి మిగతా స్టార్ హీరోలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కోలీవుడ్ బాక్సాఫీస్ లెక్కలు పూర్తిగా మారిపోతున్నాయి.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా నటుడు అజిత్ కుమార్ తన ప్రణాళికలను వేగవంతం చేస్తున్నారు. కొంతకాలంగా రేసింగ్ మక్కువతో సినిమాలకు ఎక్కువ విరామాలు ఇస్తూ వచ్చిన అజిత్ ప్రస్తుతం ఆ ఆసక్తిని కాస్త పక్కన పెట్టి వరుస చిత్రాలకు పచ్చజెండా ఊపుతున్నారు. అదిక్ రవిచంద్రన్, వెంకట్ ప్రభు వంటి యువ దర్శకులతో పాటు శంకర్ లాంటి దిగ్గజాలతోనూ సినిమాలు లైన్ లో పెట్టడం అజిద్ దూకుడుకు నిదర్శనం. ఒకే సమయంలో మూడు సినిమాలను పట్టాలెక్కిస్తూ అజిత్ బాక్సాఫీస్ పై గట్టి పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు.
మరోవైపు ఈ రేసులో సూర్య తనదైన శైలిలో ముందుకెళ్తున్నారు. విజయ్ తప్పుకున్న తర్వాత తమిళ ఇండస్ట్రీకి తదుపరి కింగ్ సూర్యే అవుతారని విశ్లేషకులు భావించినా? అజిత్ ఒక్కసారిగా వేగం పుంజుకోవడం పోటీని రసవత్తరంగా మార్చింది. విభిన్న కథాంశాలతో గ్లోబల్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తున్న సూర్యకు, అజిత్ చేస్తున్న వరుస కమర్షియల్ సినిమాల నుండి గట్టి పోటీ ఎదురు కానుంది. ఇద్దరి మధ్య నడుస్తున్న ఆరోగ్యకరమైన పోటీ కోలీవుడ్‌లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.
రజనీకాంత్, కమల్ హాసన్ వంటి దిగ్గజాలు సీనియర్ కేటగిరీలో తమదైన ప్రయాణం సాగిస్తుండగా.. యువ హీరోల మార్కెట్ ఇంకా పూర్తిగా పరిపక్వం చెందలేదు. ఈ తరుణంలో అజిత్ .. సూర్య మధ్యే ప్రధాన పోరు కేంద్రీకృతమైంది. రాబోయే రెండేళ్లలో రానున్న వీరి చిత్రాల విజయాలే తమిళ ఇండస్ట్రీలో తదుపరి నెంబర్ వన్ ఎవరో? నిర్దేశించనున్నాయి. అభిమానులలోనూ ఈ అంశంపై హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి.
మొత్తానికి 2026 నాటి పరిస్థితులు కోలీవుడ్ స్వరూపాన్నే మార్చేస్తున్నాయని చెప్పొచ్చు. దశాబ్దాల అనుభవం, విభిన్న శైలి సినిమాలతో దూసుకుపోతున్న అజిత్ ఒకవైపు ఉంటే.. సృజనాత్మక కథలతో ప్రయోగాలు చేసే సూర్య మరోవైపు ఉన్నారు. ఇద్దరు స్టార్ల మధ్య జరుగుతున్న నెంబర్ గేమ్ ఇండస్ట్రీకి ఏ స్థాయిలో లాభాలను తెచ్చిపెడుతుందో? బాక్సాఫీస్ రికార్డులను ఏ విధంగా తలకిందులు చేస్తుందో? కాలమే సమాధానం చెప్పాలి.