విజయ్- రష్మిక మరో వేడుక.. ఎందుకంటే..

పెళ్లి అనంతరం రీసెంట్ గా రష్మిక తన తొలి పుట్టినరోజు కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా దంపతులు కర్ణాటకలోని ఓ ప్రసిద్ధ ఆలయాన్ని సందర్శించడం కూడా చర్చనీయాంశమైంది.;

Update: 2026-04-08 07:10 GMT

టాలీవుడ్‌ లో క్రేజీ కపుల్ గా గుర్తింపు పొందిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఈ ఏడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టి అభిమానులను సర్ప్రైజ్ చేసిన విషయం తెలిసిందే. కొన్నేళ్లుగా సీక్రెట్‌ గా కొనసాగిన వారి రిలేషన్‌ షిప్‌ కు ఫుల్‌ స్టాప్‌ పెడుతూ ఫిబ్రవరి 26వ తేదీన రాజస్థాన్‌ లోని ఉదయ్ పూర్ లో అత్యంత ప్రైవేట్‌ గా పెళ్లి చేసుకున్నారు.



 


కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరైన ఆ వేడుక సింపుల్‌గా జరిగినప్పటికీ, తర్వాత హైదరాబాద్‌ లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేసి సందడి చేశారు. పెళ్లి అనంతరం రీసెంట్ గా రష్మిక తన తొలి పుట్టినరోజు కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా దంపతులు కర్ణాటకలోని ఓ ప్రసిద్ధ ఆలయాన్ని సందర్శించడం కూడా చర్చనీయాంశమైంది.



 


ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి అభిమానులను ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ జంట మరోసారి రిసెప్షన్ వేడుక నిర్వహించుకోవడం ఆసక్తికరంగా మారింది. రష్మిక నేటివ్ విలేజ్ కూర్గ్‌ లోని విరాజ్ పేట్ లో కుటుంబ సభ్యులు, బంధువుల కోసం ప్రత్యేకంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కొడవ సంప్రదాయాల మధ్య జరిగిన ఆ వేడుకలో స్థానిక సంస్కృతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.



 


రిసెప్షన్‌ లో రష్మిక సంప్రదాయ కొడవ దుస్తుల్లో మెరిసిపోగా, విజయ్ దేవరకొండ కూడా స్థానిక స్టైల్‌ లో కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు. వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ గా మారి అభిమానులను ఆకట్టుకున్నాయి. ఫంక్షన్ హాల్‌ ను సంప్రదాయ అలంకరణలతో తీర్చిదిద్దడం వేడుకకు మరింత గ్రాండ్ నెస్ తీసుకువచ్చింది.

ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తాను కూర్గ్‌ కు రావడం ఇది మూడోసారి అని వెల్లడించారు. రష్మికను కలిసే ముందు కూడా ఇక్కడికి వచ్చినట్లు గుర్తు చేసుకున్నారు. స్కూల్ రోజుల్లో స్నేహితులతో కలిసి వచ్చిన అనుభవాలను ఆయన చెప్పుకొచ్చారు. కూర్గ్ ప్రకృతి అందాలు తనకు ఎంతో ఇష్టమని, ఇక్కడి మహిళలు చాలా అందంగా ఉంటారని సరదాగా వ్యాఖ్యానించారు. 'నేను కూర్గ్ అమ్మాయినే పెళ్లి చేసుకున్న' అంటూ చెప్పడం అక్కడున్న వారిని అలరించింది.

పెళ్లి వేడుకకు హాజరు కాలేకపోయిన బంధువుల కోసం రిసెప్షన్ ఏర్పాటు చేసినట్లు సమాచారం. కేవలం ఆహ్వానితులకు మాత్రమే అనుమతి ఉండగా, మీడియాకు ప్రవేశం ఇవ్వకుండా పూర్తి ప్రైవసీతో కార్యక్రమాన్ని నిర్వహించారు. భద్రతా ఏర్పాట్లు కూడా కట్టుదిట్టంగా చేశారు. ఏదేమైనా రిసెప్షన్ వేడుకతో మరోసారి వార్తల్లో నిలిచిన విజయ్- రష్మిక జంట, తమ కొత్త జీవితం ఆనందంగా సాగిస్తుండడం అభిమానులకు మరింత సంతోషాన్ని కలిగిస్తోందని చెప్పాలి.

Tags:    

Similar News