వెంకటేష్‌ను పరిచయం చేసిన రౌడీ స్టార్‌..!

కానీ విజయ్‌ దేవరకొండ మాత్రం కింగ్డమ్‌ సినిమాలో నటించిన నటుడు వెంకటేష్‌ గురించి ప్రముఖంగా స్పందించాడు. అంతే కాకుండా అతడి నటనపై ప్రశంసలు కురిపించాడు.;

Update: 2025-07-28 08:02 GMT

రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన 'కింగ్డమ్‌' సినిమా విడుదలకు రెడీగా ఉంది. జులై 31న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో విజయ్‌ దేవరకొండ పాల్గొంటున్నాడు. ఇటీవలే తిరుపతిలో భారీ ఈవెంట్‌ను నిర్వహించారు. హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇక ఇంటర్వ్యూలు, మీడియా మీట్లు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విధాలుగా సినిమాను ప్రమోట్‌ చేస్తూ విజయ్ దేవరకొండ బిజీ బిజీగా ఉన్నాడు. ఇంత బిజీ టైమ్‌లోనూ తన తోటి నటుడి గురించి సోషల్‌ మీడియా ద్వారా స్పందించడం, అంతే కాకుండా అతడి యొక్క ప్రతిభను అభినందించడం అరుదుగా చూస్తూ ఉంటాం.

కింగ్డమ్‌ సినిమాలో మురుగన్‌ అనే పాత్రలో వెంకటేష్‌ అనే కొత్త నటుడు నటించాడు. అతడిని విజయ్‌ దేవరకొండ సోషల్‌ మీడియా ద్వారా పరిచయం చేశాడు. సాధారణంగా స్టార్స్ తమ సినిమాల్లో నటించే ఇతర నటీనటుల గురించి పెద్దగా స్పందించరు. ముఖ్యంగా కో స్టార్స్‌ గురించి పెద్దగా మాట్లాడేందుకు ఆసక్తి చూపించరు. కానీ విజయ్‌ దేవరకొండ మాత్రం కింగ్డమ్‌ సినిమాలో నటించిన నటుడు వెంకటేష్‌ గురించి ప్రముఖంగా స్పందించాడు. అంతే కాకుండా అతడి నటనపై ప్రశంసలు కురిపించాడు, అతడి ఎక్స్‌ ప్రెషన్స్‌ మొదలుకుని ప్రతి ఒక్కటీ సర్‌ప్రైజింగ్‌గా అనిపించాయి అంటూ విజయ్ దేవరకొండ చేసిన పోస్ట్‌ వైరల్‌ అవుతోంది.

సోషల్ మీడియా ప్లాట్‌ ఫామ్‌ ఎక్స్ ద్వారా విజయ్ దేవరకొండ స్పందిస్తూ... మీ అందరికీ వెంకటేష్‌ అనే ఈ నటుడిని పరిచయం చేయాలి అనుకుంటున్నాను. ఇది ఆయనకు 4వ సినిమానే అయినా అద్భుతంగా నటించాడు. ఆయనతో నా సన్నివేశాల చిత్రీకరణ సమయంలో ఆయన ప్రపంచంలోనే ఉండి పోయాను. ప్రాణాంతక నటుడు, క్రూరమైన కళ్లు, శక్తి అతడి బలం. సినిమాలోని మురుగన్‌ పాత్ర ద్వారా అతడు బలమైన ముద్ర వేశాడు అంటూ ట్వీట్‌ చేశాడు. విజయ్ దేవరకొండ చేసిన ట్వీట్‌తో ఒక్కసారిగా ఆ నటుడి గురించి సోషల్‌ మీడియాలో చాలా మంది వెతకడం మొదలు పెట్టారు. అతడి ఇంతకు ముందు సినిమాలు ఏంటి, ఏం పాత్రలు చేశాడు అనేది తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

ఈ సినిమాలో అతడి పాత్రకు మంచి పేరు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే నిజం అయితే ఖచ్చితంగా టాలీవుడ్‌లో అతడికి మంచి భవిష్యత్తు ఉంది. పైగా విజయ్ దేవరకొండ స్పెషల్‌గా చెప్పడం వల్ల ఇక మీదట అతడు చిన్న సినిమాలకు మోస్ట్‌ వాంటెడ్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ అయ్యే అవకాశం ఉంది. అంతే కాకుండా పెద్ద హీరోల సినిమాల కోసం కూడా అతడిని సంప్రదిస్తారనే వార్తలు వస్తున్నాయి. మొత్తానికి విజయ్‌ దేవరకొండ ఒక్క ట్వీట్‌తో కొత్ నటుడు అయిన వెంకటేష్ గురించి జనాల్లో చర్చ మొదలైంది, కింగ్డమ్‌ విడుదల కాకుండానే అతడికి అడ్వాన్స్‌లు అందుతున్నాయి.

ముందు ముందు కూడా అతడు టాలీవుడ్‌లో అందరి దృష్టిని ఆకర్షించే విధంగా సినిమాలు చేస్తాడనే విశ్వాసం వ్యక్తం అవుతోంది. సాధారణంగా రౌడీ బాయ్ ఆ స్థాయిలో ఏ ఒక్కరికీ ఎలివేషన్ ఇవ్వడు, కానీ వెంకటేష్‌ గురించి ఆ స్థాయిలో చెప్పాడంటే ఖచ్చితంగా అతడిలో మ్యాటర్ ఉండే ఉంటుంది. ఇండస్ట్రీలో గుర్తింపు దక్కి, మ్యాటర్‌ ఉంటే టాప్ స్టార్‌గా మారడం పెద్ద విషయం ఏమీ కాదు అనేది టాక్‌. అందుకే వెంకటేష్‌ ఫ్యూచర్‌లో పెద్ద నటుడిగా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

Tags:    

Similar News