డ్రగ్స్.. ఆ బ్యాచ్ కు దూరంగా ఉంటే సేఫ్: విజయ్ దేవరకొండ
యూత్ డ్రగ్స్ కు దూరంగా ఉండాలని విజయ్ దేవరకొండ సూచించారు. సక్సెస్, మనీ, రెస్పెక్ట్.. ఇవ్వకపోతే అలాంటి దాంట్లో దిగడమే వేస్ట్ అని అన్నారు.;
అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ పాల్గొన్నారు. హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో జరిగిన ఇంటర్నేషనల్ డే అగెనెస్ట్ డ్రగ్ అబ్యూస్ కార్యక్రమానికి వచ్చిన ఆయన వేదికపై సందర్భాన్ని ఉద్దేశించి మాట్లాడారు.
యూత్ డ్రగ్స్ కు దూరంగా ఉండాలని విజయ్ దేవరకొండ సూచించారు. సక్సెస్, మనీ, రెస్పెక్ట్.. ఇవ్వకపోతే అలాంటి దాంట్లో దిగడమే వేస్ట్ అని అన్నారు. మనల్ని చాలా సిట్యుయేషన్స్ ప్రభావితం చేస్తాయని, అందుకే యంగ్ ఏజ్ లో తీసుకునే ప్రతి డెసిషన్ లైఫ్ నే మార్చేస్తుందని అన్నారు. అందుకే యంగ్ ఏజ్ లో జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.
తాను ఒక చిన్న ప్రపంచంలోనే బతుకుతానని విజయ్ అన్నారు. అందుకే బయట ఏం జరుగుతుందో పెద్దగా తెలియదని చెప్పారు. తనకు పోలీస్ ఆఫీసర్లు చెప్పే వరకు డ్రగ్స్ గురించి రియాలిటీ తెలియదని అన్నారు. తాను విశాఖపట్నం పోర్ట్‌లో షూటింగ్ చేస్తున్నప్పుడు యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ గురించి బైట్ ఇవ్వమని ఓ పోలీస్ అడిగినట్లు చెప్పారు.
ఆ సమయంలో తాను గౌరవం కొద్దీ ఇచ్చినట్లు తెలిపారు. కానీ, ఇప్పుడు ఇంటర్నేషనల్ డే ఉందని తెలిసిన తర్వాత కొంతమంది పోలీస్ ఆఫీసర్లను తాను కలిసినట్లు చెప్పారు. వారు చెప్పిన విషయాలు విన్నాక కచ్చితంగా డ్రగ్స్ పై మాట్లాడాలనిపించిందని పేర్కొన్నారు. దానిని ఒక బాధ్యతగా తీసుకుంటున్నట్లు విజయ్ వెల్లడించారు.
తమను ఎంతో మంది అభిమానిస్తుంటారని, అలాంటి వారి కోసం నాలుగు మాటలు చెప్పాలని కార్యక్రమానికి వచ్చినట్లు తెలిపారు. అయితే అందరికీ హెల్త్ ముఖ్యమని చెప్పారు. మనం చేసే పనితో అమ్మా నాన్న గర్వంగా ఉండాలని, యూత్ అలా ఆలోచించాలని అన్నారు. యంగ్ ఏజ్ లో చాలా కేర్ ఫుల్ గా ఉండాలని విజయ్ వార్నింగ్ ఇచ్చారు.
అయితే ఒక దేశాన్ని నాశనం చేయాలంటే యుద్ధం అవసరం లేదని అన్నారు. యువతకు డ్రగ్స్ అలవాటు చేస్తే చాలని అభిప్రాయపడ్డారు. కొన్ని దేశాలు యువతకు మత్తు అలవాటు చేసి దేశ భవిష్యత్ ను నాశనం చేయాలని అనుకుంటున్నారని అన్నారు. ఏదేమైనా డ్రగ్స్ తమ జీవితాలను నాశనం చేస్తాయని విజయ్ దేవరకొండ తెలిపారు.
ఒక్కసారి వాటికి అలవాటు పడితే కోలుకోవడం చాలా కష్టమని, మీ స్నేహితులు డ్రగ్స్ అలవాటు చేసే బ్యాచ్ ఉంటుందని, వారికి దూరంగా ఉండాలని విజయ్ అన్నారు. ఆరోగ్యంగా ఉండాలని, వ్యాయామం చేయాలని పిలుపునిచ్చారు. తల్లిదండ్రులు గౌరవంగా ఉండేలా చూడాలని, విజయం, డబ్బు, గౌరవం లేని పనిచేయడం అనవసరమని చెప్పుకొచ్చారు.