అనౌన్స్‌మెంట్లు మాత్రం పేలిపోతున్నాయి !
పెళ్ళిసందడి, అర్జున్ రెడ్డి, ట్యాక్సీవాలా, గీత గోవిందం చిత్రాలతో చాలా తక్కువ సమయంలో పెద్ద స్టార్‌గా ఎదిగిపోయాడు విజయ్ దేవరకొండ.;
పెళ్ళిసందడి, అర్జున్ రెడ్డి, ట్యాక్సీవాలా, గీత గోవిందం చిత్రాలతో చాలా తక్కువ సమయంలో పెద్ద స్టార్‌గా ఎదిగిపోయాడు విజయ్ దేవరకొండ. తెలుగు చిత్రాలతోనే అతను ఇతర భాషల్లో కూడా ఫాలోయింగ్ సంపాదించాడు. ఆ ఫాలోయింగ్‌ను ఇంకా పెంచుకుందామని తర్వాత పాన్ ఇండియా సినిమాలు చేస్తే అవి దారుణంగా బోల్తా కొట్టాయి. ముఖ్యంగా ‘లైగర్’ కొట్టిన దెబ్బ అలాంటిలాంటిది కాదు.
దీంతో పాటు విజయ్ నటించిన వేరే చిత్రాలు కూడా తీవ్ర నిరాశకు గురి చేయడంతో తన కెరీర్ స్ట్రక్ అయిపోయింది. కానీ విజయ్ మీద దర్శక నిర్మాతల నమ్మకమైతే సడలలేదు. ఇప్పటికీ అతణ్ని హీరోగా పెట్టి భారీ బడ్జెట్లలో, విభిన్న కథాంశాలతో సినిమాలు తీయడానికి ఫిలిం మేకర్స్ ముందుకు వస్తూనే ఉన్నారు. విజయ్ సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చిందంటే చాలు సోషల్ మీడియా ఆ రోజు షేక్ షేక్ అయిపోతోంది. కాంబినేషన్లు, కథాంశాలు చాలా ఎగ్జైటింగ్‌గా అనిపిస్తున్నాయి.
రౌడీ జనార్దన, రణబాలి సినిమాల అనౌన్స్‌మెంట్లు, వాటి ప్రోమోలు ఎంత ఆసక్తి రేకెత్తించాయో తెలిసిందే. తన కెరీర్‌ను ఈ రెండు చిత్రాలు గొప్ప మలుపు తిప్పుతాయనే అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ‘హాయ్ నాన్న’ దర్శకుడు శౌర్యువ్‌తో విజయ్ సినిమాను అనౌన్స్ చేయగా.. అది కూడా చాలా ఎగ్జైటింగ్‌గా కనిపిస్తోంది. అరంగేట్రంలో ఒక క్లాస్ ఫ్యామిలీ స్టోరీని నరేట్ చేసిన శౌర్యువ్.. ఈసారి పీరియడ్ టచ్ ఉన్న భారీ ఈవెంట్ ఫిలిం చేయబోతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. ‘హౌస్ ఆఫ్ డ్రాగన్’ డీవోపీ అలెజాండ్రో మార్టినెజ్, ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్ ఎరిక్ డస్ట్ లాంటి హాలీవుడ్ టెక్నీషియన్లను ఈ సినిమా కోసం తీసుకురావడమ కాదు.. ఫస్ట్ లుక్ పోస్టర్లో వాళ్లకు చోటు కూడా ఇచ్చారు.
పీరియడ్ లుక్‌లో కనిపిస్తున్న విజయ్ కుక్కల్ని పట్టుకుని నడుస్తుంటే.. వెనుక శౌర్యువ్ సహా ఈ సినిమా టెక్నీషియన్లు ఆయుధాలు పట్టుకుని ఫాలో అవుతున్నారు. ఈ ఫస్ట్ లుక్ చూసి శౌర్యువ్ అసలేం ప్లాన్ చేశాడ్రా బాబోయ్ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఈ కోపమంతా ఒకప్పుడు ప్రేమ’’ అంటూ సినిమాకు పెట్టిన క్యాప్షన్ కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది. మొత్తానికి మరోసారి విజయ్ సినిమా అనౌన్స్‌మెంట్‌తోనే హాట్ టాపిక్‌గా మారింది. ఐతే ‘కింగ్డమ్’ లాగా కాకుండా ఇప్పుడు విజయ్ చేస్తున్న చిత్రాలు హైప్‌కు తగ్గ కంటెంట్‌తో మెప్పించి విజయ్ కోరుకున్న విజయాలు అందిస్తాయేమో చూడాలి.