ఒక్క చుక్క‌ క‌న్నీటి కోసం 28 టేకులు

Update: 2025-08-24 01:30 GMT

బాలీవుడ్ లోని ఆర్టిస్టుల్లో ప‌ర్ఫెక్ష‌నిస్ట్ గా పేరు తెచ్చుకున్న సీనియ‌ర్ న‌టి విద్యాబాల‌న్. ప్ర‌తి స‌న్నివేశంలో ప్ర‌తి చిన్న విష‌యాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని జాగ్ర‌త్త‌గా న‌టిస్తుంది గ‌నుక‌నే బాల‌న్ గొప్ప పెర్ఫామ‌ర్ గా వెలిగిపోతోంది. అయితే త‌న‌లోని ఈ ప‌ర్ఫెక్ష‌న్ ఎలా వ‌చ్చింది? అంటే అందుకు పునాది వేసింది త‌న దాదా అని చెబుతోంది. దాదాగా పిలుపందుకున్న దివంగ‌త ద‌ర్శ‌కుడు ప్ర‌దీప్ స‌ర్కార్ త‌మ‌కు ఈ విష‌యాల‌న్నిటినీ కెరీర్ ఆరంభ‌మే నేర్పించార‌ని బాల‌న్ వెల్ల‌డించింది. తామంతా ఆయ‌న బాట‌లో న‌డుస్తామ‌ని తెలిపింది.

2005లో విడుద‌లైన ప‌రిణీత చిత్రాన్ని రీమాస్ట‌ర్ చేసి తిరిగి 2025 ఆగ‌స్టు 29న విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా త‌న గురువు, `ప‌రిణీత` ద‌ర్శ‌కుడు ప్ర‌దీప్ స‌ర్కార్ గురించి బాల‌న్ గుర్తు చేసుకున్నారు. నా ప్రారంభ రోజుల్లో ప్ర‌తిదానికి దాదా పునాది వేసారు. నా చిన్న‌త‌నంలోనే ప్ర‌తిదీ ఆయ‌న నుంచి నేర్చుకున్నాను. సీన్ తీసేప్పుడు ప్ర‌తి డీటెయిల్‌పైనా ఆయనకున్న శ్రద్ధ అసమానమైనది. అతడు న‌టుల‌ ప్రదర్శనల కోసం మాత్రమే కాదు.. సరైన సమయంలో పావురాలను ఎగురవేయడానికి .. సరైన సమయంలో కిటికీ వెలుపల ఆకులు పడేలా చేయడానికి కూడా వంద టేకులు తీసుకోగలడు. ప్రతిదానిలోనూ లయ ఉందని అతను నమ్ముతాడు! అని తెలిపింది విద్యా. ప్ర‌తి స‌న్నివేశంలో క‌చ్ఛిత‌త్వాన్ని కోరుకుంటాడ‌ని స‌ర్కార్ ని ఆకాశానికెత్తేసారు.

ఒకసారి నేను పాటలోని ఒక లైన్‌కు కన్నీటి చుక్కను సరైన టైమ్‌కి రాబ‌ట్ట‌డానికి 28 టేకులు తీసుకున్నాను. అత‌డు కోరిన క‌చ్ఛిత‌త్వం వ‌చ్చేవ‌ర‌కూ ఎవ‌రైనా ఆర్టిస్టు అలా చేయాల్సిందే. ఆయ‌న‌ మార్గదర్శకత్వం నాకు క్రాఫ్ట్‌లోని ప్రతి వివరం ఎలా గ‌మ‌నించాలో నేర్చుకున్నాను. 20 సంవత్సరాలుగా నాతో ఉన్న నా హెయిర్ స్టైలిస్ట్ శలక కూడా దాదా నుండి ప్ర‌తిదీ నేర్చుకున్నాడు. అది మా అంద‌రికీ ఆయన ఇచ్చిన బహుమతి అని బాల‌న్ చెప్పారు.

ఇద్ద‌రు ప్రేమికుల మ‌ధ్య స్నేహితుడి ప్ర‌వేశం త‌ర్వాత‌ త‌లెత్తిన అపార్థాలేమిట‌నే దానిపై ఎమోష‌న‌ల్ రైడ్ గా `ప‌రిణీత` సినిమాని రూపొందించారు. 1960లో కోల్ క‌తా నేప‌థ్యంలో క‌థ సాగుతుంది. ఇందులో విద్యా బాలన్‌తో పాటు సైఫ్ అలీ ఖాన్, సంజయ్ దత్ కూడా నటించారు . విధు వినోద్ చోప్రా నిర్మించారు. శరత్ చంద్ర చటోపాధ్యాయ 1914లో రాసిన ప్ర‌ఖ్యాత‌ బెంగాలీ నవల నుండి ఈ సినిమా క‌థ‌ను స్వీకరించారు. ఈ చిత్రం మొదట 10 జూన్ 2005న విడుదలైంది. ప్ర‌సాద్ లాబ్స్ లో డెవ‌ల‌ప్ చేసిన సినిమాను ఇప్పుడు మ‌ళ్లీ రీరిలీజ్ చేస్తున్నారు.

Tags:    

Similar News