NTR, MGR 'హీరోయిన్'.. ఒక్క గాసిప్ లేకుండా కెరీర్ అంతా..

తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో 200లకు పైగా సినిమాల్లో నటించిన సీనియర్‌ నటి సరోజాదేవి ఇక లేరు.;

Update: 2025-07-14 09:41 GMT

తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో 200లకు పైగా సినిమాల్లో నటించిన సీనియర్‌ నటి సరోజాదేవి ఇక లేరు. బెంగళూరులోని తన నివాసంలో సోమవారం ఉదయం ఆమె తుదిశ్వాస విడిచారు. దీంతో సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సెలబ్రిటీలు, సినీ ప్రియులు, అభిమానులు ఇప్పుడు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

అయితే 1938లో కర్ణాటకలో జన్మించిన సరోజాదేవి.. 13 ఏళ్ల వయసులోనే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అనుకోకుండా వచ్చి టాప్ హీరోయిన్ గా ఎదిగారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, ఎంజీఆర్‌ వంటి దిగ్గజ నటులతో పలు సూపర్‌ హిట్‌ సినిమాల్లో యాక్ట్ చేసి మెప్పించారు. తన ఖాతాలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ వేసుకున్నారు.

చెప్పాలంటే.. 29 ఏళ్ల పాటు వరుసగా 161 సినిమాల్లో హీరోయిన్‌ గా యాక్ట్ చేసి సినీ ఇండస్ట్రీ చరిత్రలోనే రికార్డు క్రియేట్ చేశారు. అభినయ సరస్వతిగా పేరు సంపాదించుకున్నారు. ఇప్పుడు 87 ఏళ్ల వయసులో కన్నుమూశారు. కానీ ఇన్నేళ్ల సుదీర్ఘ కెరీర్ లో ఒక్క గాసిప్ లేకుండానే గడిపారు.

ఆ విషయాన్ని ఆమెనే పలు ఇంటర్వ్యూల్లో తెలిపారు. తన కెరీర్ లో ఎంతోమంది స్టార్‌ హీరోల సరసన నటించానని, కానీ ఒక్క గాసిప్‌ కూడా లేకుండా జీవితం గడవడం మాత్రం తన అదృష్టమని సరోజా దేవి తెలిపారు. ఎప్పుడూ.. ఎవరూ కూడా తనపై కట్టుకథలు అల్లకపోవడం తాను చేసుకున్న పుణ్యం అని చెప్పారు.

అయినా తానెప్పుడూ ఇండస్ట్రీలోకి రావాలని అనుకోలేదని తెలిపారు సరోజాదేవి. ఓ కార్యక్రమంలో తనను కన్నడ నిర్మాత కన్నప్ప భాగవతార్ చూసి శాండిల్ వుడ్ సినిమాలో అవకాశమిచ్చారని, ఆ తర్వాత వరుసగా తెలుగు చిత్రాల్లో ఛాన్స్ లు వచ్చాయని తెలిపారు. కానీ తనకు మాత్రం నటనపై ఆసక్తి లేదని వెల్లడించారు.

కేవలం అమ్మానాన్నల ప్రోత్సాహంతోనే ఇండస్ట్రీకి వచ్చినట్లు చెప్పారు. ఆ తర్వాత భర్త శ్రీహర్ష కూడా పూర్తి సహకారం అందించారని పేర్కొన్నారు. వరుస సినిమాల్లో అవకాశాలు రావడంతో తన జాతకం మారిపోయిందని చెప్పారు. చిన్నప్పుడు సన్యాసులను చూసి వారిలా తాను కూడా పెద్దయ్యాక సన్యాసినిగా మారాలని అనుకున్నేదాన్ని అని, పేదలకు సేవ చేయాలని అనుకున్నట్లు చెప్పారు.

Tags:    

Similar News