19 ఏళ్ల తర్వాత ఆ సూపర్ హిట్ కాంబో కుదురుతుందా?
టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ చాలా కాలం తర్వాత సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు.;
టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ చాలా కాలం తర్వాత సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. ఆ సినిమా సక్సెస్ ఇచ్చిన జోష్ లో ఉన్న వెంకటేష్ నెక్ట్స్ సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం ఇచ్చిన సక్సెస్ ను కంటిన్యూ చేయాలని చూస్తున్న వెంకీ ఎంతో ఆలోచించి తన నెక్ట్స్ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అనౌన్స్ చేశారు.
త్రివిక్రమ్ డైరెక్షన్ లో మొదటిసారి చేస్తున్న వెంకీ
ఇప్పటికే వెంకీ- త్రివిక్రమ్ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలవగా సెప్టెంబర్ నుంచి షూటింగ్ మొదలవనున్నట్టు టాక్ వినిపిస్తోంది. త్రివిక్రమ్ డైరెక్టర్ గా మారాక వెంకీతో చేస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ కాంబినేషన్ పై మంచి అంచనాలున్నాయి. ఓ వైపు త్రివిక్రమ్ సినిమా చేస్తూనే వెంకీ పలువురు డైరెక్టర్లను కలుస్తూ వారు చెప్పే కథలను వింటున్నారు.
మాస్ ఎంటర్టైనర్ ను రెడీ చేస్తున్న వినాయక్
అందులో భాగంగానే వెంకీ ఒకప్పటి స్టార్ డైరెక్టర్ అయిన వి.వి వినాయక్ తో సినిమా చేసే ఛాన్సుందని అంటున్నారు. వినాయక్ వెంకీ కోసం ఓ మాస్ ఎంటర్టైనర్ స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నారని, త్వరలోనే వెంకీని కలిసి కథ చెప్పాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ ఎగ్జైటింగ్ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లే అవకాశముంది.
19 ఏళ్ల తర్వాత
2006లో వెంకటేష్, వినాయక్ కాంబినేషన్ లో లక్ష్మి సినిమా రాగా ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుని వెంకీ కెరీర్లో స్పెషల్ మూవీగా నిలిచింది. ఆ తర్వాత వీరిద్దరి కలయికలో మరో సినిమా వచ్చే అవకాశముందని అప్పట్లో వార్తలొచ్చాయి కానీ అది నిజం కాలేదు. ఇప్పుడు మళ్లీ 19 ఏళ్ల తర్వాత వీరిద్దరి కలయికలో సినిమా అంటూ వార్తలు రావడం, అది కూడా లక్ష్మీ సినిమాను ఏ జానర్ లో అయితే తీశారో అదే జానర్ లో అని వార్తలు రావడం అందరికీ ఆసక్తికరంగా మారింది. ఇంటెలిజెంట్ సినిమా ఫ్లాప్ అవడంతో చాలా కాలం గ్యాప్ తీసుకుని తర్వాత హిందీలో ఛత్రపతి సినిమాను రీమేక్ చేసి అక్కడ కూడా నిరాశనే చవిచూసిన వినాయక్ ఇప్పుడు వెంకీతో అయినా హిట్ అందుకుంటారేమో చూడాలి.