కంచ‌ర‌పాలెం దర్శకుడు.. ఈసారి రిస్కీ బడ్జెట్ తో..

కథ చెప్పడంలో తన ప్రత్యేకతను చాటుకున్న వెంకటేష్ మహా ఇప్పుడు సరికొత్త ప్రయోగానికి సిద్ధమయ్యాడు.;

Update: 2025-04-22 12:30 GMT

మొదట వెంకటేష్ మహా అనే పేరు వినగానే చాలా మంది ‘కేరాఫ్ కంచరపాలెం’ అనే సినిమా గుర్తుకు వచ్చేది. కానీ ఈమధ్య కాలంలో అతను KGF సినిమాపై అలాగే కమర్షియల్ సినిమాలపై చేసిన కొన్ని కామెంట్స్ వలన మరింత హాట్ టాపిక్ గా మారాడు. అలాగే అతను ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమా కూడా చేశాడు. కానీ అదేమీ అంతగా సక్సెస్ కాలేదు. అయితే ఆ రెండు సినిమాలూ కథలతో పాటు భావోద్వేగాలను అందించిన చిత్రాలుగా గుర్తింపు పొందాయి.

కథ చెప్పడంలో తన ప్రత్యేకతను చాటుకున్న వెంకటేష్ మహా ఇప్పుడు సరికొత్త ప్రయోగానికి సిద్ధమయ్యాడు. ఈసారి హీరోగా టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైపోయిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ చిత్రానికి ‘రావు బహదూర్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని టాక్.

ఈ టైటిల్‌ను బట్టి చూస్తే బ్రిటీష్ కాలంలో జరిగే కథ అనే అంచనాలు పెరుగుతున్నాయి. పిరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా ఉండబోతుందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక సత్యదేవ్ పాత్ర కూడా చాలా విభిన్నంగా ఉండబోతోందని సమాచారం. లుక్, క్యారెక్టరైజేషన్ అన్నీ కొత్తగా ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. సత్యదేవ్ ఓ మంచి నటుడే కానీ, కమర్షియల్ విజయం మాత్రం ఇప్పటివరకు పెద్దగా రాలేదు.

అలాంటప్పుడు వెంకటేష్ మహా తెరకెక్కించే ఈ సినిమా అతని కెరీర్‌లో కీలకంగా మారే అవకాశం ఉంది. ఈ సినిమాకి దాదాపు రూ.25 కోట్లు బడ్జెట్ పెట్టడం గమనార్హం. సత్యదేవ్ సినిమాకు ఇంత ఖర్చు చేయడం అంటే కథపై భారీ నమ్మకం ఉంది అనే విషయం అర్థమవుతుంది. ఇటీవలి కాలంలో సత్యదేవ్ నటించిన ‘జీబ్రా’ సినిమాకు కూడా బడ్జెట్ ఎక్కువగానే ఉంది. కానీ ఈ ‘రావు బహదూర్’ ప్రాజెక్ట్ మాత్రం మరింత రిస్కీ అడుగు అని చెప్పాలి.

వెంకటేష్ మహా మొదటి రెండు సినిమాలు సున్నితమైన ఎమోషన్లతో కూడిన కథలు. కానీ ఇప్పుడు ఆయన ఓ కమర్షియల్ సినిమాను ప్రయత్నిస్తున్నాడు. కొన్ని నెలల క్రితం కమర్షియల్ సినిమాలపై వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అప్పుడు చెప్పిన మాటల్ని మించి ఆ ప్రాక్టికల్‌గా ఎలా చేస్తారో చూడాలి. ఈ సినిమా గురించి ఇంకా అధికారిక ప్రకటనలు రాలేదు కానీ, షూటింగ్ పూర్తయ్యే వరకు ఇదే తరహాలో సైలెంట్‌గా వ్యవహరించే ప్లాన్‌లో ఉన్నట్లు టాక్. ఒకసారి షూటింగ్ మొత్తం పూర్తయిన తర్వాతే ప్రమోషన్ ప్రారంభించేలా చూస్తున్నారట. మరి సినిమాను ఎలా ప్రమోట్ చేస్తారో చూడాలి.

Tags:    

Similar News