'వీర ధీర శూర' డిజాస్టర్‌కు ఆ స్టార్ హీరోనే కారణమా?
టాలెంటెడ్ హీరో చియాన్ విక్రమ్ గత కొంత కాలంగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నారు.;
టాలెంటెడ్ హీరో చియాన్ విక్రమ్ గత కొంత కాలంగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నారు. ప్రయోగాత్మక పాత్రలు, కథలతో ప్రేక్షకుల్లో ప్రత్యేకతను చాటుకున్న విక్రమ్ ఇప్పుడు ఆ స్థాయిలో రాణించలేకపోతున్నారు. కొత్తగా ఏదైనా చేయాలని ప్రయత్నించినా అది బెడిసికొడుతోంది. `అపరిచితుడు` తరువాత విక్రమ్ సక్సెస్ మాట విని ఏళ్లవుతోంది. కార్తీక్ సుబ్బరాజుతో కలిసి `మహాన్`, మణిరత్నంతో కలిసి `పొన్నియిన్ సెల్వన్`, పా. రంజిత్‌తో `తంగలాన్` వంటి సినిమాలు చేసినా నో యూజ్.
ఈ నేపథ్యంలో ఎలాగైనా హిట్ కొట్టాలని చియాన్ విక్రమ్ చేసిన మూవీ `వీర ధీర శూరన్`. తెలుగులో ఇదే మూవీని `వీర ధీర శూర` పార్ట్ 2 గా రిలీజ్ చేశారు. `చిన్నా` ఫేమ్ ఎస్.యు. అరుణ్‌కుమార్ ఈ మూవీని డైరెక్ట్ చేశారు. విక్రమ్ భారీ అంచనాలు పెట్టుకున్న ఈ మూవీ రిలీజ్‌కు ముందు నుంచే వివాదాల్లో చిక్కుకుని అభిమానులతో పాటు మేకర్స్ ని షాక్‌కు గురి చేసింది. ఓటీటీ హక్కుల విషయంలో మేకర్స్‌కి మరో సంస్థకు మధ్య వివాదం చెలరేగడంతో ఈ సినిమా రిలీజ్ ఆలస్యం అయిన విషయం తెలిసిందే.
మార్నింగ్ షోలు పడకపోవడంతో ఫైనల్‌గా ఈ మూవీ ఈవినింగ్ షోతో మొదలైంది. ఇదిలా ఉంటే ఆలస్యంగా థియేటర్లలోకి వచ్చిన `వీర ధీర శూరన్` థియేటర్ల వద్ద ఎదురీదుతోంది. బ్యాడ్ మూవీ కాకపోయినా సినిమాకు సరైన పబ్లిసిటీ లేకపోవడం వల్లే ఈ సినిమాకు ఇలాంటి పరిస్థితి తలెత్తిందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. అంతే కాకుండా ఈ మూవీ ప్రేక్షకుల్లోకి వెళ్లకపోవడానికి ప్రధాన కారణం హీరో విక్రమ్ అనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు విక్రమ్ రూ.30 కోట్లు పారితోషికం తీసుకున్నారట.
సినిమా బడ్జెట్ విక్రమ్ రెమ్యునరేషన్‌తో కలిపి రూ.50 కోట్ల పైమాటేనట. అందులో విక్రమ్‌కే సగం ఖర్చు చేశాక మేకర్స్ వద్ద పబ్లిసిటీకి ఖర్చు చేయడానికి డబ్బులు లేవని, ఆ కారణంగానే ఈ సినిమా పబ్లిసిటీ చేయలేకపోయారని తెలుస్తోంది. అంతే కాకుండా విక్రమ్ నటించిన గత చిత్రాలు కూడా ఈ సినిమా డిజస్టర్‌కు ప్రధాన కారణంగా నిలిచాయి. విక్రమ్ రెమ్యునరేషన్ కారణంగానే ఈ సినిమా కిల్ అవుతోందనే టాక్ వినిపిస్తోంది. దీంతో సినిమాని కిల్ చేసే రెమ్యునరేషన్‌లపై గట్టి నిర్ణయం తీసుకుంటేనే సినిమాలు బ్రతుకుతాయనే చర్చ మొదలైంది. రిలీజ్‌కు ముందు నుంచి వివాదాల్లో ఇరుక్కున్న ఈ ప్రాజెక్ట్ చాలా మంది మేకర్స్‌కి ఓ గుణపాఠం అని, ఇకనైనా మేకర్స్, హీరోలు తమ ఆలోచనను మార్చుకుని సినిమాలని బ్రతికించాలని ప్రేక్షకులు, మేకర్స్ డిమాండ్ చేస్తున్నారు.