మెగా కుర్రాడి సినిమాకు మోక్షం

ఓ మంచి స‌క్సెస్ కోసం చాలా ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాడు మెగా కుర్రాడు వ‌రుణ్ తేజ్.

Update: 2026-06-09 13:23 GMT

ఓ మంచి స‌క్సెస్ కోసం చాలా ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాడు మెగా కుర్రాడు వ‌రుణ్ తేజ్. ఈ సినిమా అయినా రాత మారుస్తుందేమో అని చూడ‌డం.. అది పెద్ద డిజాస్ట‌ర్ కావ‌డం.. కొన్నేళ్లుగా ఇదే వ‌ర‌స‌. గ‌ని మూవీ త‌ర్వాత మ‌ట్కా మీద ఎన్నో ఆశ‌లు పెట్టుకుంటే అది దారుణ‌మైన ఫ‌లితాన్నందుకుంది. దీంతో ఈసారి కొంచెం గ్యాప్ తీసుకుని మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా చేశాడు. యువి క్రియేష‌న్స్ లాంటి పెద్ద బేన‌ర్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసింది. ఐతే ఈ సినిమా ఎప్పుడో మొద‌లైంది. ఎప్పుడో పూర్త‌యిన‌ట్లు కూడా వార్త‌లు వ‌చ్చాయి. కానీ ఎంత‌కీ విడుద‌ల‌కు మాత్రం నోచుకోవ‌ట్లేదు. కొన్ని నెల‌లుగా సినిమా నుంచి అస‌లే అప్‌డేట్ లేదు. వేస‌విలోనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాల‌నుకున్నారు కానీ.. ఏవో కార‌ణాల‌తో సాధ్య‌ప‌డ‌లేదు. క‌నీసం రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయ‌కుండా, ఏ అప్‌డేట్ ఇవ్వ‌కుండా ఉండిపోవ‌డం వ‌ల్ల సినిమా మీద ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి స‌న్న‌గిల్లిపోయే ప్ర‌మాదం ఉంది. ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ కొరియ‌న్ క‌న‌క‌రాజు రిలీజ్ విష‌యంలో ఒక నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది.

ఆగ‌స్టు 7న వ‌రుణ్ కొత్త చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని నిర్ణ‌యించార‌ట‌. యువి బేన‌ర్లోనే తెర‌కెక్కిన పెద్ద సినిమా విశ్వంభ‌ర విష‌యం ఎటూ తేల‌కుండా ఉండ‌డంతో కొరియ‌న్ క‌న‌క‌రాజు మీద కూడా నిర్మాత‌లు ఫోక‌స్ పెట్ట‌లేక‌పోయారు. మ‌రి ఇప్పుడు విశ్వంభ‌ర సంగ‌తి తేలిందో లేదో కానీ.. కొరియ‌న్ క‌న‌క‌రాజును అయితే ఆగ‌స్టు తొలి వారంలో థియేట‌ర్ల‌లోకి తీసుకొచ్చేయ‌బోతున్నారు. ఈ సినిమా ఆల‌స్యానికి డిజిట‌ల్ డీల్ తేల‌క‌పోవ‌డం కూడా ఒక కార‌ణ‌మ‌ని వార్త‌లు వ‌చ్చాయి. వ‌రుణ్ వ‌రుస ఫ్లాపుల నేప‌థ్యంలో ఈ సినిమాకు డిమాండ్ త‌క్కువ‌గానే ఉండొచ్చు. ద‌ర్శ‌కుడు మేర్ల‌పాక గాంధీ కూడా ఇప్పుడు అంత గొప్ప ఫాంలో ఏమీ లేడు. చివ‌రి రెండు చిత్రాలు కృష్ణార్జున యుద్ధం, లైక్ షేర్ సబ్‌స్క్రైబ్ ఫ్లాప‌య్యాయి. కానీ కొరియ‌న్ క‌న‌క‌రాజు కాన్సెప్ట్, ప్రోమోలు అయితే ఇంట్రెస్టింగ్‌గానే అనిపించాయి. మిరాయ్ భామ రితిక నాయ‌క్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో స్టార్ క‌మెడియ‌న్ స‌త్య కీల‌క పాత్ర పోషించాడు.

Tags:    

Similar News