`ది ప్యారడైజ్` ముంబై ప్రెస్ మీట్‌లో హై డ్రామా.. కారు చోరీ కారణంగానే డిలే!
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం క్యూరియాసిటీని అదుపు చేయలేని స్థితిలో ఉన్నారు. మరి కొద్ది గంటల్లోనే ది ప్యారడైజ్ సమీక్షలతో వెబ్ హోరెత్తబోతోంది.
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం క్యూరియాసిటీని అదుపు చేయలేని స్థితిలో ఉన్నారు. మరి కొద్ది గంటల్లోనే ది ప్యారడైజ్ సమీక్షలతో వెబ్ హోరెత్తబోతోంది. అయితే చివరి నిమిషం వరకూ తన సినిమాని ప్రమోట్ చేస్తూ నాని ఎంతగా అలసిపోయారు అర్థం చేసుకోవాలి. అయితే ఈ ప్రయాణాల్లో ఒక తమాషా సంఘటన నిజంగా షాకిచ్చింది.
నాని, సోనాలి కులకర్ణి, రాఘవ్ జుయాల్ , కయాదు లోహర్ తదితరులు నటించిన `ది ప్యారడైజ్` చిత్రం ప్రెస్‌మీట్ నిన్న సాయంత్రం ముంబైలో ఘనంగా జరిగింది. సాధారణంగా పాన్-ఇండియా సినిమాల నటులు వేదికపైకి వచ్చి హోస్ట్ అడిగే ముందే నిర్ణయించిన ప్రశ్నలకే సమాధానాలు ఇస్తుంటారు. కానీ `ది ప్యారడైజ్` నటులు మాత్రం ఇందుకు భిన్నంగా నేరుగా మీడియా నుంచి ప్రశ్నలను స్వీకరించడం విశేషం. అయితే ఈ కార్యక్రమం చాలా ఆలస్యంగా ప్రారంభం కావడంతో మీడియా ప్రతినిధులు అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాని, రాఘవ్ జుయాల్ ఆలస్యానికి క్షమాపణలు చెప్పడమే కాకుండా.. జరిగిన సరదా సంఘటనలతో అందరినీ నవ్వించారు.
ఎల్లప్పుడూ ఉత్సాహంగా, చురుగ్గా ఉండే రాఘవ్ జుయాల్ ఈ సమావేశంలో కొంచెం సైలెంట్‌గా కనిపించారు. తన మూడ్ గురించి వివరిస్తూ.. ''ఆ ప్రాంతంలోని శక్తికి తగినట్టుగా నేను స్పందిస్తాను. అందరూ మాకోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో చూసినప్పుడు మేము చేయాల్సిన మొదటి పని `సారీ` చెప్పడమే. మా తప్పు లేకపోయినా ఆలస్యమైనందుకు క్షమించండి. పైలట్‌దే తప్పు.. దారిలో గుంతలు చాలా ఉన్నాయి!'' అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. కొంచెం సీరియస్‌గా స్పందిస్తూ.. ''అక్కడ చాలా టర్బులెన్స్ ఉంది.. అందుకే ఆలస్యమైంది. ఏదేమైనా చివరికి ఇక్కడ ఉండటం నాకు ఆనందంగా ఉంది'' అని వ్యాఖ్యానించాడు.
అనంతరం నాని మాట్లాడుతూ హైదరాబాద్‌లో జరిగిన `ది ప్యారడైజ్` ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను గుర్తుచేసుకున్నారు. ``అక్కడ ప్రజలు సినిమాను ఎంతో గొప్పగా పండుగలా సెలబ్రేట్ చేసుకుంటారు. నాకు కన్నీళ్లు వచ్చాయి. ప్రతి సాంకేతిక నిపుణుడిని వారు గౌరవిస్తారు. అక్కడి ప్రేక్షకులకు సౌండ్ ఇంజనీర్ ఎవరో కూడా తెలుసు`` అని నాని ప్రశంసించారు. అదే సమయంలో ప్రేక్షకుల నుండి ఒక వ్యక్తి వెళ్ళిపోతుండగా చూసిన రాఘవ్.. ``కహాన్ జా రహే హో భయ్య్రా? నేను ఇప్పుడే అదే చెబుతున్నాను!`` అంటూ ఆయన దగ్గరికి వెళ్లడంతో అందరూ నవ్వుకున్నారు. ఆ వ్యక్తి తాను వెళ్లడం లేదని.. లైవ్ వెబ్‌కాస్ట్ మేనేజ్‌మెంట్ టీమ్‌లో భాగమని స్పష్టం చేశారు. ఆయన ఫోన్ చూసిన నాని.. ``ఓహ్, ఈ ఈవెంట్ లైవ్ స్ట్రీమింగ్ అవుతోందా? నేను కనిపిస్తున్నానా? బాప్ రే బాప్!`` అంటూ ఆశ్చర్యపోయారు.
తరువాత మైక్ అందుకున్న నాని ఆలస్యానికి అసలు కారణాన్ని వివరిస్తూ.. ``రాఘవ్ ఫ్లైట్‌లో నేనూ ఉన్నాను! ఆలస్యానికి అది ఒక కారణం. మరొక కారణం ఏమిటంటే.. రాఘవ డ్రైవర్ వేరే వాళ్ళ కార్‌ను దొంగిలించాడు!`` అని చెప్పడంతో అందరూ షాకయ్యారు. సోనాలి కులకర్ణి, కయాదు లోహర్ తదితరులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. దీనిపై రాఘవ్ స్పందిస్తూ అసలు విషయం బయటపెట్టారు. ఎయిర్‌పోర్ట్ నుండి తనను తీసుకురావడానికి కారు తీసుకెళ్లమని డ్రైవర్‌కు చెబితే పొరపాటున అదే బిల్డింగ్‌లో ఉండే వేరే వ్యక్తి కారును డ్రైవర్ తీసుకువెళ్లాడని తెలిపారు. రెండు కార్లు ఒకే మోడల్ కావడంతో సెక్యూరిటీ గార్డ్ పొరపాటున వేరే కారు తాళాలు ఇచ్చాడని.. అసలు విషయాన్ని గమనించకుండా డ్రైవర్ వెళ్లిపోయాడని చెప్పారు.
మరోవైపు ఆ కారు యజమాని పని మీద బయలుదేరేసరికి తన కారు కనిపించకపోవడంతో షాక్ అయ్యారని గార్డ్‌ను అడిగితే ``మీ కారును ఎవరో తీసుకెళ్లారు`` అని చెప్పడంతో తీవ్ర గందరగోళం నెలకొందని రాఘవ్ వివరించారు. ఈ అనూహ్య ఘటనల కారణంగానే ప్రెస్‌మీట్‌కు రావడంలో తీవ్ర ఆలస్యం జరిగిందని తెలిపారు. ఇక ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న `ది ప్యారడైజ్` సినిమా సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.