అసలు అనుష్క నెక్స్ట్ ప్లాన్ ఏంటి!
| ‘ఘాటీ’ తర్వాత అనుష్క శెట్టి మరో తెలుగు సినిమాను ప్రకటించలేదు. కథ, తన పాత్రకు ప్రాధాన్యం ఉంటేనే కొత్త ప్రాజెక్టులకు ఓకే చెబుతున్నారని టాక్. ప్రస్తుతం జయసూర్య హీరోగా నటిస్తున్న మలయాళ ఫాంటసీ థ్రిల్లర్ ‘కథనార్’లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇది ఆమె తొలి మలయాళ చిత్రం, కెరీర్లో 50వ సినిమా కావడం విశేషం. దీని విడుదల తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టిని మళ్లీ బిగ్ స్క్రీన్ పై చూడాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. కానీ స్వీటీ మాత్రం కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే విషయంలో అస్సలు తొందరపడటం లేదు. గతేడాది సెప్టెంబర్ లో వచ్చిన 'ఘాటీ' తర్వాత ఆమె మరో తెలుగు ప్రాజెక్ట్ ను అధికారికంగా అనౌన్స్ చేయలేదు. దాదాపు పద్నాలుగు నెలలు గడిచిపోయినా కొత్త కబురు లేకపోవడంతో, అసలు అనుష్క నెక్స్ట్ ప్లాన్ ఏంటనే టాక్ ఇండస్ట్రీలో నడుస్తోంది.
నిజానికి అనుష్కకు ఇప్పటికీ సోలో హీరోయిన్ గా మంచి మార్కెట్ ఉంది. 'అరుంధతి', 'భాగమతి', 'రుద్రమదేవి' లాంటి సినిమాలతో ఆమె తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. అందుకే స్వీటీని దృష్టిలో పెట్టుకుని కథలు రాసుకునే దర్శకులు, నిర్మాతలు ఇప్పటికీ చాలామందే ఉన్నారు. భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తూ పలువురు దర్శకులు కథలు వినిపిస్తున్నా, కంటెంట్ పూర్తిగా నచ్చితే తప్ప ఆమె ఓకే చెప్పడం లేదని టాక్.
ఇప్పటి ట్రెండ్ లో శ్రియ, కాజల్ అగర్వాల్ లాంటి సీనియర్ హీరోయిన్లు తమకు సరిపోయే క్యారెక్టర్ రోల్స్, స్టార్ హీరోల సినిమాల్లో ప్రత్యేక పాత్రలు చేస్తూ బిజీగా ఉంటున్నారు. కానీ అనుష్క మాత్రం ఆ రూట్ లో వెళ్లడానికి ఇష్టపడటం లేదు. కథలో తన పాత్రకు బలమైన ప్రాధాన్యం ఉంటేనే చేయాలని ఫిక్స్ అయ్యారు. కెరీర్ లో ఇప్పటికే భారీ హిట్లు, స్టార్ డమ్ చూసిన స్వీటీకి, ఇప్పుడు కేవలం డబ్బు కోసమే సినిమాలు చేయాల్సిన అవసరం లేదని సినీ వర్గాలు అంటున్నాయి.
అయితే ఈ అతి జాగ్రత్త వల్ల అనుష్క సినిమాల మధ్య గ్యాప్ బాగా పెరిగిపోతోంది. 2020లో 'నిశ్శబ్దం' తర్వాత, 2023లో 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఆ తర్వాత 2025లో 'ఘాటీ' రిలీజైంది. ఇలా ప్రతి సినిమాకు దాదాపు రెండేళ్ల గ్యాప్ వస్తోంది. పైగా 'ఘాటీ' బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో, స్వీటీ నుంచి ఒక సాలిడ్ కమ్ బ్యాక్ సినిమా రావాలని ఆడియన్స్ కోరుకుంటున్నారు.
మరోవైపు 2026 నుంచి ఎక్కువ సినిమాలు చేస్తానని గతంలో అనుష్క హింట్ ఇచ్చినప్పటికీ, తెలుగులో ఇంతవరకు కొత్త ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ప్రస్తుతం ఆమె నటించిన మలయాళ ఫాంటసీ థ్రిల్లర్ 'కథనార్' రిలీజ్ కు సిద్ధమవుతోంది. జయసూర్య హీరోగా రోజిన్ థామస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో స్వీటీ 'కల్లియంకట్టు నీలి' అనే పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్నారు. ఇది ఆమెకు తొలి మలయాళ మూవీ కావడంతో పాటు కెరీర్ లో 50వ సినిమా కావడం విశేషం.
భారీ వీఎఫ్ఎక్స్ హంగులతో రూపొందుతున్న 'కథనార్' కోసం అనుష్క ఎక్కువ డేట్స్ కేటాయించి వర్క్ చేశారు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఇంకా మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అటు తెలుగులోనూ కొత్త కథకు ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారో తెలియాల్సి ఉంది. మరి ఈ 50వ చిత్రంతో స్వీటీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.