స్టార్ హీరో వైఖరి దారుణం అంటూ వాపోయిన నటి
| నవాజుద్దీన్ సిద్ధిఖీ వైఖరిని విమర్శిస్తూ దియా మీర్జా ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ చర్చనీయాంశమైంది. అతడితో కలిసి పనిచేయడం ఓ పీడకల అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలకు నవాజుద్దీన్ కూడా కౌంటర్ ఇచ్చారు. అయితే ఇదంతా వీరిద్దరూ కలిసి నటిస్తున్న ‘హసన్ ఎం.డి.’ వెబ్ సిరీస్ ప్రమోషన్‌లో భాగమని తెలుస్తోంది. 2026 డిసెంబర్‌లో విడుదల కానున్న ఈ సిరీస్‌లో నవాజుద్దీన్ మొరటుగా ప్రవర్తించే తెలివైన డాక్టర్ పాత్రలో కనిపించనున్నారు.
ఫలానా హీరోతో కలిసి పని చేయడం అంటే నరకం.. అతడికి కనీస ప్రవర్తన తెలీదు! అంటూ ఆరోపించిన సందర్భాలున్నాయి. ఫలానా దర్శకుడు లేదా నిర్మాతతో తమకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయో చెప్పిన వారున్నారు.. ఫలానా సహనటి ప్రాబ్లమ్యాటిక్ అంటూ ఆరోపించిన సందర్భాలు ఉన్నాయి. సీనియర్ నటుడు నానా పటేకర్ పై తనూశ్రీదత్తా, హృతిక్ రోషన్ పై కంగన, కే.రాఘవేంద్రరావుపై తాప్సీ పన్ను ఎలాంటి ఆరోపణలు చేసారో చూసాం.
ఇప్పుడు అందాల నటి దియా మీర్జా ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీపై చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. అతడి వైఖరిని విమర్శిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక క్రిప్టిక్ మెసేజ్ పోస్ట్ చేయడం అభిమానులలో ఊహాగానాలకు తెరలేపింది.
``అతనితో కలిసి పనిచేయడం ఒక పీడకల! మాట్లాడే మర్యాద లేదు.. వైఖరి మరీ దారుణం! పూర్తిగా అభ్యంతరకరమైన ప్రవర్తన!`` అంటూ దియా మీర్జా ఫైరయ్యారు. దియా ఈ మెసేజ్ లో నవాజుద్దీన్ సిద్ధిఖీని ట్యాగ్ చేశారు. అతడికి యాటిట్యూడ్ ఎక్కువ అని కూడా అన్నారు.
అయితే దీనికి కౌంటర్ గా నవాజుద్దీన్ కూడా స్పందించారు. ``యాటిట్యూడ్ లో తప్పులు వెతకడం సులభం. నా పనిలో తప్పులు వెతకండి!`` అంటూ అతడు ప్రతిస్పందించారు. అయితే ఆ ఇద్దరి మధ్యా నిజంగానే యుద్ధం నడుస్తోందని ప్రజలు ఖంగు తిన్నారు.
కానీ ఇంతలోనే ఇదంతా ఉత్తుత్తేనని తెలిసి ఇప్పుడు ఈ వేషాలను చీదరించుకుంటున్నారు. తమ సినిమా ప్రచారం కోసం ఇతరుల్లానే దియా మీర్జా లాంటి డీసెంట్ నటి.. నవాజుద్దీన్ లాంటి జెంటిల్మన్ ఇలా ఇష్టానుసారం నాటకం ఆడటాన్ని ఎవరూ జీర్ణించుకోవడం లేదు.
దియా మిర్జా హైదరాబాదీ అమ్మాయి. బాలీవుడ్ లో సెటిలయ్యారు. ముంబైలో నివాసం ఉంటున్నారు. నవాజుద్దీన్ తో ప్రస్తుతం పాపులర్ అమెరికన్ మెడికల్ డ్రామా `హౌస్ ఎం.డి.` కి దేశీ రీమేక్‌గా తెరకెక్కుతున్న `హసన్ ఎం.డి.` అనే వెబ్ సిరీస్‌లో నవాజుద్దీన్ తో కలిసి నటిస్తున్నారు. 2026 డిసెంబర్‌లో విడుదల కానున్న ఈ సిరీస్‌లో నవాజుద్దీన్ అత్యంత మేధావి అయినా.. ఎంతో మొరటుగా, ముక్కుసూటిగా ప్రవర్తించే డాక్టర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన పాత్ర స్వభావాన్ని ఉద్దేశిస్తూ దియా మీర్జా `అఫెన్సివ్ క్యారెక్టర్` అని పోస్ట్ పెట్టి ఉండవచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకు ఇద్దరిలో ఎవరూ అధికారికంగా స్పష్టత ఇవ్వలేదు.