తాగుబోతు పాత్ర కోసం మందు తాగారా?
| 1984లో విడుదలైన ‘శరాబీ’ సినిమాలో తాగుబోతు పాత్ర కోసం నిజంగానే మద్యం సేవించారా అని ఓ కంటెస్టెంట్ అడగ్గా, అమితాబ్ బచ్చన్ ఆసక్తికరంగా స్పందించారు. ఆ పాత్రలో కనిపించిందంతా స్వచ్ఛమైన నటనేనని, ఎలాంటి మద్యం తాగలేదని స్పష్టం చేశారు. సినిమా విజయంలో కథ, తండ్రీకొడుకుల భావోద్వేగాలు కూడా కీలకమని కేబీసీ షోలో గుర్తుచేసుకున్నారు.
బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన చిత్రాలున్నాయి. అందులో 1984లో రిలీజ్ అయిన `శరాబీ` సినిమా ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఈ చిత్రంలో అమితాబ్ పోషించిన తాగుబోతు పాత్ర ఎంతగా పాపులర్ అయిందో చెప్పాల్సిన పనిలేదు. అమితాబ్ నడిచే విధానం.. డైలాగ్ డెలివరీ.. హావభావాలు అప్పట్లో ప్రేక్షకులను కట్టి పడేసాయి. ఆ సినిమాలో అమితాబ్ నటన ఎంత సహజంగా ఉంటుందంటే? నిజంగానే ఆయన తాగి నటించారేమో అని చాలా మంది భావించారు. తాజాగా కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్ 18 షోలో అమితాబ్ బచ్చన్ ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర అను భవాన్ని పంచుకున్నారు.
కంటెస్టెంట్ `శరాబీ` సినిమా 50 సార్లు చూశానని తెలిపారు. ఆ చిత్రంలో అమితాబ్ తాగుబోతు హావభావాలు పూర్తిగా సహజంగా ఉన్నాయని..అసలు ఆ పాత్ర కోసం ఆయన నిజంగానే ఆల్కహాల్ తీసుకుని నటించారా ?లేక? నటనతోనే అద్భుతం చేశారా? అని సరదాగా ప్రశ్నించారు. ఈ ప్రస్తావనకు అమితాబ్ తనదైన శైలిలో స్పందించారు. ప్రేక్షకులు తన నటన చూసి అలా అనుకోవడం సహజమే అయినా? తెరవెనుక నిజం వేరే ఉందని స్పష్టం చేశారు.
`మీరు చక్కటి ప్రశ్న అడిగారు. మేము ఎలాంటి మందు తాగి ఆ పాత్రలో నటించలేదు. అక్కడ కనిపించిందంతా స్వచ్ఛమైన నటన మాత్రమే` అంటూ అమితాబ్ సరదాగా బదులిచ్చారు. అయితే అమితాబ్ మాత్రం ఆ సినిమా విజయానికి తన పాత్ర మాత్రమే కారణం కాదన్నారు. ఆ చిత్రంలో బలమైన కథాంశం.. తండ్రీకొడుకుల మధ్య ఉండే సున్నితమైన భావోద్వేగాలు.. దిగ్గజ నటుడు ఓం ప్రకాష్‌తో తన పాత్రకు ఉన్న అనుబంధమే ఆ సినిమాను నిలబెట్టాయని గుర్తు చేసుకున్నారు.
ఆ చిత్రంలో కథలో డెప్త్ అమితాబ్ కు వ్యక్తిగతంగా కూడా ఎంతో ఇష్టమన్నారు. ఎనభై ఏళ్ల వయసు దాటినా అదే జోరుతో `కేబీసీ షోను విజయవంతంగా నిర్వహిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న అమితాబ్ బచ్చన్.. నాటి జ్ఞాపకాలను ఇలా పంచుకోవడం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. అనుభవం.. అంకితభావం ఉంటే ఎలాంటి పాత్రనైనా తెరపై ఎంత సహజంగా పండించొచ్చో? అమితాబ్ మాటలతో మరోసారి నిరూపించారు.
ఇక అమితాబ్ సినిమాల విషయానికి వస్తే బాలీవుడ్ తో పాటు సౌత్ ఇండస్ట్రీని దున్నేస్తోన్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోల చిత్రాల్లో కీలక పాత్రల్లో అవకాశం వస్తే నిర్మొహమాటంగా కమిట్ అవుతున్నారు. ఆయన ఇమేజ్ కు తగ్గ పాత్రలనే మేకర్స్ సిద్దం చేస్తుండటంతో రెండు రకాలుగానూ అమితాబ్ కు కలిసొస్తుంది.