మారుతోన్న హీరోయిన్ల ప్రాధాన్యత!
| ఒకప్పుడు పాటలు, రొమాంటిక్ సీన్లకే పరిమితమైన హీరోయిన్ పాత్రలు ఇప్పుడు కొత్త రూపం సంతరించుకుంటున్నాయి. విద్యాబాలన్, రెజీనా కసాండ్రా, సంయుక్త మీనన్ వంటి నటీమణులు నెగెటివ్ షేడ్స్, కథను మలుపు తిప్పే పాత్రలతో మెప్పిస్తున్నారు. రష్మిక, శ్రుతి హాసన్ వంటి హీరోయిన్లు కూడా విభిన్న పాత్రలు ఎంచుకుంటూ తమ నటనలోని మరో కోణాన్ని చూపిస్తున్నారు.
ఒకప్పుడు సినిమాల్లో హీరోయిన్ పాత్ర అంటే నాలుగు పాటలు.. హీరో చుట్టూ తిరిగే రెండు రొమాంటిక్ సీన్లు.. క్లైమాక్స్‌లో విలన్ చేతిలో చిక్కుకుని హీరో కోసం ఎదురు చూడటం.. దాదాపుగా కథలన్నీ ఇలాగే ఉండేవి. కానీ కాలం మారింది. ప్రేక్షకుల అభిరుచులతో పాటు కథానాయికల ఆలోచనా విధానం కూడా పూర్తిగా మారింది. ప్రస్తుతం హీరోయిన్లు గ్లామర్ డాల్స్‌గా మిగిలిపోవడానికి ఏమాత్రం ఇష్టపడటం లేదు. కథను మలుపు తిప్పే పవర్ఫుల్ పాత్రలు.. ముఖ్యంగా విలన్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేయడానికి సైతం వెనుకాడటం లేదు.
బాలీవుడ్లో ఈ ట్రెండ్‌కు విద్యాబాలన్ పునాది వేశారు. `ఇష్కియా`, `కహానీ` వంటి చిత్రాల్లో ఆమె పోషించిన గ్రే షేడ్ పాత్రలు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి. అమాయకంగా కనిపిస్తూనే తెలివితేటలతో బోల్తా కొట్టించే పాత్రల్లో విద్యాబాలన్ నటన పీక్స్‌లో ఉంటుంది. ఇటీవలే రిలీజ్ అయిన `జైలర్ 2` లో కాంతగా ఎలా మెప్పించిందో తెలిసిందే. అటుపై ఎందరో నటీమణులు సేఫ్ జోన్ నుంచి బయటకొచ్చి ప్రయోగాలు చేయడానికి విద్యాబాలన్ స్ఫూర్తిగా నిలిచారు.
సౌత్ ఇండస్ట్రీలో ఈ మార్పు మరింత స్పష్టంగా కనిపిస్తోంది. సహజ నటి సాయి పల్లవి, రెజీనా కసాండ్రా వంటి భామలు ఇమేజ్ను పక్కనపెట్టి నెగెటివ్ రోల్స్‌లో అదరగొట్టారు. `ఎవరు`, `శాకిని డాకిని` వంటి చిత్రాల్లో రెజీనా చూపించిన విలనిజం.. కళ్లలోనే క్రూరత్వాన్ని పలికించిన విధానం చూసి ఆడియన్స్ షాక్ అయ్యారు. అలాగే `విరూపాక్ష` సినిమాలో సంయుక్త మీనన్ పోషించిన పాత్ర క్లైమాక్స్‌లో ఇచ్చే ట్విస్ట్ థియేటర్లలో గూస్ బంప్స్ తెప్పించింది. సాయి పల్లవి తాజా చిత్రం `ఓం` లో ఐపీఎస్ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇదో రియల్ లైఫ్ పాత్ర కావడం విశేషం.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న క్యూట్ పాత్రలకే పరిమితం కాలేదు. తన నటనలోని మరో కోణాన్ని చూపించడానికి సిద్ధమయ్యారు. `పుష్ప` చిత్రంలో శ్రీవల్లిగా తనదైన బాడీ లాంగ్వేజ్‌తో ఆకట్టుకున్న అమ్మడు కథ డిమాండ్ చేస్తే ఎలాంటి ఛాలెంజింగ్ పాత్రలైనా చేయడానికి రెడీ అని నిరూపించుకున్నారు. అంతకు ముందు `సీతారామం`లో కథను మలుపు తిప్పే పాత్రతోనూ అలరించిన సంగతి తెలిసిందే. శ్రియ సైతం ఇలాంటి అవకాశాలు వస్తే నో చెప్పకుండా పని చేస్తోన్న సంగతి తెలిసిందే. కూలీ చిత్రంలో శ్రుతి హాసన్ కూడా కీలక పాత్రతో అలరించిన సంగతి విధితమే. ఇలాంటి పాత్రలు పోషించడం భామలకు అన్ని రకాలుగా కలిసొస్తుంది. ఒకే రకమైన ఇమేజ్ కు పరిమితం కాకుండా? కీలక పాత్రల్లోనూ మెప్పించగలరు అన్న ధైర్యాన్ని మేకర్స్ కు ఇవ్వగలుగుతున్నారు.