13 ఏళ్ల దాంపత్య బంధానికి ముగింపు!
విను మోహన్, విద్యలు 2013లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఒకే పరిశ్రమలో పనిచేస్తున్న సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి ఇరు కుటుంబాల సమక్షంలో ఒక్కటయ్యారు.
మలయాళ చిత్ర పరిశ్రమలో మరో విషాదకర వార్త. ప్రముఖ మలయాళ నటుడు విను మోహన్- ఆయన భార్య నటి విద్య 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. సుదీర్ఘ కాలం పాటు కలిసి ఉన్న జంట పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవడానికి సిద్ధమైనట్లు మీడియా కథనాలు వెడెక్కిస్తున్నాయి.
విను మోహన్, విద్యలు 2013లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఒకే పరిశ్రమలో పనిచేస్తున్న సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి ఇరు కుటుంబాల సమక్షంలో ఒక్కటయ్యారు. దశాబ్ద కాలానికి పైగా ఎంతో అన్యోన్యంగా గడిపిన దాంపత్య జీవితంలో ఇటీవల వ్యక్తిగత విభేదాలు తలెత్తినట్లు సమాచారం.
కొంతకాలంగా ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో వేర్వేరుగా నివసిస్తున్నట్లు సమాచారం. సోషల్ మీడియా ఖాతాల్లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం, గతంలో షేర్ చేసిన జంట ఫోటోలను తొలగించడంతో విడాకుల రూమర్లకు మరింత బలం చేకూరింది. అయితే ఈ అంశంపై విను మోహన్ కానీ, విద్య కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
విను మోహన్ మలయాళంలో మంచి గుర్తింపు పొందిన నటుడు. ప్రముఖ దిగ్గజ నటుడు కొట్టారక్కర శ్రీధరన్ నాయర్ మనవడైన విను మోహన్ దర్శకుడు లోహితదాస్ తెరకెక్కించిన `నివేద్యం` సినిమా తో కథానాయకుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత `సైకిల్`, `చట్టంబినాడూ` వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు.
మరోవైపు విద్య కూడా మలయాళంతో పాటు తమిళ చిత్రసీమలో, ముఖ్యంగా బుల్లితెరపై నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పలు ప్రజాదరణ పొందిన ధారావాహికలు.. సినిమాల ద్వారా ఆకట్టుకున్న విద్యకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఇలాంటి క్రేజీ జోడీ విడిపోతున్నారనే వార్త విన్న అభిమానులు, సినీ ప్రియులు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. 13 ఏళ్ల సుదీర్ఘ అనుబంధం ముగించడం పట్ల విచారం వ్యక్తం చేస్తు న్నారు.
వ్యక్తిగత జీవితంలో ఇద్దరికీ మంచి జరగాలని నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు. అయితే ఇరువురు నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోవడంతో? ఇదంతా తప్పుడు ప్రచారమని కొంత మంది వాదిస్తున్నారు. కానీ సన్నిహిత వర్గాల నుంచి మాత్రం విడిపోతున్నారనేది బలమైన ప్రచారం. ఆ సంగతి పక్కన బెడితే? వ్యక్తిగత జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా? వృత్తిపరంగా ఇద్దరు తమ ప్రాజెక్టులతో బిజీగా గడుపుతుండటం విశేషం.