సినిమా రంగానికి తీరని లోటు!
మలయాళ సినీ పరిశ్రమలో తీవ్ర శోకం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటి, నాటకరంగ కళాకారిణి సావిత్రి శ్రీధరన్ కన్నుమూశారు.
మలయాళ సినీ పరిశ్రమలో తీవ్ర శోకం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటి, నాటకరంగ కళాకారిణి సావిత్రి శ్రీధరన్ కన్నుమూశారు. గత కొంతకాలంగా వయోసహజ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల మలయాళ చిత్రసీమతో పాటు సినీ అభిమానులు, నాటకరంగ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
సావిత్రి శ్రీధరన్ నటనా జీవితాన్ని నాటకరంగం ద్వారా ప్రారంభించారు. నాటకాల్లో సహజసిద్ధమైన నటనతో, అద్భుతమైన సంభాషణల ఉచ్చారణతో వేదికపై ఎన్నో మరపురాని పాత్రలను పోషించి మంచి పేరు తెచ్చుకున్నారు. దశాబ్దాల పాటు నాటకరంగంలో సేవలు అందించి అనేక అవార్డులు , రివార్డులు నాటక ప్రేమికుల ప్రశంసలు అందుకున్నారు.
నాటకరంగంలో ఎంతో అనుభవం సంపాదించిన తర్వాత సావిత్రి వెండితెరపై అడుగుపెట్టారు. 2018లో విడుదలైన `సుడాని ఫ్రమ్ నైజీరియా` చిత్రం ఆమె కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది. ఈ సినిమాలో తల్లి పాత్రలో సావిత్రి శ్రీధరన్ కనబరిచిన నటన ప్రేక్షకులను, విమర్శకులను అమితంగా ఆకట్టుకుంది.
`సుడాని ఫ్రమ్ నైజీరియా` చిత్రంలో చూపిన అత్యుత్తమ నటనకు గానూ ఆమెకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఈ చిత్రానికి గానూ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో గౌరవప్రదమైన `స్పెషల్ మెన్షన్` సాధించడమే కాకుండా కేరళ రాష్ట్ర ఉత్తమ క్యారెక్టర్ నటి అవార్డును కూడా గెలుచుకున్నారు. సాధారణ నాటక వేదిక నుంచి ప్రారంభమై జాతీయ స్థాయి గుర్తింపు సాధించిన సావిత్రి ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం.
అటుపై సావిత్రి `వైరస్` వంటి పలు ప్రముఖ మలయాళ చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషించి నటిగా ప్రత్యేక ముద్ర వేశారు. ఏ పాత్ర చేపట్టినా అందులో పరకాయ ప్రవేశం చేసి సహజత్వంతో జీవించడం ఆమె ప్రత్యేకాంశం. మాతృమూర్తి పాత్రలకు సావిత్రి తనదైన శైలిలో జీవాన్ని అందించారని సినీ ప్రముఖులు కొనియాడుతున్నారు.
సావిత్రి శ్రీధరన్ మరణం మలయాళ చిత్రసీమకు.. ముఖ్యంగా నాటకరంగానికి తీరని లోటని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. ఆమె పోషించిన పాత్రలు, అందించిన కళాసేవలు ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి.