ధనుష్, సూర్య... ఇప్పుడు మనోడికి హెల్ప్ అవుతుందా?

గత కొన్నేళ్లలో తమిళ హీరోలు మన దర్శకులతో సినిమాలు చేసి తెలుగులో మంచి రిజల్ట్స్ అందుకున్నారు.

Update: 2026-08-21 01:30 GMT

గత కొన్నేళ్లలో తమిళ హీరోలు మన దర్శకులతో సినిమాలు చేసి తెలుగులో మంచి రిజల్ట్స్ అందుకున్నారు. ధనుష్‌కు వెంకీ అట్లూరి ‘సార్’ మంచి హిట్ ఇచ్చాడు. తర్వాత శేఖర్ కమ్ముల ‘కుబేర’లో కూడా ధనుష్‌కు తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్‌గా వెంకీ అట్లూరి సూర్యతో చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ కూడా రెండు భాషల్లో మంచి ఓపెనింగ్ తెచ్చుకుంది. ఇప్పుడు ఈ లెక్క రివర్స్‌లో జరిగే ఛాన్స్ కనిపిస్తోంది.

వరుణ్ తేజ్‌తో తమిళ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ సినిమా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అది కూడా యాక్షన్ సినిమా కాదు.. లవ్ స్టోరీ అని ప్రచారం జరుగుతోంది. ఇంకా ప్రాజెక్ట్ అఫీషియల్ కాలేదు. కానీ ఈ కాంబినేషన్ నిజమైతే వరుణ్‌కు తెలుగుతో పాటు తమిళంలో కూడా కొత్తగా ట్రై చేసే ఛాన్స్ దొరుకుతుంది. కార్తిక్‌కు అక్కడ తనకంటూ మంచి పేరు ఉండటమే దీనికి ప్లస్.

పిజ్జా, జిగర్తాండ, పేట, జిగర్తాండ డబుల్ ఎక్స్ సినిమాలతో కార్తిక్ తన స్టైల్‌ను ఎప్పుడో సెట్ చేసుకున్నాడు. ‘జిగర్తాండ డబుల్ ఎక్స్’కు మంచి పేరు రావడంతో పాటు బాక్సాఫీస్ దగ్గర కూడా డీసెంట్ రన్ వచ్చింది. అయితే సూర్యతో చేసిన ‘రెట్రో’పై పెద్ద అంచనాలు ఉన్నా రిజల్ట్ మాత్రం ఆ స్థాయిలో వెళ్లలేదు. అయినా కార్తిక్ సినిమా అంటే తమిళంలో ఒక సెక్షన్ ఆడియన్స్ తప్పకుండా ఆసక్తి చూపుతారు.

వరుణ్‌కు కార్తిక్‌తో పాత కనెక్షన్ కూడా ఉంది. అతనికి మంచి పేరు తెచ్చిన ‘గద్దలకొండ గణేష్’ అసలు కార్తిక్ సుబ్బరాజ్ ‘జిగర్తాండ’ కథ ఆధారంగా వచ్చింది. అప్పట్లో కార్తిక్ కథలో వరుణ్ నటించాడు. ఇప్పుడు అదే దర్శకుడు వరుణ్‌ను హ్యాండిల్ చేస్తే ఈసారి క్యారెక్టర్ కూడా పూర్తిగా ఆయన స్టైల్‌లో ఉండొచ్చు. పైగా లవ్ స్టోరీ అయితే ‘గద్దలకొండ గణేష్’తో పోలిక కూడా ఉండదు. ‘కొరియన్ కనకరాజు’తో వరుణ్‌కు ఈమధ్యే మంచి రిలీఫ్ దొరికింది. వరుసగా కొన్ని సినిమాలు ఆశించిన రిజల్ట్ ఇవ్వని సమయంలో ఈ హారర్ కామెడీకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇప్పుడు ‘భారీ’తో స్పోర్ట్స్ డ్రామా చేస్తున్నాడు. దాని తర్వాత కార్తిక్ సుబ్బరాజ్ సినిమా కుదిరితే మాత్రం వరుణ్ కెరీర్‌లో మరో కొత్త లెక్క మొదలవుతుంది. ఎందుకంటే ఈసారి జానర్ కంటే తమిళ ప్రేక్షకుల్లో తనకు ఎంత స్పేస్ దొరుకుతుందన్నది కూడా చూడాలి. ధనుష్‌కు వెంకీ అట్లూరి, శేఖర్ కమ్ముల సినిమాలు తెలుగులో మంచి రీచ్ ఇచ్చాయి. సూర్యకు ఇక్కడ మార్కెట్ ఎప్పటినుంచో ఉన్నా వెంకీ అట్లూరి సినిమా మరో మంచి రిజల్ట్ ఇచ్చింది. ఇప్పుడు కార్తిక్ కూడా వరుణ్‌కు తమిళంలో అలాంటి హెల్ప్ చేస్తాడా చూడాలి.

Tags:    

Similar News