11 ఏళ్ల జర్నీ.. భయం అన్నదే లేని ఛాలెంజింగ్ హీరో
అతడిలోని రేర్ క్వాలిటీ గురించి పరిశ్రమ వర్గాలతో పాటు ప్రజల్లోను చాలా చర్చ సాగింది. ముకుంద లాంటి క్లాస్ సినిమాతో అతడు వెండితెరకు పరిచయమయ్యాడు.;
ఆరంభమే ప్రయోగాలతో మొదలు పెట్టాడు. కమర్షియల్ సినిమాల్లో నటించాలనే ఆలోచనకు దూరంగా తన అభిరుచిని మాత్రమే అనుసరించాడు. ప్రతిసారీ వైవిధ్యం కోసం ప్రయత్నించాడు. కొత్తదనాన్ని పరిచయం చేయాలని తపించాడు. మెగా కాంపౌండ్ లో రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్లు తమ కెరీర్ బండిని పట్టాలెక్కించేందుకు ఆరంభంలో మెజారిటీ భాగం కమర్షియల్ సినిమాలకే ప్రాధాన్యతనిస్తే, దానికి భిన్నంగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆ కాంపౌండ్ లోనే గట్స్ ఉన్న డ్యాషింగ్ హీరో అని నిరూపించాడు. అతడు తన ఎంపికలతో ప్రతిసారీ ఆశ్చర్యపరిచాడు.
అతడిలోని రేర్ క్వాలిటీ గురించి పరిశ్రమ వర్గాలతో పాటు ప్రజల్లోను చాలా చర్చ సాగింది. ముకుంద లాంటి క్లాస్ సినిమాతో అతడు వెండితెరకు పరిచయమయ్యాడు. కమర్షియల్ గా ఆహా ఓహో అనే ఎలిమెంట్స్ ఏవీ ఈ చిత్రంలో ఉండవు. అయినా డీసెంట్ హిట్ కొట్టాడు. చూస్తుండగానే ఈ ఏడాదితో తెలుగు సినీరంగంలో 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వరుణ్ తేజ్ తన తరంలో అత్యంత డేరింగ్ హీరోగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్నాడు.
వరుణ్ తేజ్ తన సాహసోపేతమైన కథా ఎంపికలు, నిజాయితీతో కూడుకున్న నటన అందరికీ నచ్చింది. ప్రతిసారీ కొత్తగా ఏదైనా చూపించాలని ఈ మెగా హీరో తపించాడు. అతడు ప్రతిసారీ యూనిక్ హీరో అని నిరూపించాడు. తన తొలి చిత్రం ముకుందతోనే భావోద్వేగాలను అద్భుతంగా పలికించే హీరోగా గుర్తింపు పొందాడు. `కంచె` అనే పీరియాడికల్ వార్ డ్రామాను ఎంపిక చేయడం అతడిలోని సాహసానికి నిదర్శనం. ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమాను కాకుండా, తన కెరీర్ ప్రారంభంలోనే రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని నిరూపించాడు.
పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన లోఫర్‌తో తనలోని కమర్షియల్ పెర్ఫామర్ ని బయటకు తీసాడు. డెబ్యూ దర్శకుడితో భారీ రొమాంటిక్ బ్లాక్‌బస్టర్ `తొలి ప్రేమ`ను అందించాడు. ఈ సినిమాకి ప్రేక్షకులు, విమర్శకుల నుండి విస్తృత ప్రశంసలు దక్కాయి. ఎప్పుడూ కంఫర్ట్ జోన్‌లో ఉండని వరుణ్ తేజ్ తెలుగు సినిమాలోనే మొట్టమొదటి అంతరిక్ష చిత్రం `అంతరిక్షం 9000 కెఎంపిహెచ్`తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. మరోసారి అసాధారణ ఎంపికలకు వెనకాడని నైజాన్ని చూపించాడు వరుణ్. తక్కువ సమయంలో ఎక్కువ ప్రయోగాలు చేసాడు వరుణ్. అతడి డేర్, గట్స్ అందరినీ ఆశ్చర్యపరిచాయి. దురదృష్టవశాత్తూ ప్రయోగాలు విఫలమయ్యాయి కానీ సక్సెస్ అయి ఉంటే, అసలు టాలీవుడ్ లో ఏ ఇతర హీరోకి లేని గొప్ప మార్కెట్ రేంజ్ అతడికి అందేది.
కొన్ని వరుస ప్రయోగాల తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన అందమైన గ్రామీణ ప్రేమకథ `ఫిదా`తో హృదయాలను గెలుచుకున్నాడు. ఇందులో డెప్త్ ఉన్న నటనతో తన కెరీర్‌లో ఎన్నటికీ మరువని క్లాసిక్ ని ఖాతాలో వేసుకున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన F2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్, F3: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ లతో పూర్తి స్థాయి కామెడీ హీరోగా వరుణ్ తేజ్ నిరూపించాడు. ఈ చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. అద్భుతమైన కామిక్ టైమింగ్ ఉన్న నటుడిగాను వరుణ్ నిరూపించాడు.
హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన `గద్దలకొండ గణేష్` కెరీర్ లో మరో వైవిధ్యమైన ఎంపిక. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో అతడి మాస్ పాత్ర నిజంగా వైవిధ్యంగా కనిపిస్తుంది. ప్రత్యర్థులను సైతం ఝడిపించే పవర్ ఫుల్ కుర్రాడిగా, మునుపెన్నడూ చూడని అవతారంలో వరుణ్ కనిపించాడు.
వరుణ్ స్క్రిప్టుల ఎంపిక విషయంలో దాహంతో ఉన్నాడని ఆ తర్వాత మరో ఎంపిక క్లారిటీగా చెప్పింది. ఆపరేషన్ వాలెంటైన్ చిత్రంలో భారత వైమానిక దళంలో సాహసోపేతమైన ఐఏఎఫ్ అధికారి పాత్రలో వరుణ్ తేజ్ కనిపించాడు. సవాళ్లతో సావాసం చేయడం అతడికి ఎంత ఇష్టమో ఈ చిత్రం నిరూపించింది. భయం అన్నదే లేనివాడు వరుణ్ అని నిరూపిస్తూ, ఇప్పుడు యువి క్రియేషన్స్ - ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్త నిర్మాణంలో మేర్ల పాక దర్శకత్వం వహిస్తున్న హారర్ జానర్ చిత్రం VT15 కోసం సిద్ధమవుతున్నాడు. టైటిల్- ఫస్ట్ లుక్ లాంచింగ్ కి సమయం ఆసన్నమైందని టీమ్ ప్రకటించింది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.
అయితే ఈ 11 ఏళ్లలో వరుణ్ బహుశా సగంపైగా కెరీర్ ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు. తన నమ్మకం కొన్నిసార్లు నిజమైంది. కొన్నిసార్లు ఫెయిలైంది వరుణ్ తేజ్ ఎప్పుడూ రిపీట్ కథల్లో నటించే హీరో కానే కాడు. అతడు నేటి జెన్ జెడ్ ఆలోచనలకు ప్రతినిధి. నిరంతరం స్క్రీన్ పై తన ప్రెజెన్స్ ని అభివృద్ధి చేసుకుంటూ పరిణతి చెందిన నటుడిగా ఎదిగాడు. అతడు ప్రతిసారీ ప్రేక్షకుల అంచనాలను సవాల్ చేస్తున్నాడు. అతని ప్రయాణం సౌలభ్యం కంటే ధైర్యానికి నిదర్శనం. తన ఫిల్మోగ్రఫీ లో కంటెంట్ కే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాడు. అదే సమయంలో అతడి కెరీర్ లో బ్లాక్ బస్టర్లు అతడి మార్కెట్ డౌన్ ఫాల్ కాకుండా కాపాడాయి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చిరస్మరణీయ ప్రదర్శనలతో, అద్భుత బ్లాక్ బస్టర్ విజయాలు సాధించాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.