ఆ త‌ప్పే బ్లాక్ బ‌స్ట‌ర్ మిస్స‌య్యేలా చేసిందట‌!

ఇదిలా ఉంటే సుకుమార్ ఓ క్రేజీ మూవీ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.;

Update: 2026-02-13 06:58 GMT

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల‌లో ముందున్న రెండు స్థానాల్లో రెండ‌వ స్థానాన్ని ద‌క్కించుకున్న టాప్ డైరెక్ట‌ర్ సుకుమార్‌. `రంగ‌స్థ‌లం`తో కొత్త బాట ప‌ట్టిన ఈ లెక్క‌ల మాస్టారు `ఆర్య‌`తో స‌రికొత్త హీరోయిజానికి శ్రీ‌కారం చుట్టి తొలి మూవీతోనే ద‌ర్శ‌కుడిగా త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నారు. స్టార్ హీరోలతో పాటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల దృష్టిని ఆక‌ర్షించారు. త‌న‌దైన మార్కుని ప‌క్క‌న పెట్టి కొత్త పంథాని ఎంచుకున్న ఆయ‌న వ‌రుస హిట్లు, బ్లాక్ బ‌స్ట‌ర్ల‌తో దూసుకుపోతున్నారు. సుకుమార్ కెరీర్ గురించి చెప్పాలంటే `రంగ‌స్థ‌లం`కు ముందు త‌రువాత అని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఈ సినిమాకు ముందు భారీ డిజాస్ట‌ర్‌ని ఎదుర్కొని ఎన్టీఆర్‌తో చేసిన `నాన్నికు ప్రేమ‌తో` మూవీతో స‌క్సెస్ ట్రాక్‌లోకి వ‌చ్చేసిన సుకుమార్ త‌న స్కూల్‌కు భిన్నంగా అడుగులు వేయ‌డం మొద‌లు పెట్టాడు. అలా సుక్కు కొత్త అడుగుల ప్ర‌య‌త్న‌మే `రంగ‌స్థ‌లం`. ఆయ‌న కెరీర్‌లో మునుపెన్న‌డూ చూడ‌ని స‌క్సెస్‌, ప్ర‌శంస‌లు ఈ సినిమాకు ద‌క్కాయి. న‌టుడిగా రామ్‌చ‌ర‌ణ్‌కు మంచి గుర్తింపుని తీసుకొచ్చింది. ఇదే ఫార్ములాని పాటిస్తూ చేసిన `పుష్ప ది రైజ్‌, `పుష్ప ది రూల్‌` బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని అందించాయి.

మ‌రీ ముఖ్యంగా `పుష్ప :ది రూల్‌` ద‌ర్శ‌కుడిగా సుకుమార్ క్రేజ్‌ని పాన్ ఇండియా వైడ్‌గా వైర‌ల్ అయ్యేలా చేసింది. బ‌న్నీని తిరుగులేని పాన్ ఇండియా స్టార్‌గా నిల‌బెట్టి దేశ వ్యాప్తంగా భారీ పాపులారిటీని తెచ్చిపెట్టింది. ఈ సంచ‌ల‌న సినిమాల త‌రువాత సుకుమార్ గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌తో `పుష్ప‌`కు మించిన సినిమాకు శ్రీ‌కారం చుడుతున్నాడు. దీనికి సంబంధించిన ప్రీప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన కీల‌క అప్ డేట్‌ని మేక‌ర్స్ రిలీజ్ చేసే అవ‌కాశం ఉంది.

ఇదిలా ఉంటే సుకుమార్ ఓ క్రేజీ మూవీ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. ఇంత‌కీ సుక్కు కామెంట్ చేసిన సినిమా ఏంటో తెలుసా `వ‌న్ నేనొక్క‌డినే`. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో క‌లిసి తొలి క‌ల‌యిక‌లో చేసిన మూవీ ఇది. బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించ‌ని విజ‌యాన్ని ద‌క్కించుకోలేపోయిన ఈ మూవీ ఇప్ప‌టికీ సుకుమార్‌ని వెంటాడుతూనే ఉంది. అభిమానుల‌కు, సినీల‌వ‌ర్స్‌కు వ‌న్ ఆఫ్ ది ఫేవ‌రేట్ మూవీగా నిలిచిన ఈ సినిమా ఇప్ప‌టికీ టీవీల్లో ప్ర‌సార‌మైన మంచి టీఆర్పీని ద‌క్కించుకుంటోంది.

ఈ మూవీపై సుకుమార్‌తో పాటు మ‌హేష్ అప్ప‌ట్లో భారీ అంచ‌నాలు పెట్టుకున్నాడు. దీని కోసం మ‌హేష్ ప్ర‌త్యేకంగా సిక్స్ ప్యాక్ చేయ‌డం అప్పట్లో చ‌ర్చ‌నీయాంశం అయింది. దేవి మ్యూజిక్ వ‌న్ ఆఫ్ ది హైలైట్‌గా నిలిచింది. ఇలా ప్ర‌తి విష‌యంలోనూ కేర్ తీసుకున్నా కానీ ఫ‌లితంలేకుండా పోయింది. ఓ ఇంట‌ర్వ్యూలో అదే విష‌యాన్ని సుకుమార్ వెల్ల‌డిస్తూ ప‌లు ఆస‌క్తిక‌రంగా స్పందించారు. `సినిమాని స‌క్సెస్ చేయ‌గ‌లిగే ఛాన్స్ ఉన్నా అది జ‌ర‌గ‌లేద‌న్నారు. త‌న‌కు ఎక్కువ స‌మ‌యం ల‌భించింద‌ని, అయితే సినిమాలో కొన్ని మార్పులు చేయాల్సింద‌ని చెప్పుకొచ్చారు. అయితే దీనికి మ‌రో వెర్ష‌న్ ఉంద‌ని, దాని ప్ర‌కారం సినిమాలోని ఫ‌స్ట్ హాఫ్ త‌రువాత ఇంట‌ర్వెల్ స‌మ‌యానికి హీరో నిజానికి డ్రామా ఆడుతున్నాడ‌ని, అత‌నికి మాన‌సిక స‌మ‌స్యలు లేవ‌ని స్ప‌ష్ట‌మ‌వుతుంది.

అయితే ఆ వెర్ష‌న్‌ని ప‌క్క‌న పెట్టి మ‌రో వెర్ష‌న్‌ని తీసుకున్నాం. దాన్ని తీసుకోక‌పోవ‌డానికి కార‌ణం హీరోకు స‌మ‌స్య‌లేక‌పోతే ఎమోష‌న్స్ అంత‌గా పండ‌వ‌ని, త‌గ్గుతాయ‌ని భావించాం. కానీ మైండ్ గేమ్ వెర్ష‌న్‌ని తీసుకుని ఉంటే హీరోయిజం మ‌రింత బ‌లంగా ఉండేద‌ని సుకుమార్ అభిప్రాయ‌ప‌డ్డారు. క‌నీసం రెండు స‌న్నివేశాల‌ని జోడించి, రెండు వెర్ష‌న్‌ల‌లో ఏది బెస్ట్ అని పోల్చి చూసుకునే అవ‌కాశం ల‌భించి ఉంటే సినిమా ఫ‌లితం మ‌రోలా ఉండేద‌ని, బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యుండేద‌ని చెప్పుకొచ్చారు సుకుమార్‌.

Tags:    

Similar News