మూవీ రివ్యూ : 'వాలా-2’
గతంలో మలయాళంలో వచ్చిన ‘వాలా’ సినిమా హిట్ అవ్వడంతో దానికి కొనసాగింపుగా ‘వాలా-2’ తీశారు. కేవలం రూ.10 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రం.. మలయాళంలో రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి దూసుకెళ్తోంది.;
'వాలా-2’ మూవీ రివ్యూ
నటీనటులు: హషిర్- అలెన్- అజిన్- వినాయక- వేద శంకర్- ఏంజెల్ మరియా- దేవరాజ్- బిజూ కుట్టన్- అజు వర్గీస్- విజయ్ బాబు తదితరులు
సంగీతం: మలయాళీ మంకీస్-రజత్-పర్వతీష్- ఆర్జీ-ముత్తు-ఆర్కాడో-జజిన్-అశ్విన్-ఎలక్ట్రిక్ కిలి
నేపథ్య సంగీతం: ఎ-టీమ్
ఛాయాగ్రహణం: అఖిల్ లైలాసురన్
నిర్మాతలు: సాహు గారపాటి, విపిన్ దాస్, హారిస్ దేశం, పి.బి.అనిష్, ఆదర్శ్ నారాయణ్, ఐకాన్ స్టూడియోస్
రచన: విపిన్ దాస్
దర్శకత్వం: సవిన్ ఎస్ఏ
గతంలో మలయాళంలో వచ్చిన ‘వాలా’ సినిమా హిట్ అవ్వడంతో దానికి కొనసాగింపుగా ‘వాలా-2’ తీశారు. కేవలం రూ.10 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రం.. మలయాళంలో రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి దూసుకెళ్తోంది. ‘వాలా-2’లో నిర్మాణ భాగస్వామి అయిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ సాహు గారపాటి.. ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులోకి తీసుకొచ్చారు. ఈ సినిమా విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ :
చిన్నప్పటి స్నేహితులైన.. హషిర్ (హషిర్), అలెన్ (అలెన్).. 12వ తరగతి చదివేటప్పుడు ఓ గొడవ సందర్భంగా పరిచయం అయిన అజిన్ (అజిన్), వినాయక్ (వినాయక్) బెస్ట్ ఫ్రెండ్స్ అవుతుంటారు. తల్లిదండ్రులు వీరిని కష్టపడి చదివిస్తుంటే.. వీళ్లు మాత్రం అల్లరి చిల్లరిగా కాలేజీ జీవితాన్ని సాగిస్తుంటారు. తమకు ఉన్న చెడు అలవాట్ల వల్ల.. గొడవల కారణంగా ఈ నలుగురినీ కాలేజీ నుంచి వెళ్లగొట్టే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితుల్లో వీరికి ఒక పోలీస్ అధికారి అండగా నిలుస్తారు. తమ మీద పడ్డ చెడ్డ పేరును చెరిపి వేసుకోవాలన్న ఈ నలుగురి ప్రయత్నం ఫలించిందా.. చివరికి ఈ నలుగురి జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయి.. వీరి లక్ష్యం నెరవేరిందా అన్నది మిగతా కథ.
కథనం - విశ్లేషణ:
బయోపిక్ ఆఫ్ ఎ బిలియన్ బ్రోస్.. ‘వాళా-2’కు పెట్టిన ఈ క్యాప్షన్.. సినిమా ప్రోమోలు చూస్తేనే ఇదెలాంటి సినిమా అన్నది అర్థం అయిపోతుంది. ఇది నలుగురు కాలేజీ కుర్రాళ్ల కథ. కాలేజీ రోజుల్లో యువత చేసే అల్లరిని సరదాగా చూపించి.. ఆ తర్వాత జీవిత పరమార్థాన్ని తెలియజెప్పే ప్రయత్నం చేస్తే ఆ కథలకు ఎప్పుడూ మంచి గిరాకీ ఉంటుంది. ఈ మధ్య ‘యూత్’ అనే తమిళ సినిమా ఇలాగే మెప్పించింది. మన దగ్గరా ‘హ్యాపీడేస్’ సహా ఇలాంటి కథలు బోలెడు చూశాం. కథ పరంగా కొత్తగా అనిపించకపోయినా.. యువ ప్రేక్షకులు రిలేట్ చేసుకునే అంశాలతో చాలా వరకు సరదాగా నడుస్తూ.. ఆఖర్లో ఉద్వేగానికి కూడా గురి చేసే ‘వాలా-2’ భాషా భేదం లేకుండా అందరూ కనెక్ట్ అయ్యే సినిమాగా రూపుదిద్దుకుంది. కాలేజీ జీవితాన్ని దాటిన ప్రతి ఒక్కరికీ ఆ రోజులను గుర్తు చేస్తుందీ చిత్రం. కాలేజీ సన్నివేశాలు.. కుర్రాళ్ల అల్లరి కొన్ని చోట్ల హద్దులు దాటినట్లు అనిపించినా.. ఈ కథకు ఇచ్చిన పేఆఫ్ బాగా వర్కవుట్ అయి చివరికి మంచి అనుభూతిని మిగులుస్తుంది ‘వాలా-2’.
‘వాళా-2’ పరభాషా చిత్రం. ముఖ్య పాత్రలు చేసిన వాళ్లందరూ కొత్త వాళ్లే. మొత్తంగా ఈ సినిమాలో తెలిసిన మొహాలేవీ కనిపించవు. అయినా సినిమా ఫెమిలియర్ గా అనిపించడానికి కారణం.. అందరూ రిలేట్ చేసుకునే కథాకథనాలే కారణం. సినిమా మొదలైన కాసేపటికే ఇదీ మన కథే అనే ఫీలింగ్ వచ్చేలా చేయడం ‘వాలా-2’ ప్రత్యేకత. కథ ఏ ప్రాంతంలో జరిగినా.. కాలేజీ సన్నివేశాలంటే యూత్ ఈజీగా కనెక్ట్ అయిపోతారు. కష్టపడి చదివించే తల్లిదండ్రులు.. బాధ్యత లేని కుర్రాళ్లు.. కాలేజీలో వాళ్లు చేసే అల్లర్లు.. పడే గొడవలు.. లెక్చరర్లతో ఘర్షణలు.. అమ్మాయిలతో ప్రేమలు.. ఇలా చాలా వరకు సన్నివేశాలు మనకు అలవాటైనట్లే సాగుతుంటాయి. ప్రథమార్ధంలో చాలా వరకు సన్నివేశాలు బలమైన ఇంపాక్ట్ వేయకపోయినా.. టైంపాస్ చేయించేలా సాగుతాయి. విద్యార్థుల జీవితాలను ఉపాధ్యాయులు ఏ రకంగా అయినా ఎంతగా ప్రభావితం చేస్తారో ఇందులో బలంగా చూపించారు. తొలి గంటలో సరదాగా సాగిపోయే ‘వాలా-2’ ఇంటర్వెల్ దగ్గర సీరియస్ టర్న్ తీసుకుంటుంది. మిత్ర బృందం.. లెక్చరర్ కు దొరికిపోయాక వచ్చే సన్నివేశాలు చాలా ఇంటెన్స్ గా సాగి ఇంటర్వెల్ సమయానికి కథ రసకందాయంలో పడుతుంది.
తప్పు చేసి పోలీసులకు దొరికిపోయిన మిత్ర బృందం జీవితాలు తర్వాత ఎలాంటి మలుపు తిరిగాయన్నది ద్వితీయార్ధంలో ఆసక్తికరంగా చూపించారు. ప్రథమార్ధంలో మాదిరి ఫన్ లేకపోయినా.. సెకండాఫ్ అంతా సీరియస్ గా నడిచినా.. ప్రేక్షకులకు బోర్ కొట్టదు. అందుక్కారణం ఎమోషన్లు బలంగా పండడం. ఇంటర్వెల్ తర్వాత పోలీసులు.. స్కూల్ మీటింగ్ పెట్టే సీన్ అదిరిపోతుంది. ఆ తర్వాత కథ కొంచెం నెమ్మదించినట్లు అనిపించినా.. చివరి అరగంట మాత్రం ‘వాలా-2’ మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఎమోషన్లను దర్శకుడు చాలా బాాగా పండించాడు. కొన్ని సీన్లు కన్నీళ్లు తెప్పిస్తాయి. ముఖ్య పాత్రధారులు ఒక్కొక్కరికి.. ఒక్కో రకమైన ఎమోషన్ పెట్టి గుండెలు పిండేశాడు దర్శకుడు. అలా అని మెలో డ్రామా ఎక్కువ కూడా అయిపోలేదు. భావోద్వేగాలు మీటర్ దాటిపోలేదు. ఒక వయసు వచ్చాక కుర్రాళ్ల జీవితాలు ఎలా మారిపోతాయి. ఎంత అల్లరిచిల్లరిగా తిరిగినా భాద్యతలు వచ్చాక వాళ్లు ఎలా మారిపోతారు అనే అంశాన్ని ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారు. పిల్లలు పక్కదారి పట్టడంలో తల్లిదండ్రులు.. ఉపాధ్యాయుల పాత్రను కూడా అర్థవంతంగా చర్చించారు. అక్కడక్కడా కొన్ని లోటుపాట్లు ఉన్నప్పటికీ.. ‘వాలా-2’ అంతిమంగా ప్రేక్షకులకు సంతృప్తినిస్తుంది.
నటీనటులు :
ఈ సినిమాలో ముఖ్య పాత్రలు చేసిన కుర్రాళ్లలో ఎవ్వరూ మెయిన్ స్ట్రీమ్ యాక్టర్స్ కాదు. సోషల్ మీడియాలో పాపులర్ అయిన కుర్రాళ్లతోనే లీడ్ రోల్స్ చేయించారు. నలుగురు విద్యార్థుల పాత్రల్లో హషిర్, అలెన్, అజిన్, వినాయక్ ఎవరికి వారే సాటి అనిపించారు. ఎవ్వరూ హీరోల్లా అనిపించకుండా.. పాత్రలకు తగ్గట్లు సరిపోయారు. అందరూ సహజమైన నటనతో ఆకట్టుకున్నారు. ఈ నలుగురూ కామెడీతో పాటు ఎమోషన్లనూ బాగా పండించారు. అలెన్ చెల్లి పాత్రలో వేద శంకర్ కూడా ఆకట్టుకుంది. హషిర్ లవర్ పాత్రలో ఏంజెల్ మరియా క్యూట్ గా కనిపించి అలరించింది. పోలీస్ పాత్రలో ‘ప్రేమమ్’ దర్శకుడు ఆల్ఫాన్సో పుతెరిన్ చేసిన క్యామియో సినిమాకు హైలైట్. దేవరాజ్, బిజూ కుట్టన్, అజు వర్గీస్, విజయ్ బాబు.. మిగిలిన మలయాళ నటీనటులంతా వారి పాత్రలకు తగ్గట్టు పెర్ఫామ్ చేశారు.
సాంకేతిక వర్గం:
ఈ సినిమాకు నేపథ్య సంగీతం అతి పెద్ద బలం. ‘ఎ టీమ్’ సన్నివేశాలకు తగ్గట్లుగా చక్కటి బీజీఎంతో సినిమాకు కావాల్సిన ఎలివేషన్ ఇచ్చింది. పలువురు యువ సంగీత దర్శకులు కలిసి రూపొందించిన పాటలు కూడా ఓకే. అఖిల్ లైలాసురన్ సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకు తెలుగులో ట్రెండీ డైలాగ్స్ రాసి మన వాళ్లు బాగా కనెక్ట్ అయ్యేలా తీర్చిదిద్దారు. ‘‘మేము ప్యూర్ ఫామిలీ ఆడియన్స్ సార్. మమ్మల్ని కొడితే అనిల్ రావిపూడి అన్న ఫీల్ అవుతాడు సార్’’ లాంటి డైలాగులతో మన ఆడియన్స్ రిలేట్ అవుతారు. అనుదీప్ కేవీ రిఫెరెన్స్.. ‘జయజానకి నాయక’ డైలాగ్ లాంటివి కూడా ఆకట్టుకుంటాయి. ఐతే డబ్బింగ్ విషయంలో అంత శ్రద్ధ తీసుకున్న వాళ్ళు.. ఈ చిత్రానికి ఒక తెలుగు టైటిల్ పెట్టలేక పోవడమే విచిత్రం. నిర్మాణ విలువలు ఈ కథకు అవసరమైన స్థాయిలో ఉన్నాయి. విపిన్ దాస్ ట్రెండీ కథ రాయగా.. దర్శకుడు సవిన్ దాన్ని బాగా డీల్ చేశాడు. ఇటు కామెడీని.. అటు ఎమోషన్లను బాగా బ్యాలెన్స్ చేసి మెప్పించాడు.
చివరగా: వాలా-2.. యువతకు కిక్కు
రేటింగ్- 2.75/5