మేనల్లుడిపై దాడికి ప్రతీకారంగానే వేట.. కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు

తన మేనల్లుడిపై టూపాక్ వర్గం జరిపిన దాడికి ప్రతీకారంగానే కీఫ్ డి స్వయంగా రంగంలోకి దిగి టూపాక్ వేట మొదలుపెట్టాడని ప్రాసిక్యూషన్ కోర్టుకు వెల్లడించింది.

Update: 2026-09-01 06:58 GMT

గ్లోబల్ హిప్-హాప్ ప్రపంచంలో దిగ్గజ గాయకుడిగా వెలుగొంది 1996లో దారుణ హత్యకు గురైన టూపాక్ షాకూర్ కేసు విచారణ దాదాపు మూడు దశాబ్దాల తర్వాత లాస్ వేగాస్ కోర్టులో కీలక దశకు చేరుకుంది. ఈ హత్య కేసులో నిందితుడిగా ఉన్న మాజీ గ్యాంగ్ లీడర్ డ్యూయేన్ కీఫ్ డి డేవిస్ పై విచారణ జరుగుతుండగా జ్యూరీ ముందుకు సంచలన వివరాలు వచ్చాయి. తన మేనల్లుడిపై టూపాక్ వర్గం జరిపిన దాడికి ప్రతీకారంగానే కీఫ్ డి స్వయంగా రంగంలోకి దిగి టూపాక్ వేట మొదలుపెట్టాడని ప్రాసిక్యూషన్ కోర్టుకు వెల్లడించింది.

కేసు పూర్వాపరాల్లోకి వెళితే.. సెప్టెంబర్ 7.. 1996న లాస్ వేగాస్‌లోని ఎమ్‌జీఎమ్ గ్రాండ్ హోటల్‌లో జరిగిన మైక్ టైసన్ బాక్సింగ్ మ్యాచ్ ముగిసిన అనంత‌రం హోటల్ లాబీలో టూపాక్ -అతని అనుచరులు కీఫ్ డి మేనల్లుడు ఓర్లాండో బేబీ లేన్ ఆండర్సన్‌పై భౌతిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే కీఫ్ డి ఆ దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ క్రమంలోనే తుపాకీని ఏర్పాటు చేసి తన గ్యాంగ్ సభ్యులతో కలిసి తెల్లటి క్యాడిలాక్ కార్‌లో టూపాక్‌ను వెతుకుతూ ప్రతీకార వేట సాగించాడని ప్రాసిక్యూషన్ జ్యూరీకి వివరించింది.

విచారణ సమయంలో డిప్యూటీ డిస్ట్రిక్ట్ అటార్నీ బిను పలాల్ వాదనలు వినిపిస్తూ కీఫ్ డి నేరుగా తుపాకీ ట్రిగ్గర్ నొక్కకపోయినా హత్యకు ఆన్-ది-గ్రౌండ్ కమాండర్‌గా వ్యూహరచన చేసింది ఆయనేనని స్పష్టం చేశారు. `తన మేనల్లుడిని కొట్టినందుకు ప్రతీకారంగానే డ్యూయేన్ డేవిస్ ఈ హత్య ప్లాన్ చేశారు. విశేషమేమిటంటే? ఈ విషయాలన్నింటినీ స్వయంగా కీఫ్ డి రికార్డెడ్ ఇంటర్వ్యూలలో తన ఆత్మకథలో ఒప్పుకున్నారు అని ప్రాసిక్యూటర్లు ఆధారాలను కోర్టు ముందుంచారు.

ఇక కీఫ్ డి డిఫెన్స్ లాయర్లు మాత్రం ప్రాసిక్యూషన్ వాదనలను తిరస్కరించారు. గతంలో కీఫ్ డి ఇంటర్వ్యూలలో లేదా తన పుస్తకంలో మాట్లాడిన మాటలన్నీ కేవలం ప్రచారం కోసం, డబ్బు సంపాదన కోసం అల్లుకున్న కథలని, వాస్తవానికి అతని ప్రమేయానికి సంబంధించి ప్రత్యక్ష సాక్ష్యాలు గానీ, డీఎన్‌ఏ ఆధారాలు గానీ లేవని వాదిస్తున్నారు. గత ముప్పై ఏళ్లుగా దర్యాప్తు సంస్థలు కూడా ఆయన చెప్పిన మాటలను విశ్వసించలేదని డిఫెన్స్ కౌన్సిల్ జ్యూరీ దృష్టికి తీసుకెళ్లింది.

దాదాపు 28 ఏళ్ల పాటు దర్యాప్తు సంస్థలను వేధించిన పాప్ ఐకాన్ హత్య కేసు 2023లో కీఫ్ డి అరెస్టుతో మళ్లీ వెలుగులోకి వచ్చింది. ఆ కారులో ప్రయాణించిన వారిలో ప్రస్తుతం జీవించి ఉన్న ఏకైక సాక్షి కీఫ్ డి మాత్రమే కావడంతో ఈ క్లాసిక్ క్రైమ్ ట్రయల్ అంతర్జాతీయంగా సంగీత ప్రియులను, న్యాయ వర్గాలను విశేషంగా ఆకర్షిస్తోంది. దాదాపు నెల రోజుల పాటు సాగనున్న ఈ విచారణలో జ్యూరీ ఎలాంటి తీర్పు వెలువడుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.

సంగీత ప్రపంచాన్ని ఏలిన గ్లోబల్ స్టార్ హత్య వెనుక ఉన్న గ్యాంగ్ వార్ , ప్రతీకార కోణాలు కోర్టు విచారణ ద్వారా బయటకు వస్తున్నాయి. ఏళ్ల తరబడి అపరిష్కృతంగా మిగిలిపోయిన హత్యాకాండలో జ్యూరీ ఇచ్చే అంతిమ తీర్పుతోనైనా టూపాక్ అభిమానులకు, కుటుంబ సభ్యులకు పూర్తిస్థాయి న్యాయం జరుగుతుందో లేదో వేచి చూడాలి.

Tags:    

Similar News