వయసు ప్రభావం ఏమాత్రం లేని హీరో ఆయన: త్రివిక్రమ్
తాను చదివిన `ఆనందో బ్రహ్మః` నవల గురించి ప్రస్తావిస్తూ.. ఆ నవలకు సంబంధించి చివరి వాక్యం తనకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని తెలిపారు.
విక్టరీ వెంకటేష్- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ `ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47 - AK47` . ఈ మూవీ నుంచి మొదటి గీతం `నారాయణమ్మ` విడుదలైంది. తమన్ ఎస్ స్వరాలు అందించారు. ప్రభ, రామ్ మిరియాల ఆలపించగా.. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఈకార్యక్రమంలో జరిగిన చిట్ చాట్ లో మాట్లాడుతూ, ప్రఖ్యాత రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ నవలలపై తనకు ఉన్న అభిమానాన్ని, జ్ఞాపకాలను పంచుకున్నారు. ముఖ్యంగా అతడి రచనలు పాఠకుల మనసుపై ఎలాంటి ముద్ర వేస్తాయో తనదైన శైలిలో వివరించారు.
తాను చదివిన `ఆనందో బ్రహ్మః` నవల గురించి ప్రస్తావిస్తూ.. ఆ నవలకు సంబంధించి చివరి వాక్యం తనకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని తెలిపారు. ఎండమూరి వీరేంద్రనాథ్ రాసిన ఆ చివరి వాక్యం తనకు అత్యంత ఇష్టమైనదని పేర్కొన్నారు.
ఆ నవలలోని కథాంశాన్ని వివరిస్తూ.. అందులో `యాజీ` అనే హీరో పాత్ర ఉంటుందని..ఆ పాత్ర అంతా ఒక అమ్మాయిని వెతికే అన్వేషణలోనే సాగుతుందని చెప్పారు. అప్పటికే ఆ అమ్మాయి ఆ యువకుడికి 50 వయసు ఇచ్చేసి ఉంటుందని.. తనకంటే వయసులో పెద్దదైన ఆ అమ్మాయిని ఆ హీరో ప్రేమిస్తూ.. వెతుకుతుంటాడని తెలిపారు.
కథ చివరి మలుపు గురించి చెబుతూ.. నవల చివరి భాగంలో ఆ హీరోకి ఒక ఫోన్ కాల్ వస్తుంది.. ఫోన్ ఎత్తగానే అవతలి నుంచి `యాజీ` అని పిలిచే ఆ గొంతు వయసు ప్రభావం ఏమాత్రం లేని విధంగా వినిపిస్తుందని వివరించారు.
అలా వయసుతో సంబంధం లేకుండా ఎప్పటికీ ఒకేలా అనిపించే గొంతుల గురించి చెబుతూ.. మన పరిశ్రమలో వెంకటేశ్ గారు కూడా అలాగే ఉంటారని త్రివిక్రమ్ సరదాగా వ్యాఖ్యానించారు. ఈ విధంగా సాహిత్యంలోని అనుభూతులను, మనుషుల స్వభావాలను ఆయన ఎంతో ఆసక్తికరంగా గుర్తుచేసుకున్నారు.
త్రివిక్రమ్ అద్భుతమైన కథకుడు ఎందుకు అయ్యారో ఆయన తాజా స్పీచ్ ని బట్టి అర్థం చేసుకోవచ్చు. విక్టరీ వెంకటేష్ గురించి మాట్లాడుతూ, ఆయన ఏకంగా యండమూరి నవలల నుంచి అద్భుతమైన ఉదాహరణను తీసుకుని వివరించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది.