ఒకరికి హీరో రెడీ.. ఇంకొకరికి కథ రెడీ
ఒకే సమయంలో ఇద్దరు దర్శకులు చెప్పిన రెండు మాటలు భలే కుదిరాయి. త్రివిక్రమ్‌కు సూర్యతో సినిమా చేయాలని ఉంది.
ఒకే సమయంలో ఇద్దరు దర్శకులు చెప్పిన రెండు మాటలు భలే కుదిరాయి. త్రివిక్రమ్‌కు సూర్యతో సినిమా చేయాలని ఉంది. కానీ ఇప్పటివరకు ఆయనకు కథ నరేట్ చేయలేదు. మరోవైపు వెంకీ అట్లూరి దగ్గర చిరంజీవి కోసం ఓ థ్రిల్లర్ ఐడియా ఉంది. కానీ ఆ కథ తీసుకుని మెగాస్టార్ దగ్గరకు వెళ్లే విషయంలో ఆయనే వెనక్కి తగ్గుతున్నాడు. ఒకరి దగ్గర హీరో రెడీ.. కథ ఇంకా రావాలి. ఇంకొకరి దగ్గర కథ రెడీ.. హీరో దగ్గరకు వెళ్లే టైమ్ రావాలి.
‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సక్సెస్ మీట్‌లో త్రివిక్రమ్ ఈ విషయం చెప్పాడు. తన భార్య సౌజన్య సూర్యకు పెద్ద ఫ్యాన్ అని, ఆయనతో సినిమా చేయాలని తనకు ఆర్డర్ కూడా వేసిందని సరదాగా మాట్లాడాడు. తనకు కూడా సూర్యను డైరెక్ట్ చేయాలని ఉందన్నాడు. అయితే ఇప్పటివరకు సరైన కథ నరేట్ చేయలేదని చెప్పేశాడు. భవిష్యత్తులో మాత్రం ఈ కాంబినేషన్ తప్పకుండా కుదురుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశాడు.
వెంకీ అట్లూరి దగ్గర లెక్క పూర్తిగా రివర్స్. చిరంజీవి కోసం తనకు ఒక సబ్జెక్ట్ ఉందని, అది థ్రిల్లర్ అని ఇటీవల చెప్పాడు. అయితే చిన్నప్పటి నుంచి చిరంజీవిని చూస్తూ పెరిగిన తనకు ఆ స్థాయి హీరోతో సినిమా చేయడం చిన్న విషయం కాదన్నది వెంకీ ఆలోచన. అలాంటి ప్రాజెక్ట్ చేయడానికి దర్శకుడిగా తాను ఇంకా ఎదగాలని, పెద్ద బడ్జెట్‌ను కూడా ఒక్కసారిగా కాకుండా క్రమంగా హ్యాండిల్ చేసే స్థాయికి వెళ్లాలని భావిస్తున్నాడు. అందుకే కథ ఉన్నా ఇప్పుడే తొందరపడటం లేదు.
ఇక్కడే ఇద్దరి మధ్య ఆసక్తికరమైన తేడా కనిపిస్తోంది. త్రివిక్రమ్‌కు పెద్ద స్టార్లతో సినిమాలు చేసిన అనుభవం ఉంది. సూర్యతో చేయాలనే కోరిక కూడా ఉంది. అయినా కాంబినేషన్ కోసం కథను ఫిక్స్ చేయడం లేదు. వెంకీకి ‘లక్కీ భాస్కర్’, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’తో మంచి ఫామ్ వచ్చింది. అయినా చిరంజీవి పేరు ఉందని తన దగ్గరున్న కథను వెంటనే పట్టాలెక్కించే ప్రయత్నం చేయడం లేదు.
నిజానికి స్టార్ డైరెక్టర్ కాంబినేషన్ వార్త బయటకు వస్తే ముందు సినిమా ఎప్పుడు మొదలవుతుందనే లెక్కే ఉంటుంది. ఇక్కడ మాత్రం ఇద్దరూ ఆ స్టేజ్‌కు వెళ్లకముందే ఆగిపోయారు. ఈ రెండు సినిమాలు చివరకు జరుగుతాయా లేదా అనేది ఇప్పుడే చెప్పలేం. కానీ ఒకే టైమ్‌లో బయటకొచ్చిన ఈ రెండు మాటలు మాత్రం వర్కౌట్ అయితే బాగుంటుందని ఫ్యాన్స్ కోరిక. మరి ఎప్పటికీ ఈ కాంబో సెట్ అవుతుందో తెలియాలి అంటే మరికొంత కాలం ఆగాల్సిందే.