నేను మొట్టమొదటిగా పెన్ను పెట్టి రాసిన డైలాగ్ ఆయనకే : త్రివిక్ర‌మ్

ఈ గీతావిష్కరణ వేడుక దస్పల్లా హోటల్‌లో అత్యంత వైభవంగా జరిగింది. చిత్ర యూనిట్ సభ్యులంతా ఈ వేదికపై సందడి చేస్తూ ప్రచార కార్యక్రమాలకు గ్రాండ్‌గా శ్రీకారం చుట్టారు.

Update: 2026-09-28 03:59 GMT

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం `ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47 - AK47`. ఈ సినిమాకు సంబంధించిన మొట్టమొదటి గీతం `నారాయణమ్మ` శ్రోతల ముందుకు వచ్చి విశేషమైన స్పందనను రాబట్టుకుంటోంది. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించిన ఈ పాటను ప్రభ - రామ్ మిరియాల ఆలపించగా, సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి ఎంతో ఆకట్టుకునే సాహిత్యాన్ని అందించారు.

ఈ `నారాయణమ్మ` ప్రత్యేక గీతంలో డింపుల్ హయాతి తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్, వైబ్రెంట్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. హ‌యాతీతో పాటు ఈ చిత్రంలో ప్రధాన తారాగణంగా నటిస్తున్న విక్టరీ వెంకటేష్, శ్రీనిధి శెట్టి, నివేదా పేతురాజ్ తదితరులు కలిసి ఈ పాటను మరింత కలర్‌ఫుల్‌గా మార్చారు. ఈ పాటను చూస్తుంటే ఈ సినిమా కుటుంబ ప్రేక్షకులకు ఏ స్థాయి వినోదాన్ని పంచుతుందో ఇట్టే అర్థమవుతోంది.

ఈ గీతావిష్కరణ వేడుక దస్పల్లా హోటల్‌లో అత్యంత వైభవంగా జరిగింది. చిత్ర యూనిట్ సభ్యులంతా ఈ వేదికపై సందడి చేస్తూ ప్రచార కార్యక్రమాలకు గ్రాండ్‌గా శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. పాట షూటింగ్ సమయంలో డింపుల్ అనారోగ్యంతో ఉన్నా ఎంతో ఇష్టపడి, కష్టపడి పనిచేశారని ప్రత్యేకంగా అభినందించారు.

తన సినీ ప్రయాణం ప్రారంభ రోజులను గుర్తుచేసుకుంటూ త్రివిక్రమ్ కొన్ని ఆసక్తికరమైన జ్ఞాపకాలను షేర్ చేసుకున్నారు. అందరిలాగే తనకు కూడా విక్టరీ వెంకటేష్ అంటే ఎంతో అభిమానమని.. తాను ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన రోజుల్లో మొట్టమొదటిసారిగా పెన్ను పట్టి డైలాగ్ రాసింది వెంకటేష్ సినిమా `పవిత్ర బంధం` కోసమేనని వెల్లడించారు. ఆ సమయంలో తనకు వెంకటేష్‌తో ప్రత్యక్ష పరిచయం లేకపోయినా.. ముత్యాల సుబ్బయ్యగారి ద్వారా తన రచన గురించి అత‌డు తెలుసుకున్నారని చెప్పారు. ఆ తర్వాత `నువ్వు నాకు నచ్చావ్` సినిమాతో ఆ ప్రయాణం మరింత బలపడిందని.. వెంకటేష్‌తో ఎంత సాన్నిహిత్యం ఉన్నా ఆయనపై గౌరవంతో కూడిన భయం ఎప్పటికీ ఉంటుందని తెలిపారు.

ఇన్ని దశాబ్దాల కెరీర్ తర్వాత కూడా వెంకటేష్‌ గారిలో సినిమాపై ఉండే తపన ఏమాత్రం తగ్గలేదని.. ఒంట్లో బాగోకపోయినా సరే ఆయన డబ్బింగ్ పనులను పూర్తి చేశారని అంకితభావాన్ని కొనియాడారు. ఇక సంగీత దర్శకుడు తమన్, గీత రచయిత రామజోగయ్య శాస్త్రి తనకు కుటుంబ సభ్యులతో సమానమని.. గత రెండు దశాబ్దాలకు పైగా వీరితో తన అనుబంధం కొనసాగుతోందని చెప్పారు. ఈ అక్టోబర్ 9న సినిమాతో అందరం థియేటర్లలో కలుద్దామని, ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ తప్పకుండా నచ్చుతుందని త్రివిక్ర‌మ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News