త్రివిక్ర‌మ్ స్ఫూర్తితో క్లీన్ కామెడీ.. యువ‌ద‌ర్శ‌కుల ప్ర‌య‌త్నం!

కామెడీ సినిమాల్లో అడల్ట్ కంటెంట్ ఎక్కువవుతున్న తరుణంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారనే ప్రశ్నకు దర్శకుడు చంద్రమోహన్ ఆసక్తికర సమాధానమిచ్చారు.

Update: 2026-08-21 03:50 GMT

తెలుగు సినీ పరిశ్రమలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సృష్టించిన ప్రాసలు, పదునైన సంభాషణల శైలి ఎందరో యంగ్ డైరెక్టర్లకు స్ఫూర్తిగా నిలిచింది. ఇదివరకు వెంకీ అట్లూరి, వెంకీ కుడుముల వంటి దర్శకులు త్రివిక్రమ్ మార్క్ మాటలు.. ఎంటర్‌టైన్‌మెంట్‌తో సక్సెస్ సాధించగా.. ఇప్పుడు అదే బాటలో మరో యువ దర్శకుడు తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అల్లరి నరేష్ హీరోగా `రంభ ఊర్వశి మేనక` చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు చంద్రమోహన్.. త్రివిక్రమ్ మాటల స్ఫూర్తితోనే ఈ చిత్రాన్ని పూర్తిస్థాయి క్లీన్ కామెడీగా మలిచానని వెల్లడించడం ఫిల్మ్ నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఒకప్పుడు జంధ్యాల, బాపు-రమణల హయాంలో తెలుగు తెరపై వికసించిన స్వచ్ఛమైన హాస్యం ఆ తర్వాత కాలంలో కొంతవరకు అడల్ట్ వల్గర్ సంభాషణల వైపు మళ్లింది. 90లు, 2000ల ప్రారంభంలో అలాంటి కామెడీ హ‌వా సాగినా కానీ ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారింది. ప్రస్తుత ప్రేక్షకులు మరింత అప్‌డేట్ అవ్వడమే కాకుండా.. మన సంస్కృతీ సంప్రదాయాల పట్ల అవగాహన పెరగడంతో కుటుంబ సమేతంగా చూడగలిగే ఆరోగ్యకరమైన హాస్యాన్నే కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే త్రివిక్రమ్ శైలిని ఆదర్శంగా తీసుకుని కొత్త తరం దర్శకులు వల్గారిటీకి దూరంగా క్లీన్ కామెడీ బాటను ఎంచుకోవడం ఆహ్వానించదగిన పరిణామం.

కామెడీ సినిమాల్లో అడల్ట్ కంటెంట్ ఎక్కువవుతున్న తరుణంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారనే ప్రశ్నకు దర్శకుడు చంద్రమోహన్ ఆసక్తికర సమాధానమిచ్చారు. వల్గర్ మాటలతో ఆ క్షణానికి నవ్వించవచ్చేమో కానీ.. అది ప్రేక్షకులు త్వరగానే మరచిపోతారని అన్నారు. అదే ఒక మంచి పదంతో.. అర్థవంతమైన మాటతో పుట్టించే నవ్వు ఎప్పటికీ గుర్తుండిపోతుందన్న త్రివిక్రమ్ మాటలే తనకు స్ఫూర్తి అని చెప్పారు. `రంభ ఊర్వశి మేనక`సినిమాలో హాస్యం చాలా నిజాయితీగా, స్వ‌చ్ఛంగా ఉంటుందని.. కుటుంబమంతా కలిసి థియేటర్లలో హాయిగా నవ్వుకునేలా ఈ చిత్రాన్ని మలిచానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఇక `రంభ ఊర్వశి మేనక` సినిమా విషయానికి వస్తే.. ఇదొక వినూత్నమైన ఫిక్షన్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్. స్వర్గంలో ఉండే అప్సరసలైన రంభ, ఊర్వశి, మేనకలు అనుకోకుండా భూమిపైకి రావడం.. ఆ తర్వాత సాధారణ మానవుడైన హీరో (అల్లరి నరేష్) జీవితంలోకి ప్రవేశించాక ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనే ఆసక్తికర పాయింట్‌తో ఈ కథ సాగుతుంది. ఈ చిత్రంలో నరేష్ సరసన ముగ్గురు అందగత్తెలు హీరోయిన్లుగా అలరించనుండగా.. బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, సత్య వంటి ప్రముఖ హాస్య నటులు కీలక పాత్రల్లో నటిస్తూ వినోదాన్ని పండించనున్నారు.

ఈ వినోదాత్మక చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్- హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా-నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్నారు. పాట‌లు, టీజర్‌ సినిమాపై ఆసక్తిని పెంచాయి. సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. సీనియర్ సాంకేతిక నిపుణులు ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేశారు. అల్లరి నరేష్ టైమింగ్‌కు తోడు చంద్రమోహన్ రాసిన చమత్కారమైన సంభాషణలు.. సంగీత దర్శకుడు అందించిన అద్భుత‌ స్వరాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. త్రివిక్రమ్ స్ఫూర్తితో క్లీన్ అండ్ హెల్దీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో రాబోతున్న ఈ `రంభ ఊర్వశి మేనక` చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించి దర్శకుడు చంద్రమోహన్‌ను సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందో లేదో వేచి చూడాలి!

Tags:    

Similar News