త్రిష ఫ్యాన్స్‌కి విందు భోజనం..!

తాజాగా థగ్‌ లైఫ్‌ సినిమా ట్రైలర్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాలోని త్రిష పాత్రను చూసి ఫ్యాన్స్ కూడా సర్‌ప్రైజ్‌ అయ్యారు.;

Update: 2025-05-22 05:40 GMT

సీనియర్‌ హీరోయిన్‌ త్రిష ఇండస్ట్రీలో అడుగు పెట్టి దాదాపుగా పాతిక ఏళ్లు అవుతోంది. ఒక హీరోయిన్ పదేళ్లు స్టార్‌ హీరోయిన్‌గా కొనసాగడమే గొప్ప విషయం. అలాంటిది త్రిష ఏకంగా రెండు దశాబ్దాల పాటు స్టార్‌ హీరోయిన్‌గా సినిమాలు చేస్తూనే వచ్చింది, ఇంకా చేస్తూనే ఉంది. ప్రస్తుతం త్రిష చేతిలో ఉన్న ప్రాజెక్ట్‌లు చాలా పెద్దవి. ఆమె హీరోయిన్‌గా ముందు ముందు చాలా సినిమాలు చేసేందుకు రెడీ అవుతోంది. తమిళనాట మాత్రమే కాకుండా టాలీవుడ్‌లోనూ వరుస సినిమా ఆఫర్లను సొంతం చేసుకుంటున్న త్రిష త్వరలో కమల్‌ హాసన్‌ తో కలిసి నటించిన థగ్‌ లైఫ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది.

తాజాగా థగ్‌ లైఫ్‌ సినిమా ట్రైలర్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాలోని త్రిష పాత్రను చూసి ఫ్యాన్స్ కూడా సర్‌ప్రైజ్‌ అయ్యారు. సాధారణంగా ఇద్దరు పెద్ద హీరోలు ఉన్న సమయంలో హీరోయిన్‌ పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత ఉండదు అంటారు. కానీ థగ్‌ లైఫ్ లో త్రిష పాత్ర చాలా కీలకంగా ఉంటుందని, ఆమె పాత్ర చుట్టూ కథ తిరుగుతుందని ట్రైలర్‌తోనే చెప్పకనే చెప్పారు. అంచనాలు పెంచడం మాత్రమే కాకుండా త్రిష ఫ్యాన్స్‌ లో నమ్మకం కలిగించారు. ఇటీవల త్రిష చేసిన లియో, గోట్‌, ఐడెంటిటీ, విదాముయార్చి, గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ సినిమాల్లోని పాత్రల విషయంలో ఒకింత విమర్శలు ఎదురు అయ్యాయి. కనుక థగ్‌ లైఫ్‌ సినిమాలోని ఆమె పాత్ర విషయంలో మొదటి నుంచి అనుమానాలు ఉన్నాయి.

అన్ని అనుమానాలను పటాపంచలు చేస్తూ త్రిష థగ్‌ లైఫ్‌ లో స్ట్రాంగ్‌ రోల్‌లో కనిపించబోతుంది. 96 సినిమా తర్వాత త్రిష సెకండ్‌ ఇన్నింగ్స్ మొదలు పెట్టి వరుస సినిమాలు చేస్తుంది. ఆ క్రమంలో కొన్ని లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు చేసింది. ఎక్కువ శాతం సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయి. అయినా కూడా త్రిష స్టార్‌డం ఏమాత్రం తగ్గలేదు. అంతే కాకుండా ఆమె సినిమా సినిమాకు పారితోషికం పెంచుతూనే వచ్చింది. అన్ని విధాలుగా త్రిష కెరీర్‌ మంచి జోరు మీద ఉంది. ఇలాంటి సమయంలో మణిరత్నం వంటి పెద్ద దర్శకుడి సినిమాలో ముఖ్య పాత్రలో, అది కూడా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో నటించడం ద్వారా త్రిష కెరీర్ మరో పదేళ్లు కొనసాగే అవకాశాలు ఉన్నాయి.

త్రిష అందంతో పాటు, అభినయం తో అలరించగల సత్తా ఉన్న నటి అనడంలో సందేహం లేదు. అలాంటి నటికి థగ్‌ లైఫ్‌ లో దక్కిన పాత్రతో అభిమానులకు విందు భోజనం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మొన్నటి వరకు శింబుకు జోడీగా త్రిష థగ్‌ లైఫ్‌ లో కనిపించే అవకాశాలు ఉన్నాయని అంతా భావించారు. కానీ కమల్‌ హాసన్‌తో త్రిష సన్నివేశాలు ఉన్నాయి. ఇద్దరి మధ్య లవ్‌ అండ్‌ రొమాంటిక్ సీన్స్ ఉండబోతున్నాయని ట్రైలర్ విడుదల తర్వాత క్లారిటీ వచ్చింది. త్రిష హీరోయిన్‌గా తెలుగులో చిరంజీవితో విశ్వంభర సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా కూడా విడుదలకు సిద్ధం అవుతోంది. థగ్‌ లైఫ్‌, విశ్వంభర సినిమాలతో త్రిష ఈ ఏడాది బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్స్ కొట్టేనా చూడాలి.

Tags:    

Similar News