ఆలస్యంతో రూ.200 కోట్లు నష్టం...?
కేజీఎఫ్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత కన్నడ స్టార్ యశ్ నటించిన 'టాక్సిక్' సినిమా గత ఏడాదిలోనే విడుదల చేయాలని భావించారు.
ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాల ఆలస్యం అనేది చాలా కామన్ అయ్యింది. అయితే చాలా సినిమాలకు ఆలస్యం కలిసి వస్తుంది. స్టార్ హీరోల సినిమాలు ఆలస్యం అయ్యే కొద్ది క్రేజ్ పెరిగి బిజినెస్ పెరగడం మనం చూస్తూ ఉంటాం. కొన్ని సినిమాలు మాత్రం ఆలస్యం కావడంతో బిజినెస్ తగ్గడం మనం చూస్తూ ఉంటాం. రాజమౌళి వంటి దిగ్గజ దర్శకుల దర్శకత్వంలో వచ్చిన సినిమాలకు ఆలస్యం అయినా కొద్ది బజ్ పెరగడం జరుగుతుంది. బడ్జెట్‌తో పాటు బజ్ పెరగడం, తద్వారా నిర్మాతకు అదనపు లాభాలు రావడం చాలా సినిమాలకు జరిగింది. అదే సమయంలో కొన్ని సినిమాలు ఆరంభంలో ఉన్నంత బజ్ విడుదల సమయంలో లేకుండా పోతుంది. అందుకు కారణం విడుదల ఆలస్యం కావడం అనే అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆలస్యం వల్ల యశ్ హీరోగా నటించిన టాక్సిక్ సినిమాకు సైతం నష్టం జరుగుతుందనే టాక్ వినిపిస్తోంది.
కేజీఎఫ్ సినిమాతో...
కేజీఎఫ్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత కన్నడ స్టార్ యశ్ నటించిన 'టాక్సిక్' సినిమా గత ఏడాదిలోనే విడుదల చేయాలని భావించారు. కానీ కొన్ని కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం అయ్యింది. ఒకానొక సమయంలో సినిమా కోసం షూట్ చేసిన చాలా ఫుటేజ్‌ను తొలగించారని, కొత్తగా మళ్లీ షూట్ చేశారనే వార్తలు వచ్చాయి. ఆ విషయమై ఎలాంటి క్లారిటీ లేదు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు మొదట భారీ బజ్ క్రియేట్ అయ్యింది. కేజీఎఫ్ సినిమాతో వచ్చిన క్రేజ్ కారణంగా యశ్ సినిమా అనగానే దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు. పైగా టైటిల్ యూనివర్శిల్ అప్పీల్‌ను కలిగి ఉండటం, ఇంకా యాక్షన్ ఎలిమెంట్స్ పీక్స్‌లో ఉంటాయనే వార్తలు రావడంతో కేజీఎఫ్ కి ఏమాత్రం తగ్గదనే నమ్మకంతో అభిమానులు, అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమాపై అంచనాలు పెంచుకున్న విషయం తెల్సిందే.
టాక్సిక్ ప్రీ రిలీజ్ బిజినెస్...
టాక్సిక్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.500 కోట్ల నుంచి రూ.600 కోట్లు చేస్తుందని అంతా భావించారు. ఇప్పటికే కొన్ని చోట్ల సినిమాను బిజినెస్ చేయడం జరిగింది. అయితే విడుదల ఆలస్యం కావడంతో బిజినెస్ డీల్స్ క్యాన్సల్ అయ్యాయనే వార్తలు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఏ కన్నడ మూవీకి కానంత బిజినెస్ జరుగుతుందని అంతా భావించారు. కానీ ఆలస్యం అయ్యే కొద్ది సినిమా బజ్ తగ్గుతుంది, దాంతో బిజినెస్ కూడా తగ్గుతుందని స్వయంగా కన్నడ సినీ విశ్లేషకులు, ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. టాక్సిక్ సినిమాతో నిర్మాతలకు భారీ లాభాలు వస్తాయని మొన్నటి వరకు విశ్లేషణలు వినిపించాయి. కానీ ఇప్పుడు కన్నడ సినీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం పెట్టిన పెట్టుబడి మొత్తం అయినా తిరిగి వచ్చేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సినిమా సూపర్ హిట్ అయినా కూడా తగ్గిన బజ్ కారణంగా ఓపెనింగ్స్ తగ్గే అవకాశం ఉందని అంటున్నారు.
కన్నడ సినిమా కలెక్షన్స్...
కన్నడ సినీ విశ్లేషకుల అంచనా ప్రకారం టాక్సిక్ సినిమా ఆలస్యం కారణంగా బిజినెస్, వసూళ్ల పరంగా దాదాపుగా రూ.200 కోట్ల నష్టంను చూడబోతుందని అంటున్నారు. సినిమా ఫలితం పాజిటివ్‌గా వస్తే ఈ మొత్తంకు కాస్త అటు ఇటుగా నష్టం ఉంటుందని, అదే సినిమా నెగటివ్ టాక్‌ను సొంతం చేసుకుంటే ఆ తేడా మరింత భారీగా ఉండే అవకాశం ఉంది. సినిమాకు బజ్ ఉన్న సమయంలో విడుదల అయితే ఫలితంతో సంబంధం లేకుండా భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ బజ్ తగ్గిన సమయంలో సినిమాను విడుదల చేస్తే కచ్చితంగా ఓపెనింగ్ చాలా తేడాగా వస్తాయని అంటున్నారు. జూన్‌లో సైతం సినిమా విడుదల ఉండక పోవచ్చు అనే వార్తలు వస్తున్నాయి. దాంతో బజ్ మరింత తగ్గుతుంది. విడుదల సమయంలో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప మళ్లీ ఫుల్ బజ్ వచ్చే అవకాశం కనిపించడం లేదని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. మొత్తానికి కన్నడ ఇండస్ట్రీలోనే రికార్డ్ ఓపెనింగ్స్ సాధిస్తుందని అంతా భావిస్తున్న సమయంలో టాక్సిక్ ఇలా బజ్ తగ్గడంతో భారీగా వసూళ్లు తగ్గే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.