స్టార్ హీరోకి సొంత త‌మ్ముడిలా న‌యా డైరెక్ట‌ర్!

ఇటీవల ఓ ఈవెంట్ లో అట్లీ ..షారుఖ్ ఖాన్‌తో `జవాన్` ప్రాజెక్ట్‌ను దక్కించుకున్నప్పుడు విజయ్ ఎలా స్పందించారో గుర్తు చేసుకున్నారు.

Update: 2026-09-19 10:21 GMT

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ- దళపతి విజయ్‌ల మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. `తేరి`, `మెర్సల్`, `బిగిల్` వంటి హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్ చిత్రాల తర్వాత అట్లీ బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌తో `జవాన్` వంటి పాన్-ఇండియా సంచలనాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఓ ఈవెంట్ లో అట్లీ ..షారుఖ్ ఖాన్‌తో `జవాన్` ప్రాజెక్ట్‌ను దక్కించుకున్నప్పుడు విజయ్ ఎలా స్పందించారో గుర్తు చేసుకున్నారు.

తనకు షారుఖ్ ఖాన్‌తో సినిమా చేసే అవకాశం వచ్చిందని చెప్పగానే విజయ్ ఎంతగానో సంతోషపడ్డార‌న్నారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆలోచించకుండా ప్రాజెక్ట్‌ను వెంటనే ఒప్పుకోవాలని అట్లీకి సూచించారు విజ‌య్. సొంత తమ్ముడు జాతీయ స్థాయిలో ఎదుగుతుంటే ఒక అన్నయ్య ఎలా ఆనందిస్తారో? విజయ్ కూడా అలాగే ఎంతో గర్వంగా భావించారని అట్లీ క‌న్నీటి ప‌ర్యంతం అయ్యారు.

బాలీవుడ్‌లో అడుగుపెడుతున్న సమయంలో విజయ్ ఇచ్చిన ప్రోత్సాహం తనలో కొండంత ఆత్మవిశ్వాసాన్ని నింపిందని అట్లీ తెలిపారు. `నువ్వు ఖచ్చితంగా బాలీవుడ్‌లో జెండా పాతుతావు. నీ టాలెంట్‌పై నాకు పూర్తి నమ్మకం ఉంది. వెళ్ళి నీ శైలిలో సినిమా తీయ్` అని విజయ్ ధైర్యం చెప్పినట్లు అట్లీ గుర్తు చేసుకున్నారు. జ‌వాన్ చిత్రీకరణ సమయంలో కూడా విజయ్ ఫోన్ చేసే ప్రాజెక్ట్ వివరాలను అడిగి తెలుసుకునేవారన్నారు.

`జ‌వాన్` విష‌యంలో విజయ్ న‌మ్మ‌కం నిల‌బ‌డింది. `జవాన్` చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్లకు పైగా వసూలు చేసి భారతీయ చలనచిత్ర చరిత్రలోనే సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ విజయం తర్వాత విజయ్ తనకు ప్రత్యేకంగా ఫోన్ చేసి అభినందించారని.. తన విజయాన్ని తన సొంత విజయంగా వేడుక చేసుకున్నారని అట్లీ ఆనందం వ్యక్తం చేశారు. తమ మధ్య ఉన్నది దర్శకుడు-హీరో సంబంధం మాత్రమే కాదని..ఒకే కుటుంబ సభ్యుల మధ్య ఉండే ప్రేమానురాగాలున్నాయ‌న్నారు.

ఈ సందర్భంగా విజయ్ నాయకత్వ లక్షణాలు అట్లీ ప్ర‌స్తావించారు. విజయ్ ఎక్కడున్నా? ఏ రంగంలో ఉన్నా? రియల్ లీడర్‌లా నిలుస్తారని కొనియాడారు. రాజకీయ ప్రవేశం చేసి ప్రజలకు సేవ చేస్తున్న తరుణంలో కూడా విజయ్ తన చుట్టూ ఉన్నవారిని, పాత సాంకేతిక నిపుణులను ప్రోత్సహించడం ఎప్పటికీ మారలేదని అట్లీ ప్రశంసించారు. దీంతో విజ‌య్ అభిమానులు సంతోషంలో ఉబ్బిత‌బ్బితున్నారు. విజయ్ దార్శనికత, ఇతరుల ఎదుగుదలను ఆకాంక్షించే ఉన్నతమైన మనస్తత్వం పట్ల నెటిజన్లు, అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రాంతీయ దర్శకుడు పాన్-ఇండియా స్థాయిలో దిగ్గజ దర్శకుడిగా మారడంలో విజయ్ అందించిన మద్దతు తోటి హీరోల‌కు ఆదర్శంగా నిలుస్తోంది.

Tags:    

Similar News