‘ప్యారడైజ్’ తర్వాత.. ఇంత రద్దీ ఎందుకు?
సెప్టెంబర్ 24న నాని ‘ది ప్యారడైజ్’ వస్తోంది. సాధారణంగా ఇలాంటి పెద్ద సినిమా వచ్చిన తర్వాత కనీసం రెండు వారాలు గ్యాప్ చూసుకుని మిగతా సినిమాలు డేట్లు పెట్టుకుంటాయి.
సెప్టెంబర్ 24న నాని ‘ది ప్యారడైజ్’ వస్తోంది. సాధారణంగా ఇలాంటి పెద్ద సినిమా వచ్చిన తర్వాత కనీసం రెండు వారాలు గ్యాప్ చూసుకుని మిగతా సినిమాలు డేట్లు పెట్టుకుంటాయి. కానీ ఈసారి అలా జరగడం లేదు. కేవలం ఎనిమిది రోజుల తర్వాతే అక్టోబర్ 2కు మరో బ్యాచ్ థియేటర్లలోకి దిగుతోంది. ఒకటి రెండు సినిమాలు కాదు.. వేర్వేరు జానర్లలో నాలుగు ఐదు సినిమాలు అదే తేదీ చుట్టూ ఉన్నాయి.
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’, వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’, సందీప్ కిషన్ ‘సిగ్మా’ అక్టోబర్ 2ను ఫిక్స్ చేసుకున్నాయి. ‘తెల్ల కాగితం’, ‘బా బా బ్లాక్ షీప్’ కూడా అదే విండోలో ఉన్నట్లు టాక్ ఉంది. వీటిలో ప్రతి సినిమాకీ టార్గెట్ ఆడియన్స్ వేరే. వెంకటేష్ సినిమా ఫ్యామిలీ వైపు వెళ్తే, ‘సిగ్మా’ యాక్షన్ హీస్ట్ ఎంటర్‌టైనర్‌గా వస్తోంది. ఫహాద్ ఫాసిల్ సినిమా కూడా తనకంటూ వేరే స్పేస్ తీసుకుంటుంది.
ఈ తేదీకి ఇంత మంది రావడానికి ఒక కారణం గాంధీ జయంతి శుక్రవారం రావడం. ఆ రోజు సెలవు, వెంటనే శని, ఆదివారం రావడంతో మొదటి మూడు రోజులు బలంగా ఉపయోగించుకోవచ్చు. చిన్న, మిడ్ రేంజ్ సినిమాలకు ఇలాంటి వీకెండ్ చాలా ఉపయోగపడుతుంది. మొదటి రోజు టాక్ బాగుంటే శనివారం నుంచే షోలు పెంచుకునే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఒకే రోజు సినిమాలు ఎక్కువైనా ఈ తేదీని వదులుకోవాలని ఎవరూ అనుకోవడం లేదు.
అక్టోబర్ మిడ్ నుంచి పరిస్థితి పూర్తిగా మారిపోవడం కూడా మరో రీజన్. అక్టోబర్ 15న రజనీకాంత్ ‘జైలర్ 2’, 16న విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ఉన్నాయి. ఈ రెండు సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగా రిలీజ్ అవుతాయి. వాటి తర్వాత థియేటర్లు, షోలు దొరకడం చిన్న సినిమాలకు కష్టమవుతుంది. అందుకే వాటి ముందు ఉన్న రెండు వారాల విండోను ఎక్కువ మంది ఉపయోగించుకోవాలని చూస్తున్నారు.
అయితే అక్టోబర్ 2న వచ్చే సినిమాలకు ‘ప్యారడైజ్’ నుంచి ఎఫెక్ట్ ఉండవచ్చు. నాని సినిమా మంచి టాక్‌తో మొదటి వారం బలంగా నడిస్తే, రెండో వారంలో కూడా మెయిన్ థియేటర్లను వదులుకోదు. అప్పుడు కొత్త సినిమాలు తమ మధ్యే కాకుండా ఇప్పటికే నడుస్తున్న పెద్ద సినిమాతో కూడా స్క్రీన్స్ పంచుకోవాల్సి ఉంటుంది. ‘ఆదర్శ కుటుంబం’లాంటి పెద్ద రిలీజ్‌కు ఇబ్బంది తక్కువగా ఉండొచ్చు. మిగతా సినిమాలకు మొదటి రోజు నుంచే షో కౌంట్ చాలా ముఖ్యం.
అసలు స్క్రీన్ పరిస్థితి సెప్టెంబర్ 27, 28 తర్వాతే బాగా తెలుస్తుంది. అప్పటికి ‘ప్యారడైజ్’ మొదటి వీకెండ్ పూర్తవుతుంది. ఏ సెంటర్లలో సినిమా బలంగా ఉంది, ఎక్కడ షోలు తగ్గించొచ్చు అన్నదాని మీద అక్టోబర్ 2 సినిమాలకు థియేటర్లు ఫైనల్ అవుతాయి. అందుకే పోస్టర్లపై అందరికీ ఒకే రిలీజ్ డేట్ ఉన్నా, ఎవరికెన్ని షోలు దక్కుతాయన్న పోటీ మాత్రం రిలీజ్‌కు నాలుగు ఐదు రోజుల ముందు మొదలవుతుంది. మరి ఈ క్లాష్ లో ఎవరు క్లిక్ అవుతారో చూడాలి.