రూరల్ బ్యాక్‌డ్రాప్ మీద పడ్డ టాలీవుడ్ హీరోలు!

టాలీవుడ్ హీరోలందరూ ఇప్పుడు 'రూరల్ బ్యాక్‌డ్రాప్' లో సినిమాలు చేస్తున్నారు. రా అండ్ రస్టిక్ స్టోరీలను తెర మీదకి తీసుకురావడానికి ఆసక్తి కనబరుస్తున్నారు

Update: 2024-05-09 03:53 GMT

టాలీవుడ్ హీరోలందరూ ఇప్పుడు 'రూరల్ బ్యాక్‌డ్రాప్' లో సినిమాలు చేస్తున్నారు. రా అండ్ రస్టిక్ స్టోరీలను తెర మీదకి తీసుకురావడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. వీటి కోసం అవసరమైతే పూర్తిగా మేకోవర్ అవుతున్నారు.. ఇంతకముందెన్నడూ చూడని విధంగా రగ్గుడ్ లుక్ లోకి మారిపోతున్నారు. రూరల్ బ్యాక్‌డ్రాప్ చిత్రాలు కాసుల వర్షం కురిపిస్తుండటంతో.. దర్శక రచయితలు సైతం మన రూట్స్ ను గుర్తు చేసే పల్లెటూళ్లకు సంబంధించిన కథలను, బలమైన కంటెంట్‌తో ముడిపడిన గ్రామీణ కథాంశాలను రాసుకుంటున్నారు.

* విశ్వక్ సేన్ - 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి''. కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. నేహా శెట్టి, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. టైటిల్ కు తగ్గట్టుగానే గోదావరి జిల్లాల నేపథ్యంలో సాగే చిత్రమిది. చీకటి ప్రపంచంలో సామాన్యుడి స్థాయి నుంచి అసామాన్యుడిగా ఎదిగిన ఓ వ్యక్తి కథని రా అండ్ రస్టిక్ గా చూపించబోతున్నారు. ఇందులో లంకల రత్న అనే పవర్ ఫుల్ రోల్ లో విశ్వక్ కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఊర మాస్ లుక్ లో విశ్వక్ ఆకట్టుకున్నారు. ఈ సినిమా మే 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read more!

* విజయ్ దేవరకొండ - 'SVC 59'

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఇటీవల దిల్ రాజు బ్యానర్ లో లార్జర్ దెన్ లైఫ్ 'రూరల్ యాక్షన్ డ్రామా'ని అనౌన్స్ చేసారు. ఇందులో పొలిటికల్ టచ్ కూడా ఉంటుంది. దీనికి రవి కిరణ్ కోలా దర్శకత్వం వహించనున్నారు. ఇదే క్రమంలో వీడీ పుట్టినరోజు సందర్భంగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నుంచి ఓ చిత్రానికి ప్రకటన వచ్చింది. ఇది 18వ శతాబ్దంలో సెట్ చేయబడిన 'పీరియాడిక్ యాక్షన్ డ్రామా'. రాహుల్‌ సంకృత్యాన్‌ ఈ సినిమాని డైరెక్ట్ చేయనున్నారు. ఈ రెండూ విజయ్ ఇంతకముందు చెయ్యని జోనర్ సినిమాలు. వీటిల్లో యువ హీరో డిఫెరెంట్ లుక్స్ లో కనిపించనున్నారు.

* రామ్ చరణ్ - 'RC 16'

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్ లో 'RC 16' అనే వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా రూపొందుతోంది. ఇది రూర‌ల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే రా అండ్ ర‌స్టిక్ ఎమోషనల్ స్పోర్ట్స్‌ డ్రామా. ఇందులో చెర్రీ ఒక ఉత్త‌రాంధ్ర కుర్రాడిగా రగ్గుడ్ లుక్ లో కనిపించబోతున్నారు. అతని స్లాంగ్ కూడా కొత్తగా ఉండబోతోంది. గతంలో సుకుమార్ దర్శకత్వంలో చరణ్ నటించిన 'రంగస్థలం' సినిమా కూడా పల్లెటూరి నేపథ్యంనే సాగుతుంది. ఇది బాక్సాఫీస్ దగ్గర 200 కోట్లకుపైగా గ్రాస్ వసూలు చేసి, ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. మళ్ళీ ఇన్నాళ్లకు గ్రామీణ కథలో రామ్ చరణ్ నటించబోతున్నారు.

4

* ఎన్టీఆర్ - 'దేవర'

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివతో ''దేవర'' సినిమా చేస్తున్నారు. ఇది కోస్టల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్. రెండు భాగాలుగా తీస్తున్న ఈ సినిమాలో తండ్రీ కొడుకులుగా డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నారు తారక్. ఈ సినిమా కథంతా సముద్ర తీర ప్రాంతంలోని గ్రామాల్లో జరుగుతుంది. దీంట్లో హీరో విలన్ ల మధ్య మట్టి కుస్తీ పోటీ కీలకంగా ఉంటుందట. ఎన్టీఆర్ మాస్ పాత్రలో నటిస్తుండగా.. హీరోయిన్ జాన్వీ కపూర్ గ్రామీణ యువతిగా కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, గ్లిమ్ప్స్ ఆకట్టుకున్నాయి. ఈ చిత్రాన్ని అక్టోబర్ 10న థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

* అల్లు అర్జున్ - 'పుష్ప 2'

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న రూరల్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ డ్రామా ''పుష్ప: ది రూల్''. ఇది 'పుష్ప: ది రైజ్' కు సీక్వెల్. శేషాచలం అడవుల్లో గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో పుష్పరాజ్ అనే ఊర మాస్ పాత్రలో బన్నీ నటించారు. రా అండ్ రస్టిక్ లుక్ లో ఆకట్టుకున్నారు. శ్రీవల్లి అనే డీ గ్లామర్ విలేజ్ గర్ల్ పాత్రలో హీరోయిన్ రష్మిక మందన్న అలరించింది. 'పుష్ప 2' చిత్రం ఆగస్టు 15న పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున విడుదల కాబోతోంది.

* ప్రభాస్ - 'రాజా సాబ్'

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో 'రాజా సాబ్' అనే సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇదొక రూరల్ రొమాంటిక్ హారర్ కామెడీ అనే టాక్ ఉంది. దీనికి తగ్గట్టుగానే ఆల్రెడీ రిలీజైన టైటిల్ అనౌన్సమెంట్ పోస్టర్ లో ప్రభాస్ లుంగీ కట్టుకొని పల్లెటూరి యువకుడిగా కనిపించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో రూపొందే ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది.

* వెంకటేశ్ - 'VenkyAnil3'

విక్టరీ వెంకటేష్ - డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో 'VenkyAnil3' అనే వర్కింగ్ టైటిల్ తో ఉగాది పండక్కి ఓ సినిమా ప్రకటించబడింది. ఇది వీరిద్దరి కలయికలో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ట్రయాంగిల్ క్రైమ్ ఎంటర్టైనర్ గా రూపొందుతోందని టాక్. 2025 సంక్రాంతిని టార్గెట్ గా పెట్టుకున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు.

* నాగచైతన్య - 'తండేల్'

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య, డైరెక్టర్ చందూ మొండేటి కాంబోలో రానున్న సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ ''తండేల్''. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా తీర ప్రాంత గ్రామాల్లోని మత్స్యకారుల జీవితం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఇందులో బోట్ నడిపే తండేల్ పాత్రలో రా అండ్ రగ్గుడ్ లుక్ లో చైతన్య కనిపించనున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని దసరా బరిలో నిలపాలని మేకర్స్ భావిస్తున్నారు.

Tags:    

Similar News