టాలీవుడ్ డైరెక్టర్స్ - బాలీవుడ్ డ్రీమ్స్!

నార్త్ బాక్సాఫీస్ ను షేక్ చెయ్యడానికి క్రేజీ కాంబినేషన్లు సెట్ చేసుకుంటున్నారు. ఆ డైరెక్టర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.

Update: 2024-05-07 00:30 GMT

'పాన్ ఇండియా' ట్రెండ్ మొదలైన తర్వాత భాషా ప్రాంతీయత అడ్డంకులు తొలగిపోయాయి అని చెప్పాలి. టాలీవుడ్ స్టార్స్ హిందీలో సినిమాలు చేస్తుంటే, బాలీవుడ్ ఫిలిం మేకర్స్ మన తెలుగు హీరోలతో మూవీస్ తీస్తున్నారు. ఈ క్రమంలో కొందరు దర్శకులు నేరుగా హిందీ చిత్ర పరిశ్రమలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యారు. నార్త్ బాక్సాఫీస్ ను షేక్ చెయ్యడానికి క్రేజీ కాంబినేషన్లు సెట్ చేసుకుంటున్నారు. ఆ డైరెక్టర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.

 

మాస్ యాక్షన్ సినిమాతో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న గోపీచంద్ మలినేని.. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తో మంచి ఫార్మ్ లో ఉన్నారు. 'క్రాక్', 'వీర సింహా రెడ్డి' చిత్రాల తర్వాత రవితేజ హీరోగా RT4GM అనే వర్కింగ్ టైటిల్ తో ఓ మూవీ అనౌన్స్ చేశారు. అయితే పలు కారణాలతో ఈ ప్రాజెక్ట్ ను హోల్డ్ లో పెట్టి, బాలీవుడ్ లో అడుగుపెట్టడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. సీనియర్‌ హీరో సన్నీ డియోల్ తో ఓ భారీ యాక్షన్ డ్రామా తెరకెక్కించనున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నారు.

Read more!

 

కెరీర్ స్టార్టింగ్ నుంచీ వైవిధ్యమైన సినిమాలే చేస్తూ వస్తున్న టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. ఏడాది ప్రారంభంలో 'హను-మాన్' వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ప్రస్తుతం తన సినిమాటిక్ యూనివర్స్ లో విభిన్నమైన చిత్రాలు రూపొందించే పనిలో ఉన్నారు. ఇందులో భాగంగా బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌ వీర్‌ సింగ్‌ తో ఓ పీరియాడిక్ యాక్షన్ డ్రామా తీయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుందని అంటున్నారు. దీనికి 'రాక్షస్' అనే టైటిల్ కూడా ప్రచారంలో వుంది.

 

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన వంశీ పైడిపల్లి 'మహర్షి' మూవీతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. గతేడాది సంక్రాంతికి తమిళ్ లో 'వారసుడు' సినిమా తీసి హిట్టు కొట్టాడు. అయితే ఈ మూవీ వచ్చి ఏడాదిన్నర కాబోతున్న దర్శకుడు ఇంత వరకూ తన నెస్ట్ ప్రాజెక్ట్ ను ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో వంశీ ఇప్పుడు బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చే ప్రయత్నాల్లో ఉన్నారని, షాహిద్ కపూర్‌ తో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. గోల్డ్‌ మైన్‌ సంస్థ నిర్మించనున్న ఈ సినిమాలో అగ్ర నిర్మాత దిల్ రాజు కూడా భాగం అవుతారని వార్తలు వస్తున్నాయి.

4

 

హృదయ కాలేయం, కొబ్బరి మట్ట లాంటి స్పూఫ్ కామెడీ సినిమాలతో అలరించిన డైరెక్టర్ నీలం సాయి రాజేశ్. 'కలర్ ఫొటో' అనే చిత్రాన్ని నిర్మించి నేషనల్ ఫిలిం అవార్డ్ అందుకున్నాడు. గతేడాది 'బేబి' చిత్రానికి దర్శకత్వం వహించి కల్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు. ఇప్పుడు ఈ సినిమా హిందీ రీమేక్ ద్వారా బాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. ఎస్‌కేఎన్‌ నిర్మించే ఈ మూవీతో ఓ స్టార్ కిడ్ హీరోగా తెరంగేట్రం చేస్తారని సమాచారం.

టాలీవుడ్ స్టార్స్ డేట్స్ దొరక్క కొందరు, హిందీ ఇండస్ట్రీలో అదృష్టం పరీక్షించుకునేందుకు మరికొందరు.. ఇలా బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేయటానికి ఆసక్తి కనబరుస్తున్నారు. నిజానికి ఇదేమీ కొత్త ట్రెండ్ కాదు. గతంలో చాలామంది తెలుగు దర్శకులు హిందీలోకి వెళ్ళారు. రామ్ గోపాల్ వర్మ దగ్గర నుంచి పూరీ జగన్నాథ్ వరకూ పలువురు డైరెక్టర్స్ నార్త్ లోనూ మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. కాకపోతే ఇటీవల కాలంలో 'టాలీవుడ్ డైరెక్టర్ - బాలీవుడ్ హీరో' కాంబినేషన్లు ఎక్కువయ్యాయి.

 

'అర్జున్‌ రెడ్డి' దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా అదే చిత్రాన్ని షాహిద్‌ కపూర్‌ తో 'కబీర్‌ సింగ్‌' పేరుతో రీమేక్ చేసి హిట్టు కొట్టారు. రణ్‌ బీర్‌ కపూర్‌ తో 'యానిమల్‌' వంటి హిందీ సినిమా తీసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. దీంతో బాలీవుడ్ లో క్రేజీ డైరెక్టర్ గా మారిపోయిన సందీప్.. 'స్పిరిట్' తర్వాత 'యానిమల్ పార్క్' మూవీని తెరకెక్కించనున్నారు. అయితే షాహిద్ కపూర్ హీరోగా 'జెర్సీ' ని హిందీలో రీమేక్‌ చేసిన గౌతమ్‌ తిన్ననూరికి మాత్రం నిరాశే ఎదురైంది.

 

అలానే 'హిట్‌' హిందీ రీమేక్‌ తో బాలీవుడ్ లో అడుగుపెట్టిన డైరెక్టర్ శైలేష్‌ కొలనుకు చేదు అనుభవమే మిగిలింది. ఎస్.ఎస్ రాజమౌళి తీసిన 'ఛత్రపతి' చిత్రాన్ని రీమేక్ చేసిన వి.వి.వినాయక్‌ కు భంగపాటే ఎదురైంది. విద్యుత్ జమ్వాల్ తో IB 71 అనే మూవీ తెరకెక్కించిన సంకల్ప్ రెడ్డికి బాక్సాఫీస్ సక్సెస్ దక్కలేదు. ఇలా పలువురు దర్శకులకు హిందీ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ ఎంట్రీ దొరకలేదు. మరి ఇప్పుడు బాలీవుడ్ లో తొలి అడుగులు వేయడానికి ప్రయత్నాలు చేస్తున్న డైరెక్టర్స్ కు ఎలాంటి ఫలితాలు దక్కుతాయో వేచి చూడాలి.

Tags:    

Similar News