యువ హీరోల మాటలు కోటలు దాటడం లేదే!
కొంతకాలంగా టాలీవుడ్‌లో యువ హీరోల ప్రవర్తనలో ఓ ఆసక్తికరమైన మార్పు కనిపిస్తోంది.
కొంతకాలంగా టాలీవుడ్‌లో యువ హీరోల ప్రవర్తనలో ఓ ఆసక్తికరమైన మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు సినిమా రిలీజ్ అంటే చాలు మీడియా మీట్ లో హీరోలు చేసే హడావిడి, ప్రగల్భాలు పలకడం సహజంగా ఉండేవి. `ఈ సినిమా రికార్డులు తిరగరాస్తుంది . ఇది మరో బ్లాక్‌బస్టర్` అంటూ భారీ ప్రకటనలు చేసేవారు. కానీ ఇప్పుడు ఆ ధోరణి దాదాపుగా కనుమరుగైంది. యువ హీరోలు మాటలను చాలా బ్యాలెన్స్‌డ్ గా మార్చుకుంటున్నారు.
గతంలో రిలీజ్ కు ముందు హీరోలు తమ సినిమాల గురించి అతిగా మాట్లాడటం వల్ల, ప్రేక్షకులలో అంచనాలు పెరిగిపోవడం, ఆపై సినిమా ఆ స్థాయిని అందుకోలేక నిరుత్సాహప పడటం తరచుగా జరిగేది. దీనిని గమనించిన ప్రస్తుత తరం హీరోలు ఆచితూచి మాట్లాడుతున్నారు. అతి విశ్వాసాన్ని ప్రదర్శించడం కంటే వాస్తవికతకు దగ్గరగా ఉండటానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. మాటల కంటే పనిలోనే ఎక్కువ నమ్మకాన్ని ఉంచుతున్నారు.
ప్రస్తుతం హీరోలు అనుసరిస్తున్న కొత్త వ్యూహం ఏంటంటే? సినిమాపై తమకు ఉన్న నమ్మకాన్ని క్లుప్తంగా చెబుతున్నారు. తుది నిర్ణయాన్ని పూర్తిగా ప్రేక్షకులకే వదిలేస్తున్నారు. `మేము మా వంతు కృషి చేశాం. సినిమా ఎలా ఉందో ప్రేక్షకులే నిర్ణయించాలి` అని బహిరంగంగా సర్వసాధారణమైంది. ఈ బాధ్యతాయుతమైన వైఖరి ప్రేక్షకు లపై మంచి ప్రభావాన్ని చూపుతోంది. అనవసరమైన అంచనాల భారం లేకుండా సినిమాను చూసే వాతావరణం ఏర్పడుతోంది.
`సినిమాలో కంటెంట్ మాత్రమే మాట్లాడాలి` అన్నది ఇప్పుడు టాలీవుడ్‌లో కొత్త మంత్రంగా మారింది. మేకింగ్ క్వాలిటీ, కథా బలం, ఎమోషనల్ కనెక్ట్ ఉంటే, ప్రత్యేకంగా ప్రమోషన్ల కోసం ఊదరగొట్టాల్సిన అవసరం లేదని హీరోలు బలంగా నమ్ముతున్నారు. కథ బలహీనంగా ఉంటే ఎన్ని మాటలు చెప్పినా? బాక్సాఫీస్ వద్ద సినిమా నిలబడదని యువ హీరోలు గ్రహించారు. కంటెంట్ మీద ఉన్న నమ్మకమే వారిని ఇంత నిలకడగా మాట్లాడుకునేలా చేస్తోంది.
ఈ మార్పు వెనుక ఉన్న మరో ముఖ్య కారణం సోషల్ మీడియా ప్రభావం. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా విశ్లేషించే నెటిజన్లు, హీరోలు పలికే ప్రగల్భాలను ఎప్పటికప్పుడు ట్రోల్ చేస్తున్నారు. దీంతో అనవసరమైన మాటల వల్ల ఇమేజ్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉందని తెలుసుకున్న హీరోలు అప్రమత్తమయ్యారు. వివాదాలకు తావు లేకుండా సినిమాను మాత్రమే ప్రమోట్ చేసుకుంటూ గౌరవప్రదంగా ఉండటానికే ప్రయత్నిస్తున్నారు.
మొత్తానికి టాలీవుడ్ యువ హీరోల పరిణతి చెందిన ఆలోచనా విధానం పరిశ్రమకు ఆరోగ్యకరమైన సంకేతం. బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించడానికి మాటల కోటలు కాకుండా కంటెంట్ మాత్రమే అసలైన ఆయుధమని గుర్తించడం అభినందనీయం. ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా ప్రవర్తనను మార్చుకుంటున్న ఈ తరం హీరోల నిర్ణయం తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచుతుందనడంలో సందేహం లేదు.