టాలీవుడ్‌లో 'సిండికేట్ వ్యవస్థ' చిన్న నిర్మాతల మనుగడకు శాపమా?
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం నడుస్తున్న అంతర్గత వివాదాలను, థియేటర్ల ఆదాయ పంపిణీ సంక్షోభాన్ని లోతుగా విశ్లేషిస్తే దీని వెనుక ఒక బలమైన వ్యవస్థాగత లోపం స్పష్టంగా కనిపిస్తుంది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం నడుస్తున్న అంతర్గత వివాదాలను, థియేటర్ల ఆదాయ పంపిణీ సంక్షోభాన్ని లోతుగా విశ్లేషిస్తే దీని వెనుక ఒక బలమైన వ్యవస్థాగత లోపం స్పష్టంగా కనిపిస్తుంది. అదే `వర్టికల్ ఇంటిగ్రేషన్`. అంటే.. సినిమా నిర్మాణ రంగంలో కీలకమైన ప్రొడక్షన్, పంపిణీ వ్యవస్థ, ఎగ్జిబిషన్ లేదా థియేటర్ల యాజమాన్యం .. ఇవన్నీ ఒకే కార్పొరేట్ సంస్థ లేదా కొద్దిమంది ప్రభావవంతమైన సినీ పెద్దల నియంత్రణలోనే కేంద్రీకృతమై ఉండటం. ఈ తరహా ఏకఛత్రాధిపత్యం పరిశ్రమలోని ఆరోగ్యకరమైన పోటీని ఏ విధంగా దెబ్బతీస్తుందో అంతర్జాతీయ సినిమా చరిత్రను పరిశీలిస్తే సులభంగా అర్థమవుతుంది.
గత శతాబ్దపు తొలినాళ్లలో హాలీవుడ్‌లో సైతం ఇటువంటి గుత్తాధిపత్య సంస్కృతే నడిచేదని హిస్టరీ చెబుతోంది. పారామౌంట్ పిక్చర్స్ వంటి అగ్ర నిర్మాణ సంస్థలు అటు సినిమాలను నిర్మిస్తూ.. ఇటు దేశవ్యాప్తంగా ఉన్న కీలకమైన థియేటర్లను తమ స్వాధీనంలో ఉంచుకునేవి. దీనివల్ల స్వతంత్రంగా సినిమాలు తీసే చిన్న ఫిలింమేకర్స్‌కు థియేటర్లు దొరకకుండా పోయాయి. ఈ అన్యాయమైన మార్కెట్ ధోరణిపై అమెరికా సుప్రీంకోర్టు 1948లో ఒక చారిత్రాత్మక తీర్పును ఇచ్చింది. దాన్నే `పారామౌంట్ డిక్రీ` అంటారు. ఈ చట్టం ప్రకారం.. సినిమాలు నిర్మించే స్టూడియోలు ఏవీ కూడా థియేటర్ల యాజమాన్యాన్ని కలిగి ఉండకూడదు. నిర్మాణాన్ని, ప్రదర్శనను చట్టబద్ధంగా వేరు చేయడం ద్వారా చిన్న, స్వతంత్ర చిత్రాల మేకర్స్‌కు హాలీవుడ్ సమాన అవకాశాలను కల్పించింది.
హాలీవుడ్ ఏ గుత్తాధిపత్యాన్ని అయితే చట్టాల ద్వారా అడ్డుకుందో టాలీవుడ్‌లో అదే `వర్టికల్ ఇంటిగ్రేషన్` (కొద్దిమంది చేతిలో లాక్ అయి ఉండిపోవడం) చట్టబద్ధంగా, బహిరంగంగానే చలామణి అవుతోంది. ఇక్కడ ఒకే పెద్ద బ్యానర్ భారీ చిత్రాలను నిర్మిస్తుంది.. సొంతంగా పంపిణీ నెట్‌వర్క్‌ను నడుపుతుంది. రాష్ట్రవ్యాప్తంగా వందలాది లీజు థియేటర్లను లేదా మల్టీప్లెక్స్‌లను నియంత్రిస్తుంది. దీనివల్ల చిన్న సినిమాలు ఎంత అద్భుతమైన కంటెంట్‌తో వచ్చినా.. వారికి మార్కెట్లో కనీస స్థానం లభించడం లేదనే ఆవేదన వ్యక్తమవుతోంది.
అంతకంటే దారుణమైన విషయం ఏమిటంటే.. థియేటర్ల రెంట్లు, పర్సంటేజీల విషయంలో వివాదాలు తలెత్తినప్పుడు వాటిని పరిష్కరించే పంచాయితీలు కూడా ఫిల్మ్ ఛాంబర్ లేదా అదే పెద్దన్నల ఆధిపత్యం ఉండే అసోసియేషన్ల వేదికగా ఆ పెద్దల సమక్షంలోనే సాగుతాయి. ఇక్కడ న్యాయం అడగాల్సిన వాడూ.. తీర్పు చెప్పే పెద్ద మనుషులూ ఒకే వర్గానికి చెందినవాడు అయితే ఏమవుతుందో గ్రహించలేరా? ఈ సిండికేట్ వ్యవస్థ లేదా పెద్ద బ్యానర్ల డ్యూయల్ రోల్ (నిర్మాత కం ఎగ్జిబిటర్) కొనసాగుతున్నంత కాలం.. వివాదాల పరిష్కారాలు ఎప్పుడూ `కార్పొరేట్ సర్దుబాట్లు` గానే ముగుస్తాయి. పైకి సమస్య సద్ధుమణిగినట్లు కనిపించినా లోపల చిన్న నిర్మాతలకు లేదా స్వతంత్ర థియేటర్ల యజమానులకు సంపూర్ణ న్యాయం చేకూర్చేలా పారదర్శకమైన ముగింపు తీర్పు రావడం దాదాపు అసాధ్యం.
పరిశ్రమలో విషయం ఉన్న చిన్న చిత్రాలు బతకాలన్నా.. స్వతంత్ర సింగిల్ స్క్రీన్లు మనుగడ సాగించాలన్నా.. చిత్ర పరిశ్రమకు సంబంధించిన అసోసియేషన్ల బై-లాస్ మారాలని బాధితులు ఎప్పుడూ కోరుకుంటూనే ఉన్నారు. చిన్న సినిమాలకు కచ్చితమైన థియేటర్ కోటాలు కేటాయించడం... అలాగే ఎగ్జిబిషన్ లేదా ప్రదర్శన రంగాన్ని పూర్తిగా స్వతంత్రంగా ఉంచేలా అంతర్గత రక్షణ కల్పించినప్పుడే టాలీవుడ్‌లో నిజమైన పారదర్శకత సాధ్యమవుతుందని పలువురు న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. టాలీవుడ్ లో దర్శకరత్న డా.దాసరి నారాయణరావు, చిన్న సినిమాల సంఘం అధ్యక్షుడిగా ఉన్న నట్టి కుమార్ వంటి వారు ఈ సిండికేట్ వ్యవస్థపై తీవ్రంగా విరుచుకుపడేవారు. ఈ గుత్థాధిపత్యాన్ని మీడియా ఎదుటే వ్యతిరేకించేవారు. అయినా సమస్య ఎప్పుడూ మొదటికే రావడానికి కారణం సిండికేట్లు ఎవరూ ఛేధించలేనంత బలంగా ఉండటమేనని కూడా విశ్లేషణలు వెలువడ్డాయి.