`పెద్ది`కి లైన్ క్లియర్.. పర్సంటేజీకి నిర్మాతలు సానుకూలం: దిల్ రాజు
టాలీవుడ్‌లో గత కొన్ని రోజులుగా ఉత్కంఠ రేపుతున్న థియేటర్ల ఆదాయ పంపిణీ వివాదం ఎట్టకేలకు ఒక శుభం కార్డు దిశగా సాగుతోంది.
టాలీవుడ్‌లో గత కొన్ని రోజులుగా ఉత్కంఠ రేపుతున్న థియేటర్ల ఆదాయ పంపిణీ వివాదం ఎట్టకేలకు ఒక శుభం కార్డు దిశగా సాగుతోంది. తెలంగాణ ఎగ్జిబిటర్లు డిమాండ్ చేసిన `పర్సంటేజీ షేరింగ్` విధానానికి నిర్మాతలు దాదాపుగా అంగీకరించినట్లు అగ్ర నిర్మాత, ఎగ్జిబిటర్ దిల్ రాజు అధికారికంగా ప్రకటించారు. తెలుగు ఫిలిం ఛాంబర్‌లో ఎగ్జిబిటర్లు, నిర్మాతలు , పంపిణీదారుల మధ్య జరిగిన కీలక సమావేశం విజయవంతం కావడంతో పరిశ్రమలో నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయింది. ఈ నిర్ణయంతో రామ్ చరణ్ నటించిన భారీ చిత్రం `పెద్ది` విడుదలకు ఉన్న ప్రధాన అడ్డంకులు తొలగిపోయాయి.
ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ... మూడు సెక్టార్ల (నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు) ప్రతినిధులు అందరూ కూర్చుని చర్చించుకున్నామని.. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుంటున్నామని వెల్లడించారు. పర్సంటేజీ విధానం అమలుకు నిర్మాతలు సానుకూలంగా స్పందించడంతో.. దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేయడానికి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కమిటీ ఏ సెంటర్, బి సెంటర్ , సి సెంటర్‌లలో ఈ కొత్త విధానాన్ని ఎలా పారదర్శకంగా అమలు చేయాలో పరిశీలిస్తుందని ఆయన వివరించారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న `పెద్ది` చిత్రం గురించి దిల్ రాజు ప్రత్యేకంగా ప్రస్తావించారు. `జూన్ 4న `పెద్ది` సినిమా చాలా హెల్తీగా (సజావుగా) విడుదలవుతుంది... దీనిపై ఎవరికీ ఎలాంటి సందేహాలు అవసరం లేదు! అని ఆయన భరోసానిచ్చారు. దిల్ రాజు మీడియా ముందు ఈ ప్రకటన చేసేప్పుడు అక్కడ పెద్ది నిర్మాత సతీష్ కూడా ఉండటంతో ఇక రిలీజ్ కి డోఖా లేదని క్లారిటీ వచ్చింది. ఇక పర్సంటేజీ డిమాండ్‌కు నిర్మాతలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఈ సినిమా సందడికి మార్గం సుగమమైందని భావించవచ్చు. వివాదాల వల్ల పెద్ది సినిమా వసూళ్లు దెబ్బతింటాయేమో అన్న ఆందోళనకు ఈ ప్రకటనతో తెరపడింది.
మరోవైపు సీనియర్ నిర్మాత డి. సురేష్ బాబు కూడా ఈ పరిణామాలపై సానుకూలంగా స్పందించారు. సమస్యను అన్ని కోణాల్లోనూ పరిశీలించి పరిష్కరించుకుంటున్నామని.. ప్రతిదీ సజావుగా సాగుతోందని ఆయన పేర్కొన్నారు. పరిశ్రమలోని ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా... ఒక పాజిటివ్ రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్నామని సురేష్ బాబు తెలిపారు. ఎగ్జిబిటర్ల చిరకాల వాంఛ అయిన పర్సంటేజీ మోడల్ అమలులోకి రావడం వల్ల థియేటర్ల మనుగడకు భరోసా లభించినట్లయిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
మొత్తానికి టాలీవుడ్ పెద్దల చొరవతో థియేటర్ల సంక్షోభం సమసిపోవడమే కాకుండా... పెద్ద సినిమాల విడుదలకు లైన్ క్లియర్ అయింది. పాత అద్దె విధానం నుండి కొత్త పర్సంటేజీ పద్ధతికి మారడం అనేది తెలుగు సినీ పరిశ్రమలో ఒక పెద్ద మార్పుగా నిలవనుంది. జూన్‌లో విడుదల కాబోతున్న `పెద్ది` ఈ కొత్త విధానానికి ఒక ఆరంభంగా నిలుస్తుందా? అన్నదానికి మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు మరింత స్పష్ఠంగా స్పందించాల్సి ఉంటుంది.