సినీ నిర్మాతలకు భారంగా మారిన నియమాలు?
తెలుగు చిత్రసీమ క్రైసిస్ నుంచి ఇంకా బయటపడలేదు. 15రోజులుగా కార్మిక సమాఖ్య (ఫెడరేషన్) నిరవధికంగా సమ్మెను కొనసాగిస్తోంది.;
తెలుగు చిత్రసీమ క్రైసిస్ నుంచి ఇంకా బయటపడలేదు. 15రోజులుగా కార్మిక సమాఖ్య (ఫెడరేషన్) నిరవధికంగా సమ్మెను కొనసాగిస్తోంది. ఫలితంగా సినిమా షూటింగులు ఎక్కడివి అక్కడ నిలిచిపోయాయి. కొందరు అడిగిన వేతనం చెల్లించుకుని మ్యానేజ్ చేస్తున్నా, చాలా మందికి ఇది సాధ్యం కానిది. ఈ సమయంలో సమస్యను పరిష్కరించేందుకు మెగాస్టార్ చిరంజీవి సహా సినీప్రముఖులంతా ఒక తాటిపైకి వచ్చారు. ఇటీవల పలు దఫాలుగా కార్మిక సంఘాల నాయకులతో మంతనాలు సాగించారు. కానీ చర్చలు ప్రతిసారీ విఫలమవుతూనే ఉన్నాయి. ఇరు వర్గాలు ఈ విషయంలో దిగి రావడం లేదు. 30 శాతం వేతన పెంపును అమలు చేయాల్సిందేనని కార్మిక ఫెడరేషన్ డిమాండ్ చేస్తుంటే, ససేమిరా కుదరదని నిర్మాతలు వాదిస్తున్నారు.
అయితే నిర్మాతలు తక్షణం 10శాతం తక్షణ వేతన పెంపునకు ఆమోదం తెలిపారు. వచ్చే ఏడాది మరో 5శాతం, మరుసటి ఏడాది మరో 5 శాతం వేతనాలు పెంచేందుకు కూడా అంగీకరించారు. అయితే 2000 రూపాయలు లేదా అంతకుమించి అందుకునే కార్మికులకు ఈ నియమం వర్తించదని, చిన్న నిర్మాతలకు వేతన పెంపు వర్తించదని నిర్మాతలు అన్నారు. దీనిని అంగీకరించేందుకు కార్మిక సమాఖ్య (ఫెడరేషన్) సిద్ధంగా లేదు. తమను వర్గాలుగా విభజిస్తున్నారని కార్మిక సమాఖ్య వాదిస్తోంది. అలా కాకుండా అందరికీ వేతనాలు ఒకే విధంగా పెంచాలని డిమాండ్ చేస్తోంది.
ప్రస్తుతానికి నిర్మాతలు కొన్ని సవరణలకు కట్టుబడి ఉన్నట్టు తెలిసింది.. వాటి వివరాలు ఇలా ఉన్నాయి :
*సినీ కార్మికులకు ఈ ఏడాది 10శాతం, వచ్చే ఏడాది నుంచి రెండేళ్ల పాటు 5 శాతం పెంచడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ పెంపు ఇతర చిత్ర పరిశ్రమల్లో కార్మికులకు చెల్లిస్తున్న దానికంటే ఎక్కువగానే ఉంది. రోజుకు 2 వేల రూపాయల కంటే ఎక్కువ వేతనాలు తీసుకుంటున్న కార్మికులకు ఇంకా పెంచడం ఏమాత్రం సరైనది కాదన్నది అభిప్రాయం.
*ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితుల్లో సినిమా మేకింగ్ ను ఇంకా సమర్థవంతంగా చేసే మార్గాలను నిర్మాతలు అన్వేషించాల్సిఉంది. సినీ కార్మికులకు వేతనాలు పెంచడాన్ని చిన్న నిర్మాతలు అంగీకరించడం లేదు.
*సినిమా కోసం 24 క్రాఫ్టుల కార్మికులు పనిచేసే విధానం మారాల్సిన అవసరం ఉంది. 50 ఏళ్ల కిందట యూనియన్లు రాసుకున్న నిబంధనల ప్రకారం వెళ్తే ఇప్పటి నిర్మాతలు సినిమాలు నిర్మించలేరు. అందువల్ల కార్మికుల పని సమయాన్ని సవరించాలని సూచిస్తున్నారు. ఇతర చిత్ర పరిశ్రమల్లో ఉన్నట్లే టాలీవుడ్ లోనూ సినీ కార్మికుల పని గంటలు ఉండాలని నిర్మాతలు కోరుతున్నారు.
*దేశీయంగా హైదరాబాద్ నగరం సినీ రంగానికి హబ్ గా మారుతోంది. కార్మికులు ఇలాంటి నిబంధనలు విధించడం వల్ల ఇతర భాషల నుంచి మేకర్స్ నగరానికి రావడానికి ఆసక్తి చూపించరు. అందువల్ల జాగ్రత్తలు వహించాలి.
*సృజనాత్మక పరిశ్రమ అయిన టాలీవుడ్ లో స్కిల్ డెవలప్ మెంట్ తో పాటు కొత్త టాలెంట్ రావాల్సిన అవసరం ఉంది. యూనియన్ లో చేరేందుకు లక్షలాది రూపాయలు రుసుములు వసూలు చేస్తుండటం కొత్త టాలెంట్ చిత్ర పరిశ్రమలోకి రావడం అవరోధంగా మారుతోంది.
*అనేక కారణాలతో నిర్మాతలకు సినిమాల నుంచి తమ పెట్టుబడికి తగిన ఆదాయం రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కార్మికులకు వేతనాలు పెంచడం నిర్మాతలపై మరింత భారమవుతుంది. దీనిని అందరూ అర్థం చేసుకోవాలి.