2026:టాలీవుడ్ హీరోలు ఆ విషయంలో మారాల్సిందేనా?
పాన్ ఇండియా సినిమాల ప్రవాహం మొదలైన దగ్గరి నుంచి టాలీవుడ్‌లో సినిమాల మేకింగ్ పెరిగింది. అంతే కాకుండా సినిమాల బడ్జెట్ కూడా తారా స్థాయికి చేరింది.;
పాన్ ఇండియా సినిమాల ప్రవాహం మొదలైన దగ్గరి నుంచి టాలీవుడ్‌లో సినిమాల మేకింగ్ పెరిగింది. అంతే కాకుండా సినిమాల బడ్జెట్ కూడా తారా స్థాయికి చేరింది. మినిమమ్ గ్యారెంటీ హీరో కూడా భారీగా డిమాండ్ చేస్తున్నాడు. తన సినిమాకు బడ్జెట్ కూడా అదే విధంగా ఉండాలని కండీషన్‌లు పెడుతున్నాడు. స్టార్ హీరోలు సైతం కోవిడ్ తరువాత నుంచి తమ రెమ్యునరేషన్‌లు పెంచేసి భారీ మొత్తాల్లో నిర్మాతల నుంచి వసూలు చేస్తున్నారు. ఓటీటీల ప్రభావం భారీగా పెరగడం, భారీ స్థాయిలో డిజిటల్ రైట్స్ రూపంలో వస్తుండటంతో నిర్మాతలు కూడా డిమాండ్ చేసినంత ఇచ్చేస్తున్నా వస్తున్నారు.
ఇది 2025 ఎండింగ్ వరకు మాత్రమే. ఇప్పుడు సీన్ మారింది. కుప్పలు తెప్పలుగా సినిమాలు వస్తుండటం, కంటెంట్ ఊహించిన దానికి మించి ఓటీటీ ప్లాట్ ఫామ్‌ల తలుపు తడుతున్న నేపథ్యంలో ఓటీటీ మార్కెట్ తో పాటు శాటిలైట్ డీల్స్, థియేట్రికల్ బిజినెస్‌లో చాలా వరకు మార్పులు మొదలయ్యాయి. ఇటీవల భారీ అంచనాల మధ్య విడుదలైన స్టార్‌ల సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌లుగా నిలవడంతో ఓటీటీ మార్కెట్, శాటిలైట్ డీల్స్, థియేట్రికల్ బిజినెస్‌లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి.
అనూహ్యంగా మార్కెట్ క్షీణించడంతో టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారట. ఇదే క్రమంలో ఓటీటీ ప్లాట్ ఫామ్‌లు కొత్త నిబంధనలు విధించడం కూడా నిర్మాతలకు మరింత భారంగా మారుతోందనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. ఆ కారణంగా ఫైనాన్షియర్లు నిర్మాతలకు మునుపటి తరహాలో నిధులను స్వేచ్ఛగా ఇవ్వడానికి సిద్ధపడటం లేదట. కానీ మన హీరోలు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. భారీ పారితోషికాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో తీవ్ర ఒత్తడికి గురవుతున్న నిర్మాతలు తాము ఎదుర్కొంటున్న సమస్యలని వారి దృష్టికి తీసుకెళ్లడానికి ఇబ్బందిపడుతున్నారు.
కొంత మంది హీరోలు ప్రొడ్యూసర్ల ఇబ్బందిని గుర్తించి పారితోషికం డిమాండ్ చేయకుండా లాభాల్లో వాటాలు పంచుకునే విధానానికి సై అంటున్నారు. ఇదే క్రమంలో చిన్న హీరోలు, అసలే హిట్టు అనే మాటే వినని వారు మాత్రం భారీగా పారితోషికాలు డిమాండ్ చేస్తున్నారు. దీని వల్ల కొన్ని ప్రాజెక్ట్‌లు చేతులు మారితే మరికొన్ని ఆగిపోయిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మార్పులు రావాలన్నా, ఇండస్ట్రీ మళ్లీ పుంజుకోవాలన్నా స్టార్ హీరోల్లో పారితోషికం విషయంలో మార్పులు రావాల్సిన అవసరం ఉంది.
సక్సెస్ రేట్ భారీగా పడిపోయిన నేపథ్యంలో హీరోలు పారితోషికం విషయంలో తగ్గితేనే నిర్మాతలపై ఒత్తిడి తగ్గుతుందని, రెమ్యునరేషన్‌లు కాకుండా లాభాల్లో వాటాల పద్దతికి మన స్టార్లు ముందుకొస్తేనే మళ్లీ ఇండస్ట్రీ పూర్వవైభవాన్ని సంతరించుకుంటుందనే కామెంట్‌లు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ పద్దతికి రవితేజ లాంటి హీరోలు ముందుకు రావడంతో రానున్న రోజుల్లో మిగతా స్టార్లు కూడా ఇదే పద్దతికి సై అంటారని అంతా ఆశిస్తున్నారు.